Padma Shri Award for services
సేవాలకు గుర్తుగా పద్మశ్రీ అవార్డు..
ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డ్ గ్రహీతల్లో ఒకరు షరీఫ్ చాచా. ఈయన అసలు పేరు మొహమ్మద్ షరీఫ్. ఒకప్పుడు సాధారణ సైకిల్ మెకానిక్. పాతిక వేలకు పైనే అనాథ శవాలకు అంత్యక్రియలు చేశారు. ఈ సేవకే ఆయనకు అవార్డ్ వచ్చింది. అయితే ఈయన ఇటువంటి సేవలు అందించడానికి వెనుక ఒక విషాద గాథ ఉంది.
మత ఘర్షణలో అనాధలా కొడుకు మృతి
ఆయన పెద్ద కొడుకు అయిన రయీస్ 1992లో ఫైజాబాద్ (ఇప్పుడు అయోధ్య) దగ్గరలోని సుల్తాన్పూర్ కి వెళ్తుండగా హత్య చేయబడ్డాడు. బాబ్రీ మస్జీద్ రామాజన్మభూమి వివాదం తారాస్థాయిలో జరుగుతున్న సమయం అది. కెమిస్ట్ గా పని చేస్తున్న రయీస్ పని మీద సుల్తాన్పూర్ వెళ్లి తిరిగి రాలేదు. విచారణలో తేలింది ఏంటంటే అతను ఆ మత ఘర్షణల్లోనే చనిపోయాడని. మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన పడి ఉంటే వీధి కుక్కలు పీక్కు తిన్నాయి.
అనాధ శవాలకు అంత్యక్రియలు చేసిన తండ్రి
అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, మార్చురీలు తిరిగి ఎవరు స్వాధీనం చేసుకోని శవాలకు అంత్యక్రియలు చేయడం మొదలుపెట్టారు. 72 గంటల పాటు ఎవరు వచ్చి క్లెయిమ్ చేయని శవాలను పోలీసులు అప్పగించేవారు. అలా మత భేదం లేకుండా దాదాపు 25000 శవాలకు అంత్యక్రియలు జరిపారు.
అప్పు చేసి పద్మశ్రీ అవార్డు కోసం వెళ్లి..
2019లోనే చాచాకి అవార్డ్ ప్రకటించారు. అవార్డ్ ప్రదానం ఢిల్లీలో జరుగుతుందని రావాలని చెప్పారు. అప్పు చేసి మరీ టికెట్లు బుక్ చేస్కున్నారు. కానీ కోవిడ్ వల్ల ప్రదానం వాయిదా వేశారు. టికెట్లు వృధా అయ్యాయి. దాని కోసం చేసిన అప్పులు కూడా ఎప్పటికో తీరాయి. అవార్డ్ అందుకోకుండానే చనిపోతారేమో అని కుటుంబ సభ్యులు బాధపడ్డారు కూడా. ఎందుకంటే చాచా దీన స్థితిలో ఉన్నారు. లివర్, కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స, మందులకి అప్పులు చేసేంత పేదరికం. స్థానిక వక్ఫ్ సభ్యునికి చెందిన రెండు గదుల కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఆయన సైకిల్ దుకాణం కూడా మూతబడింది. ఇంకో కొడుకు సఘీర్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. అతి కష్టమ్మీద ఇల్లు నడుపుతున్నారు. కాళ్లు చేతులు బాగున్నప్పుడు ఎంతో చేసిన చాచాకి ఆలస్యంగా అయినా గుర్తింపు రావడం సంతోషకరమైనా దీన స్థితిలో ఉండడం బాధాకరం.
■ Deepti Aandolan Jeevi వాల్ నుంచి..