Pittala Srisailam Muchukunda Muchatlu-6
పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు – 6
113 ఏండ్ల యాది…
రెండవ బిడ్డకు మూసి పేరు.. 150 మందిని రక్షించిన చెట్టు..
ఏడ మరుస్తనో తెల్వది గదా, అందుకే నా రెండవ బిడ్డకు మూసీ, అదే ముచుకుంద అని పేరు పెట్టుకున్న. 1908 సెప్టెంబర్ 27 న మెుదలైన వాన, 28 న తీవ్ర రూపం దాల్చింది. అప్పుడు మూసీ వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. దాదాపు 150 మందిని – ఇప్పుడు ఉన్న ఉస్మానియా హాస్పిటల్ వెనుక వైపు ఉన్న, అఫ్జల్ పార్క్ లోని ఈ చింతచెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
పదిహేను వందల మంది దాక చనిపోయారంట. ప్రతి ఏటా సెప్టెంబర్ 28 న ‘ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్’ చైర్మన్ ఎం.వేద కుమార్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ ప్రకృతి ప్రేమికులు ఆ చింత చెట్టు కింద కూర్చొని , ముచుకుంద ముచ్చట్లు చెప్పుకొని పొయేటోల్లు. అట్లా మేము కూడా 2007 నుంచి, ప్రతి ఏటా మా పిల్లలు తెలంగాణ కోకిల, మూసీ, మా కృష్ణవేణి పొయేటోల్లం.
కొన్ని సార్లు భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహరెడ్డి, మిత్రులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, చందుపట్ల జీవన్ రెడ్డి తో కలిసి కూడా, అప్పుడప్పుడు వెళ్లేవాళ్లం. ఈసారి సుదర్శన్ రెడ్డి తో పాటు ,చందుపట్ల ధర్మారెడ్డి, మేకల పద్మారావు, ప్రవీణ్ రెడ్డిలం పోయినం.
మూసి నది రక్షణ కోసం ఉద్యమం..
అసలు మాకూ, ఆ చింత చెట్టుకూ ఎం సంబంధం. ఆ మూసీ నది వరదలలో కొట్టుకపోయిన వాళ్లలో, మా వాళ్లు ఏవరు లేరు. పోనీ, ఆ నీళ్ల తో పంటలు పండించుకున్న వారిమి అంతకంటే కాదు. ఎందుకంటే మాకు గుంటెడు భూమి కూడా లేదు. కాని 1997. నాటికే, మూసీతో ఏదో దగ్గరి ఫీల్ అనిపించింది. అది కూడా ప్రొఫెసర్ ముత్యంరెడ్డి ఢిల్లీ లో జరిగిన సెమినార్ లో ‘మూసీ రివర్ సోషియెా ఎకనామికల్ కండిషన్ ‘ మీద, ఒక పేపర్ ప్రజెంటేషన్ చేశారు. అది ‘వార్త ‘ దినపత్రికలో వార్తగ వచ్చింది.
‘మూడు జిల్లాలకు ముప్పు తెస్తున్న మూసీ’ అని, పేపర్ల వచ్చిన ఈ క్యాప్షనే, మాకు ఉద్యమం చేసేలా ప్రేరణ గా నిలిచింది. 1980 దాక మూసీ నీళ్లలో పైసలు ఏసి తీసేటోల్లు. అంత తేటగా ఉండేవి నీళ్లు. అందరికి పనికి రావనుకునే వస్తువులను, డ్రైనేజీలను మూసీలో ఏస్తరు, కలుపుతరు. పరిశ్రమల వ్యర్థ రసాయనాలను కూడా కలిపి, మూసీని మురికి కాల్వగా మార్చిండ్రు. మూసీ నది మురికి కాల్వ కాదు మూసీ నది జీవ నది.
తెలంగాణలో పుట్టిన ఏకైక మూసి నది ఒక్కటే..
తెలంగాణలో పుట్టి, తెలంగాణలోనే కృష్ణా నదిలో కలిసే ఏకైక నది మూసీ మాత్రమే. ముందుగా బీబీనగర్ మండలం గూడూరులో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్ మిత్రులు ఇంజమూరి రఘునందన్ ని ‘మూసీ పరిరక్షణ పోరాట సమితి’ కన్వీనర్ గా, మూసీ పరివాహక ప్రాంతంలో పోస్టర్లు అతికించినం. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రోఫెసర్లు పురుషోత్తం రెడ్డి, ముత్యంరెడ్డి, కెప్టెన్ రామారావు, కె ఎస్ చలం, ఎస్. జీవన్ కుమార్, ఇన్నయ్య, బెల్లి లలిత తదితరులతో ఊరూర మీటింగులు పెట్టినం. ఇట్ల మూసీని లైం లైట్ లో పడేటట్టు చేసినం. కనుక మరుస్తే ఎట్లా మరి?!
అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేదం..
అప్పటికే తెలంగాణ అనే పదాన్ని, అసెంబ్లీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , నారా చంద్రబాబునాయుడు నిషేధం విధించిండు. కేవలం’ కరువు పీడిత ప్రాంతాలు’ అనమన్నడు. ఆ సమయంలోనే మా కృష్ణవేణి కడుపులో ఉన్న నా పెద్ద బిడ్డకు ‘తెలంగాణ’ అని పేరు పెట్టిన. రోజు స్కూల్ లో టీచర్ అటెండెన్స్ తీసుకునేపుడు ‘తెలంగాణా’ అని అనేలా చేసిన. నిత్యం తెలంగాణని నినాదం లా మార్చుకున్న. అట్లనే జీవనది లాంటి మూసీ నదిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. దాని పూర్వ వైభవం కోసం పనిచేయాలా. అందుకే మార్చిపోకుండా ఉండేందుకే , నా చిన్న బిడ్డ కు ముచుకుంద అదే మూసీ అని పేరు పెట్టుకున్న. అట్లా మూసీ నది ని కాపాడుకోవడం కోసం, ఎంతో కొంత ప్రజలలో అవగాహన కల్పిస్తూ వస్తునే ఉన్నా. ఆ తర్వాత కొంత కాలం పేపర్ స్టేట్ మెంట్లకే పరిమితం అయ్యాం.
మూసీ పరిరక్షణ పోరాట సమితి ఆందోళన
మూసీ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ గా ఏదులాబాద్ కు చెందిన బట్టే శంకర్ ని కన్వీనర్ గా పెట్టినం. మూసీ పరిరక్షణ పోరాట సమితి, పర్యావరణ పరిరక్షణ ఉద్యకారులు, శాస్త్రవేత్తలు ఇంకా బుద్దిజీవులు అందరు ఏదో ఒక రూపంలో ప్రెజర్ గ్రూప్ గా పనిచేస్తునే ఉన్నారు. కాని ప్రభుత్వాలు మూసీ నది మీద,మూసీ సుందరీకరణ, సేవ్ మూసీ, మూసీ ప్రక్షాళన లాంటి పేర్లు మార్చుతున్నరు. కాని, మూసీ నది మురికి ఇంకా పోతలేదు. కృష్ణా, గోదావరి పుష్కరాలు జరిపే ప్రభుత్వాలు చివరికి ‘మూసీ పుష్కరాలు’ జరిపితే గిట్ల, మూసీ మురికి వదిలి పూర్వ స్థితికి వస్తదోనన్న చిన్న ఆశ. ఇక తెలంగాణ ప్రభుత్వం అన్నా ఏమన్న చేస్తదేమెా అనుకుంటే, ఈ ఏడేండ్లలో ‘మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు’ ఏర్పాటు చేసి, ఇద్దరికి బుగ్గ కార్ల నిచ్చింది. ఏం చేస్తం మరి ? ఇట్లా యాడాది కొకసారి యాది చేసుకోవడం తప్పా.. ఉంటా మరి!
పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్
మూసీ టివి- మూసీ ఫైబర్ టబ్స్
సెల్: 99599 96597
I actually like your post, the truth in which the internet site is a tiny bit diverse helps make it so helpful, I actually get fed up of finding the similar old tedious recycled stuff almost all of the time.