Pittala Srisailam Muchukunda Muchatlu-1

Pittala Srisailam ‘Muchukunda Muchatlu-‘ పిట్టల శ్రీశైలం ‘ముచుకుంద ముచ్చట్లు-1

 

‘రాస్తవో- చస్తవో , నీ ఇష్టం’ అన్నడు రఘోత్తమరెడ్డి సారు! ఏం చెయ్యడం? ఆయన పట్టుకుంటే ఇడువడు!ఆ సంగతి నాకు తెలుసు!

రాసుడు నా సావుకొచ్చింది. నేనేం చెయ్యాలి. రఘోత్తం సర్ నన్ను ఇడుస్తలేడు. ఎంత మెుత్తుకున్న ఇంటలేడు.

మూడేండ్ల నుంచి మిద్దెతోట టబ్బుల తయారీ మూలంగా, సర్ తో దగ్గరి పరిచయం అయ్యింది . అంతకు ముందు 25 ఏండ్ల కిందట రఘోత్తమరెడ్డి సర్ అంటే కథా రచయిత ,అందులో ‘పనిపిల్ల’ కథా రచయితగా తెలుసు. కాని ఇప్పుడు , 11 ఏండ్ల నుంచి , నారపల్లెలో మిద్దెతోట పెంచుతూ ,మిద్దెతోట నిపుణులుగా, కొత్తగా మిద్దెతోటలు పెంచాలనుకునే వారికి ,సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ,తాను ఎన్నో తీర్ల రచనలు చేస్తూ ,ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు . అట్లనే నాలాంటోల్లను కూడా ఇందులోకి దించుతున్నడు.

రాయలేక రెండు మూడేండ్ల నుంచి తప్పించుకుంటున్న కాని , ఇప్పుడు తప్పెటట్టులేదు.నేను పెన్ను బందుబెట్టి దాదాపు పది యేండ్లు అయ్యుంటది. ఇప్పుడు నా పేరే నాకు సరిగ రాయొస్తలేదు. ఇక ముచుకుంద ముచ్చట్లు చెప్పమంటె ,నేనెట్ల చెప్పేదని తప్పించుకుంటున్నా కూడా, రఘోత్తమరెడ్డి సర్ ఇడిసిపెడ్తలేడు. నీవు రాసుడో.. సచ్చుడో తేల్చుకోమని ఎంటబడుతుండు.

‘గిట్ల అంటున్నడయ్యా ‘ అని, ఇదే వాల్ మీద ‘ఎడ్యుకేషనల్ డైరీ’ సీరియల్ రాస్తున్న డాక్టర్ పుల్లూరు సంపత్ రావు సార్ ను అడిగితే ‘ సచ్చుడు కంటే, రాసుడే బెటర్ శ్రీశైలం’ అని ఆయన అన్నాడు‌. వాయ్యో వామ్మో!

‘ఆలన పాలన’ అనే సీరియల్ మధ్యలో మానేసిన పద్మజ మేడమ్ కూడా’ మీరు రాయాలె రాయాలె’ అనవట్టే!ఇగెట్ల? ఎన్నడు రాయనోళ్లు కూడా, రాయమని చెప్పుడే!

‘నువ్వు రాస్తవు – ఎట్ల మాట్లాడుతవో ,గట్లనే రాయి- నువ్వు చెప్పే ముచ్చట్లన్నీ రాతలోకి రావాలె- అప్పుడే అవి నిలుస్తాయి ‘ అని  రఘోత్తం సార్ ధైర్యం చెప్పవట్టిరి.

అయినా , ‘సరే సరే’ అంటూ ,దాటవేసిన.ఇంతగనం సర్ కు ఎక్కించింది ఎవరై ఉంటారబ్బా అని ,ఆల్లని ఈల్లని అడుగుతున్న. రఘోత్తమరెడ్డి సర్ కు టచ్ లో ఉన్న మహానుభావుడు మా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చినంత పనిజేసినా. కాని ఆయన కొంచెంకొంచమే చెప్పిండంట.

అసలు ఎక్కువగా సారుకు నా గురించి కలిసిప్పుడల్లా కొత్త  ముచ్చట చెప్పుతున్న , అసలు కుట్రదారుడు తేలిండు. ఆయనే ఘట్కేసర్ లో మెుదటి మిద్దెతోట దారుడు, అట్లనే తన బిడ్డ పుట్టిన రోజు కానుకగా ‘ఆద్య టెర్రస్ గార్డన్’అని నిర్మించిన సందుపట్ల జీవన్ రెడ్డి .

అయినా తప్పించుకునేందుకు చెయ్యని ప్రయత్నం లేదు.ఆడని అబద్దం లేదూ.. తప్పట్లేదు రాసుడు. నేను రాయగలుగుతనో లేదో అది నా ఖర్మ. కాని మీరు సదివి ఎట్లుందో చెప్పుడు,ఇప్పుడు మీ ఖర్మ. ఇది మీ నెత్తిమీద రఘోత్తమరెడ్డి సర్ పెడుతున్న భారం. వారం వారం వస్త, ఇట్లనే సతాయిస్తుా ముచ్చట్లు చెప్పుతా. కొన్ని సార్లు ఐటం గాని లెక్క కనిపిస్త.

కొందరేమెా ఆదర్శాల కోసం,నేను బతుకుతున్నట్టు బిల్డప్ ఇస్తుంటనని అనుకొంటారు. కొత్తోల్లకు మాత్రం  పిచ్చోని లెక్కుంట్ట.దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి.

వ్యక్తుల పేర్ల వద్ద ‘గారు’ అని, రాయను, అట్లనే ‘డు’ లాంటి పదాలు వాడుతా.ఇట్ల రాస్తుంటే,వారి పట్ల గౌరవం లేదని కాదూ. నాకు ఇంకా మార్చుకోవడానికి కొంత టైం పడ్తది.

ఇవ్వన్ని సీరియల్ రాయక ముందే చెప్పుతున్న. విని తిట్టెటోల్లు తిట్టాలే. నవ్వెటోల్లు నవ్వాలే. కామెంట్ మాత్రం తప్పదు , రాయాలే. అటు ఇటు పోకుండా ,కనీసం సూసినట్లు లైకన్న కొట్టాలే.లైక్ కొట్టినరని నేను మంచిగ రాస్తున్ననని కాదు. సదివిండ్రని తెలుస్తది అంతే. ఇక మీకు తప్పదు,రఘోత్తమరెడ్డి సర్ తన వాల్ మీదకు తెచ్చినందుకు భరించాలి. ఉంటా మరి

పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్

మూసీ టివి, మూసీ ఫైబర్ టబ్స్, సెల్: 995 999 6597

musi tv/ Pittala Srisailam/ Muchukunda Muchatlu-1/ zindhagi.com/Yatakarla Mallesh
Comments (0)
Add Comment