Long time no see
కాలం గుప్పెట్లో (కవిత్వం)
విర్రవీగిన దురహంకారము
విచక్షణను లోబరుచుకుంది
కౌగిలి వీడని కాఠిన్యం
కన్నీళ్ళను ఖడ్గాలుగ మార్చుకుంది
పొగమంచును తాకిన ప్రేమలు
పొలిమేరలు దాటి వెల్తున్నాయి
స్వార్థపు సింహాసనమెక్కాక
మనసుపావురాన్ని బంధీగా మార్చుకున్నాడు
కాటేసే విషసర్పాలకు సలాము కొడుతూ
గుండె పొరలనిండా విషాన్ని నింపుకుంటున్నాడు
అర్ధనగ్న దృశ్యాలెన్నో
అరాచకాలు సృష్టిస్తున్నాయి
కుబుసం తొడిగాక కూడా
పాము బుసలు కొట్టడం మానలేదు
కళ్ళు మూసుకుని కాలాన్ని
గిరగిరా తిప్పేయాలనుకుంటూనే
కనుసైగలతో కనికట్టు చేస్తూ
కట్టి పడేయాలనుకుంటున్నాడు
శ్వాసిస్తున్నాడు కాని,
అతని ధ్యాసంతా ముఖానికి రంగుపూసుకునే పనిలో వుంది
ఇప్పుడు,
పద్మవ్యూహంలోనికి చొరబడిన అభిమన్యుడతడు
అతనికి తెలియడం లేదు
ఆఖరి కోరిక కూడా కోరుకొమ్మనని
మృత్యువాసన
తన ముక్కుపుటాలను తాకుతోందని
కాని,
ఏనాడో ఒకనాడు కాలం తన గుప్పెట్లో బంధించకమానదు
కట్టుకున్న మేడల్లో శిథిలాలుగా
తలవాల్చక తప్పదు….
మచ్చరాజమౌళి
దుబ్బాక, 9059637442