Our big bicycle మా పెద్ద సైకిల్

గుర్తుకొస్తున్నాయి..

Our big bicycle
మా పెద్ద సైకిల్

నేను శిన్నగున్నప్పుడు నాకో ఎర్ర చిన్న సైకిల్ ఉండే.!
నేను ఓ 10 సంవత్సరాలు వయస్సులో ఉన్నప్పుడు మా బాపు తెచ్చిండు.

అప్పట్లో నాకు సైకిల్ ‘పిచ్చి’ బాగుండే
సైకిల్ కావాలని రెండు రోజులు తిండి మానేస్తే మూడో రోజు నా ముందు ఆ సైకిల్ ప్రత్యక్షమైంది.!
తరువాత ఆ సైకిల్ తో నాకు చాల అనుబంధం ఏర్పడింది.

నేను పెద్దగైన నా సైకిల్ చిన్నగైంది

ఎప్పుడూ… సైకిల్ తొక్కుతూ ఊరు మొత్తం గస్తీ కొట్టేవాడిని.

అలా… అలా…. నేను పెద్దగైన నా సైకిల్ చిన్నగైంది.!

మా బాపుకు ఓ సైకిల్ ఉండే.

ఆ సైకిల్ మీదనే నా చిన్నప్పుడు స్కూల్ కి తీసుకెళ్తుండే.
మా బాపు కంపెనీ లోకి పనికి ఆ సైకిల్ మీదనే పోతుండే.

ఆ సైకిల్ మీదే సుమారు రోజుకి 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుండే.

సైకిల్ మీద హైదరాబాద్

ఒకసారి ‘జెండావందనం’ రోజున మా బాపుని పట్నం పోదాం అంటే సైకిల్ మీదనే ‘సికింద్రాబాద్’ స్టేషన్ వరకు తీసుకెళ్లాడు.
ఆ సైకిల్ ప్రయాణం నాకు ఇప్పటి జ్ఞాపకమే.!

ఎందుకంటే నేను సిటీకి వెళ్లడం అదే మొదటి సారి.

ఎపుడు ‘సికింద్రాబాద్’ వెళ్లిన ఆ మొదటి సైకిల్ ప్రయణమే గుర్తొస్తది.

అలా… మా పెద్ద సైకిల్ తో నాకు చాల అనుబంధం ఉండే.
నేను పెద్దగయ్యాక నా చిన్న సైకిల్ మా బాపు నాకు తెలియకుండానే
‘పాత ఇనుప సామాన్లు’ వారికి అమ్మేసిండు.

ఆ విషయం తెలిసిన తరువాత నేను చాల బడపడ్డాను.

నా బాల్యపు జ్ఞాపకాలను ఆ ‘సైకిల్’ ఎంతగానో మోసింది.

తరువాత పెద్ద సైకిల్ నే ఎక్కువగా తోక్కేవాన్ని.

పెద్ద సైకిల్ మాకు మస్తు పనిచేస్తుడే.!

ఇంట్లో పొయ్యిలోకి ‘కట్టెలకు’ చేన్లకు ‘మసాలా – సంచుకు’ ( యూరియా బస్తాలు) తీసుకెళ్లడానికి.
ఎక్కువగా వాడేవాళ్ళం.

ఫస్ట్ క్లాస్ లో పాసైతే..

నేను పదో తరగతి ‘ఫస్టు క్లాస్’ లో పాస్ అయితే మా బాపు ‘బండి’ కొనిస్తాన్నాడు.

అన్నట్టే ఫస్టు క్లాసులో పాసయ్యను

‘బాపు’ బండి కొనిచ్చిండు.

బండి వొచ్చినాక..

రాను , రాను…. సైకిల్ నాకు దూరమయ్యింది.

బండి డగ్గరయ్యింది.

తరువాత మా బాపు కూడ ఓ బండి కొన్నాడు.

సైకిల్ వాడకం తగ్గింది. ఇంటి ముందు ఉండే సైకిల్ ఇంటి పక్క పెరడు లోకి మారింది.

అది వాడడం పూర్తిగా మానేశం.

కానీ ఆ సైకిల్ అక్కడే ఉంది.
ఇప్పటికి అలాగే ఉంటుంది

ఓ రోజు మా బాపు పాత ఇనుప సామాన్ అమ్మేవారిని తీసుకొచ్చిండు
సైకిల్ అమ్ముతాను అన్నాడు. నేను అమ్మనివ్వలేదు.

ఎందుకంటే…?

ఇప్పటికి నా ‘బాల్యా జ్ఞాపకాల్ని’ మోస్తున్నది ఆ సైకిలే.!!

కొన్ని సార్లు కష్టం వొచ్చినప్పుడు ఆ సైకిల్ వైపు చూస్తాను నేను శిన్నగున్నప్పుడు మా బాపు పడ్డ కష్టాలు గుర్తొస్తాయి.

వాటి ముందు ‘నా కష్టాలు ఎంత.?’

అనే ఓ ధైర్యాన్ని ఆ సైకిల్ ఇస్తుంది.

మన జీవితంలో వ్యక్తులే కాదు. కొన్ని వస్తువులు కూడ ఎక్కువగా ముడిపడి ఉంటాయని మా పెద్ద సైకిల్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది.

ఫోటో.. మొన్న దించిన మా పెద్ద సైకిల్ ‘పోట్వ’

భానుప్రసాద్ గౌడ్ జాలిగామ

(జర్నలిస్ట్)

Our big bicycle / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment