One day I will go (poetry) నేనూ…ఓ రోజు వెళ్ళిపోతాను (కవిత్వం)

One day I will go (poetry)
*నేనూ…ఓ రోజు వెళ్ళిపోతాను

అవును.. నేనూ ఓ రోజు ఉన్నట్టుండి వెళ్లిపోతాను…!!
అదేమంత బాధాకరమైన విషయం కాకపోవచ్చు
రావడం, పోవడం ఇక్కడ సర్వ సాధారణమే!
నేను పోయినందుకు నా అన్న వాళ్లు బాధపడతారు
నేనంటే ఇష్టపడని వాళ్లు లోలోపలే ఆనందిస్తారు!!
అప్పటి వరకూ నేను రాసిన అక్షరాల కళ్లు చెమ్మగిల్లుతాయి
రాయాలనుకున్న అక్షరాలు అచేతనంగా గాల్లో తేలుతూ
కన్నీళ్ళతో వీడ్కోలు పలుకుతాయి!!
ఇంట్లో వాళ్లు నా సామాన్లు సర్దేసి‌ మూటకట్టేస్తారు
ముఖ్యంగా.. నా ట్యాబ్ ను విసిరిపారేస్తారు
ట్యాబ్లో పోస్ట్ అయిన స్టోరీలు ఫర్వాలేదు కానీ
ఇంకా పోస్ట్ కానివి మాత్రం గుండెలు బాదుకుంటాయి
మా చెర వదిలించండని మొత్తుకుంటాయి.
వాటి మొర ఎవరికీ వినబడదు
నాతోపాటే‌ అవీ సమాధవుతాయి!!
నేను రాసిన పుస్తకాలు బేలగా చూస్తుంటాయి
మా ఇంట్లో వాళ్ళకు అవేమిటో కూడా తెలీదు
నా లైబ్రరీలో పుస్తకాలు బస్తాలకెక్కుతాయి
ఇక పాత పేపర్లవాడికి పండగే..పండగ!
నాతో పాటేవాటికీ ముక్తి..విముక్తి!!
(One day I will go)

పరిచయమున్న స్నేహితులు పరామర్శకు వచ్చి వెళతారు
వెళ్ళకపోతే బాగోదనుకునే వారు అటెండెన్స్ కోసం వచ్చి వెళతారు
ఫేస్ బుక్ లో లైకులతో అదరగొట్టిన మిత్రులు
కామెంట్లతో ఆకాశానికి ఎత్తేసిన వారు
కనీసం పేరైనా తలవరు.!!
పోయాడని ఎవరైనా పోస్ట్ చేస్తే పోనీలే పాపం ఓ లైకేసుకుంటే
పోయేదేముందని టిక్కుమనిపిస్తారు.
ఇక.. అనుకూల శత్రువులైతే,
పోస్టింగ్ లతో తెగ విసిగించే వాడని
లోలోపలే తెగ గొణుగుతూ పోయినోళ్ళంతా మంచోళ్ళే అన్న
మెట్ట వేదాంతాన్ని వల్లిస్తారు కసితో ఓ లైకేసుకుంటారు !!
One day I will go (poetry)

నేటి పోస్టింగ్ రేపటి మరణ శయ్య
నేటి మిత్రులు రేపటి పరాయీలు
మానవ సంబంధాలన్నీ ఫేస్బుక్లో ఇచ్చి పుచ్చుకునే
లైకులూ, కామెంట్లే కానీ హృదయ సంబంధాలు కానే కావు..!!
మనిషినీ మనిషినీ మనసును మనసునూ
కలిపి కుట్టని స్నేహం.. స్నేహం కాదు
ఈ రోజు నేనుండొచ్చురేపు వుండక పోవచ్చు
కానీ… ఫలానా వాడు ఒకడుండేవాడన్న
ఓ గుప్పెడు జ్ఞాపకాల్ని లోకంలో మిగుల్చుకునే
మార్గమేదైనావుంటే చెప్పండి ప్లీజ్

ఎ. రజాహుస్సేన్, కవి- రచయిత

One day I will go (poetry)/ zindhagi.com/ yatakarla mallesh/ abdul rajahussen writer/life poetry
Comments (1)
Add Comment
  • Ashapriya

    Kavi garu hrudayapurvakamga spandananu anubhavistu raase prathi kaavyam manasunna manishiki takuthundi dani bhavana..