ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
కీవ్: ఏప్రిల్ 21 : అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. దీంతో రష్యా యుద్ధమూకలను మరింత దీటుగా ఎదుర్కొంటామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ట్వీట్‌చేశారు. ‘ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ రాకతో మా గగనతలానికి మరింత రక్షణ చేకూరింది’ అని ఆయన అన్నారు.
శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ఈ వ్యవస్థతో కూల్చేయొచ్చు. క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి మిస్సైళ్లతోనే ఉక్రెయిన్ పౌర మౌలిక వసతులు ముఖ్యంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలను రష్యా ధ్వంసం చేస్తున్న విషయం విదితమే.
అందుకే జనావాసాలు, మౌలిక వసతుల రక్షణ కోసం కొంతకాలంగా పేట్రియాట్ సిస్టమ్స్ సరఫరా చేయాలని అమెరికాను ఉక్రెయిన్ కోరుతోంది. ఇన్నాళ్లకు అవి ఉక్రెయిన్ చేతికొచ్చాయి.