‘Please save me …!’ – O.U ‘నన్ను కాపాడండి ప్లీజ్…!’ – ఓయూ

‘Please save me …!’ – O.U

‘నన్ను కాపాడండి ప్లీజ్…!’ – ఓయూ

సోషల్ మీడియా.. సోషల్ మీడియా.. ఎవ్వరు చేయని పనులను నిస్వార్థంగా ఈ సోషల్ మీడియా చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తమను పట్టించుకోవడం లేదని ‘‘నన్ను కాపాడండి ప్లీజ్…!’ – ఓయూ’’ అంటూ రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాసిన రచయిత పేరు లేదు… కానీ.. ‘‘ ఇట్లు… మీ ఉస్మానియా విశ్వవిద్యాలయం.’’ అంటూ రాసిన లేఖలో తమ గోడును యూనివర్సిటీ తెలంగాణ ప్రజలకు చెప్పుకున్నట్లు ఉంది.

ప్రియమైన తెలంగాణ ప్రజలారా,

నమస్తే,

నేను ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మాట్లాడుతున్నాను. మీ అందరూ ఎంతో ప్రేమగా ‘తెలంగాణా చదువుల తల్లి’గా పిలుచుకుంటున్న ‘ఓయూ’ని మాట్లాడుతున్న. నన్నింతకాలం అత్యంత ప్రేమతో, బాధ్యతతో ఆదరించిన మీ అందరికీ శనార్థులు.

మీ గోడు వినడమే కానీ  ఎన్నడూ నా గురించి చెప్పుకోలేని నేను ఇవాళ అనివార్య పరిస్థితిలో నా మనసువిప్పి మాట్లాడుతున్న. వందేడ్లు మీ బాగోగులు చూసుకున్న నా పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగాలేదు బిడ్డ.  నన్ను నేను చూసుకుంటే నాకే అసహ్యంగా ఉంది. నిజాం హాయంలో (1917) పురుడుపోసుకున్నాను కదా, వందేండ్లు నిండినయి ఈ వయసులో ఇలానే వుంటుందిలే అనుకునేరు. ఇది వయసు వల్ల వచ్చిన పరిస్థితి కాదు.  నన్ను పోషించేవాళ్ళు, నా ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక దయానీయస్థితిలో ఉన్నాను. నాపట్ల కాస్త శ్రద్ధ పెట్టి బాగోగులు చూసుకుంటే మీ అందరికీ గతంలో ఎలా సేవలు చేశానో భవిష్యత్తు తరాలకు కూడా అలానే చేస్తాను.

నా ఒడిలో విద్యా బుద్ధులు నేర్చుకొని, నా సేవలు పొందిన వాళ్ళు ఇవాళ పాలకులలుగా, బాధ్యతాయుతమైన పదవుల్లో అధికారులుగా, మేధావులకు, శాస్త్రవేత్తలుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారవేత్తలుగా ఉన్నారు. అది ఒకందుకు నాకు గర్వకారణమే.కానీ, ఇంత మందిని అందరించిన నా ప్రస్తుత పరిస్థితి మాత్రం దీనంగా ఉంది. నా ఆలనా పాలనా చూసేవాళ్లే కరువయ్యారు. సమాజానికి నేను చేసిన సేవలను  ఓ సారి గుర్తుచేస్తే అయినా మీరు నా గురించి ఆలోచిస్తారని ఓ చిన్ని ఆశతో నా గోడును మీతో చెప్పుకుంటున్నాను బిడ్డ.  కనీసం నా గోడును వినైనా,  గత వైభవాన్ని చూసైనా మీ కరుకు గుండె కరగక పోతుందా అన్న నమ్మకం ఇలా నాచేత ఏకరువు పెట్టిస్తోంది.

సరిగ్గా భారత స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో నేను పురుడుపోసుకున్నాను. కాస్త వయసులో ఉన్నప్పుడే నా బిడ్డలు ‘వందేమాతరం గీతం’ పాడారు అనే సాకుతో కఠినాత్ముడైన నిజాం నా బిడ్డల్లో కొందరిని దూరం చేశాడు. పుట్టెడు దుఃఖంతో వాళ్లకోసం పోరాటం చేసాను. దాన్నుండి తేరుకున్నానో లేదో నైజాం సంస్థానంలోని భూస్వాములు నిజాం అండదండలతో సబ్బండ వర్గాలపై పడి రాబందులుల్లా పీకుంటున్నప్పుడు వాళ్ళను ప్రతిఘటించడానికి నా కన్న బిడ్డలను ఉద్యమానికి ధార పోసాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నేను పోరుగడ్డనయ్యాను. నా ఒడిలోని ఆడి, పాడిన బిడ్డలు వీరుల్లా పోరాడి నిరంకుశ పాలను నుంచి విముక్తిని కల్పించారు.

ఓవైపు విద్యాబుద్ధులు నేర్పుతూనే వీరుల్ని తయారు చేసిన నేను, నా ఒడిలోకి చేరిన బిడ్డలపట్ల ఏనాడు వివక్షత చూపలేదు.  వెలివాడల నుంచి గ్రామ అంచుల దాకా ఎక్కడివారికైనా నేను నేర్పిన అక్షరం వారి జీవితాల్లో దీపాలు వెలిగించింది. కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత భేదాలను తొలగించడానికి అవసరమైన సైద్ధాంతిక చర్చను నా ఇంట్లోనే నేర్పాను. నూరు పూలు వికసించని, వేయి ఆలోచనలు సంఘర్శించని అన్నట్లు విభిన్న భావజాలాలు కలిగిన విద్యార్థి సంఘాల ఆవిర్భావానికి నేనే ఊపిరిపోసాను. అనేక ఆస్తిత్వ సంఘాలకు కూడా నేనే చేదోడు వాదోడుగా ఉన్నాను.

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష కార్యాచరణ కేంద్రాన్ని నేనే. తెలంగాణ వెనుకబాటుకు కారణాలను అన్వేషించి అనేక ఆలోచననలకు, ఆవేశ పూరిత ప్రసంగాలకు నా ప్రాణం పోశాను. సీమాంధ్ర వలసవాదుల నుండి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి అనేక మంది నా పిల్లలు ప్రాణాలు త్యాగం చేసారు. నా పిల్లల రక్త మాంసాలతోనే నేడు తెలంగాణ ఏర్పడ్డది. పార్టీలకు అతీతంగా అధికారం చలాయించినా వారందరు నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే. మట్టి ముద్దలుగా వచ్చే పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాను. ప్రపంచ వ్యాప్త సమస్యలకు నా పిల్లల దగ్గర సైద్ధాంతిక పరిష్కారం లభించింది. నా పిల్లలు ఎంతో ఘనమైన మేధో సంపత్తిని  కలిగి సమాజాన్ని  అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయారు. ఈ విధంగా గతంలో నా పరిస్థితి  వైభవంగా సాగింది.

ఇదంతా నా గతం బిడ్డ. కానీ ప్రస్తుతం నేను అనేక సమస్యలతో సతమతమవుతున్నాను. నేను ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా మీ దృష్టికి తీసుకువస్తాను.  నా కోసం పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితి వచ్చింది. నేను ఆర్థికంగా చితికిపోయాను. నా కోసం నా పిల్లల కోసం తమ జీవితాన్ని ధార పోసిన నా ఉద్యోగస్తులకు జీతాలు, పెన్సన్లు ఇచ్చి వారిని ఆదుకోలేని స్థితికి చేరుకున్నాను. ఆస్తులు సంపాదించలేదని వారసులు తల్లిదండ్రులను తిట్టినట్లు నన్ను తిట్టని తిట్లు తిడుతున్నారు. 

ముష్టి వేసినట్లు నాకు కొంత నిధులను కేటాయిస్తున్నారు. వాటితో నన్ను ఎలాగోలా బతకమని అదేశిస్తున్నారు. కానీ చాలీచాలని నిధులతో నా పిల్లని చంపుకోలేక గంజినీళ్లు పోస్తూ బతుకీడుస్తున్నాను. నా పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నాను. పదవి విరణం చేసి రోజు రోజుకు టీచర్లు తగ్గిపోతున్నారు. ఒకనాడు వేలమంది అధ్యాపకులతో కళకళలాడే నా ఇల్లు ఇవాళ బోసి పోతుంది. 2013 నుండి ఇప్పటి వరకూ అధ్యాపకుల నియామకాలు లేవు. గత రెండున్నర దశాబ్దాలుగా నాన్ టీచింగ్ నియమాకాలు కూడా జరగలేదు. సరైన సదుపాయాలు లేక విద్య సరిగ్గా అందడంలేదు.

నా పెద్ద కొడుకులాంటి వైస్ చాన్స్‌లర్ గత ఆరు నెలలుగా లేనే లేడు. అతను లేకపోవడం మూలంగా నా పాలన అంతా కుంటుబడిపోయిది. అవినీతి పెరిగిపోయింది. నా చిన్న పిల్లల మధ్య సమన్వయం లోపించింది. వెంటనే నాకు పెద్ద కొడుకు కావాలి. వాడు ఉంటే గానీ నేను చక్కబడలేను. నన్ను పరిపాలించే పాలక మండలికూడా కావాలి. విద్యార్థి అనుకూలమైన నిర్ణయాలు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. కనుక నా పిల్లలను నా దగ్గరికి చేర్చండి.

కళ్ల ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా నోరు ఉండి మాట్లాడలేని దానినయ్యాను. తెలంగాణకు ఓ నాడు విజ్ఞాన భాండాగారంగా వెలుగొందిన నేను ఇవాళ నిసహాయ స్థితిలో ఉన్నాను. నా దగ్గరకు వస్తే ఎలాగో ఆదరిస్తానని ఇప్పటికీ తెలంగాణ మారుమూలల నుండి వేలాది మంది విద్యార్థులు ఎంతో ఆశగా నా దగ్గరకు వస్తూనే ఉన్నారు.వారికి మంచి భవిష్యత్తును కల్పించాలని బలమైన కోరిక ఉన్నా  ఇక్కడి అకాడమిక్ వాతావరణం దెబ్బతినడం వల్ల నెరవేరని కోరికగా మిగిలిపోయింది. నిధులు లేకపోవడంతో నైజాం కాలంలో గుర్రాలను కట్టేసిన గుర్రపు శాలలే నా పిల్లలకు హాస్టళ్లు గా కొనసాగుతున్నాయి. వాటికీ సరైన నిర్వాహణ లేక కూలిపోయి శిథిలావస్థలోకి చేరుకున్నాయి. అందులో నివసిస్తున్న నా పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు.

మహాలఖ చందా బాయీ అనే నర్తకి దాతృత్వంతో నాకు ఇచ్చిన వందలాది ఎకరాలను చాలా మంది కబ్జా చేస్తున్నారు. మరికొంతమంది గుడుల పేరుతో, మసీదుల పేరుతో మత మాఫియాను కొనసాగిస్తున్నారు. విజ్ఞానంతో వెలగాల్సిన కళాశాలలు అవినీతికి అడ్డాగా మారిపోతుంది. రక్తం ధారపోసి తెలంగాణ ను సాధిస్తే నా పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఆంధ్రా ప్రొఫెసర్ల పిల్లలకి అడ్డదారిలో ఉద్యోగాలు కల్పించారు. నా పిల్లలు మాత్రం ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇన్నీ ఘోరాలను చూస్తూ కూడా ఇంకా నేను జీవశ్చవంగా బతికి ఉన్నాను. విలువైన పరిశోధన పత్రాలు రాయాల్సిన నా పిల్లలు విధిలేక పోరబాట పట్టాల్సి వస్తుంది.

ప్రియమైన తెలంగాణ ప్రజలారా నన్ను కాస్త పట్టించుకోండి. నా ఒడిలో రాజకీయ ఓనమాలు దిద్దిన రాజకీయ నాయకులు నన్ను ఇప్పుడు పట్టింటుకోవడం లేదు. ఓయూని పట్టించుకోవడమంటే తెలంగాణ భవిష్యత్తుకు మార్గం వేయడమేనని గుర్తెరగండి ఓ విద్యార్థులారా, ఉద్యోగుల్లారా, అధ్యాపకుల్లారా, మేధావుల్లారా,  కవులారా, రచయితలారా నన్ను నా సమస్యల నుండి రక్షించుకోండి. మీ అమ్మను మీరే కాపాడుకోండి. నా శక్తి ఉడిగిపోయింది. తల్లిపాలు తాగి రొమ్ముని గుద్దినట్లు చేయకండి. ఆలోచించండి……

     ఇట్లు…

మీ ఉస్మానియా విశ్వవిద్యాలయం.

'Please save me ...!' - O.U /zindhagi.com/ Osmania University/ OU problems / Yatakarla Mallesh
Comments (0)
Add Comment