మా ఊరి బతుకమ్మ Our hometown is Batukamma
అబ్బ.. గా రోజులెట్లుండె………
ఎంగిలి పువ్వు రెండొద్దులుందనంగనె
బడికి తాతీలిచ్చేటోళ్ళు…
ఇగప్పట్నుండే బతుకమ్మ మానియా పట్టుకునేదూరికి
సోంపూవుకని సెల్కలపంట తిరిగి
కట్టలుగట్టి సూరుకుజెక్కేది
సద్దుల్కొకటి దసరకొక్కటని
మిషిన్ రంగయ్య తాత కాడ
రెండు జతల బట్టలు కుట్టిచ్చేదమ్మ
ఇగ సద్దుల్రేపనంగ సందడి జూడాలే ..
దొరోరి కంచెలకు పోటిబడి ఉర్కేది
ఎవరెక్కువ తంగెడుపువ్వు తెస్తె ఆల్లు గెలిసినట్టు..
గవుండ్లోల్ల రాములు నేను తెగ పోటీబడేది…
బాయికాంచి నాన్న గునుగుబూలు సండ్రబూలు కట్లపూలు తెచ్చేది
మాదంటే మాది పెద్దగుండాలని తీరొక్క పూలేరుకొచ్చేది..
అవ్సలి బాయమ్మవ్వ గుమ్మడి గౌరమ్మ తెచ్చిచ్చేది
అడుగునానపాకేసి అమ్మ బతుకమ్మ పేరుస్తుంటే
అక్క నేను పూలందిచ్చేది..
సద్దముద్దల్దొక్కి సద్దుల్గట్నంక
పప్పు బెల్లంగల్పిపలారంబెట్టేది
పొద్దుగుంకాల
బతుకమ్మలెల్తుంటే
బతుకుబాధలన్ని మర్సిజూసేది
బతుకమ్మ పూలరంగులన్నీ
ఆడోళ్ళ పట్టుసీరల్ల కనపడేవి
అత్తగారింటిముచ్చట్లన్నీ ఆరబోసుకుంటు
ఆడబోరగాండ్లు శోకాలుపెట్టేది
తీటపోరగాండ్లుఅమ్మలక్కలెన్క తోక బాంబులుగాల్సి తిట్లుదినేది
అద్దమ్మరాత్రైన అలసటంత మర్సి ఆడిపాడేది
ఇచ్చుకుందాంవాయినం పుచ్చుకుందాంవాయినమని
బాపనోళ్ళమ్మగారు సెప్పినంకనే
కుతికెమునిగే నీళ్ళల్ల వర్సగట్టొదిలేది..
ఆ శరదృతువెన్నెల్లో..
బతుకమ్మ శిఖపైన..
కొవ్వొత్తి వెలుగుల్జూస్తే..
సుక్కల్తో సుత నింగి నేలపై పడ్డట్లన్పించేది…
గా రోజులు మల్ల జూస్తమా…
✍️తుల శ్రీనివాస్, కవి