October 11 is International Girls’ Day అంతర్జాతీయ బాలికా దినోత్సవం

October 11 is International Girls’ Day

అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం

బాలికల హక్కుల పరిరక్షణకు సమాజం సన్నద్ధం కావాలి..

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కెనడా తన తీర్మానంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళామంత్రి రోనా అంబ్రోస్ ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేసింది; 2011, డిసెంబరు 19న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 2012, అక్టోబరు 11న తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఆమోదించే తీర్మానానికి ఓట్లు వేయగా, అధికారికంగా బాలికా దినోత్సవం గుర్తించబడిందిని తీర్మానం పేర్కొంది.

అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్‌ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌ పుట్టిన రోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2012, అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడింది. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియ చేయడమే కాకుండా, ఆ సమస్యలు పరిష్కరించ బడినప్పుడు జరిగే పరిణామాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం ఉపయోగ పడుతున్నది. సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపు కుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వాషింగ్టన్ లోని యునైటెడ్ స్టేట్స్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ 2014లో అందించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకు విద్య అందడంలేదు. ప్రపంచవ్యాప్తంగా 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు, అదే వయస్సు గల అబ్బాయిల కంటే 160 మిలియన్ గంటలకుపైగా ఇంటి పనుల కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, నలుగురిలో బాలికల్లో ఒకరికి 18 ఏళ్ళకంటే ముందుగానే వివాహం జరుగుతోంది. 2016, అక్టోబరు 11న, ఐక్యరాజ్యసమితి వుమెన్ గుడ్‌విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్, బలవంతపు బాల్య వివాహాలను అంతం చేయాలని ప్రపంచ దేశాలను, కుటుంబాలను కోరింది.

చైనా మొదలు అమెరికాతో సహా ఆధునికత వైపు అడుగులు వేస్తున్న భారత్‌లోనూ అమ్మాయిల పట్ల వివక్ష ఉంటుందని గ్లోబల్ ఎర్లీ అడల్సెంట్ స్టడీ పేరిట నిర్వహించిన ఒక అధ్యయనంలో భాగంగా… అమ్మాయిలు పదహారేళ్ల వయసుకు చేరుకున్నప్పటికీ మానసిక ఒత్తిడికి  గురవు తున్నారని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్‌హఫ్‌కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కిడ్స్ సంయుక్తంగా 15 దేశాల్లో నిర్వహించిన సర్వేలో అమ్మాయిలు శారీరకంగా బలహీనులనే విషయం… చిన్న వయసులోనే ముద్ర పడేలా చేయడంలో తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, టీచర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేలింది. బాలికల కంటే అబ్బాయిలకే ఎక్కువ ప్రాధాన్యత అధికంగా ఇవ్వడం సర్వత్రా వ్యక్తమవు తున్నది. ఇటీవల కాలంలో ఆడపిల్లగా పుట్టడం, పుట్టినా సురక్షితంగా మనుగడ సాగించడమే దుర్భరమైన దురవస్థ ఉంది.

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాల్లో నలభై శాతంకి పైగా భారత్‌లోనే జరుగు తున్నాయన్న చేదు నిజాన్ని యునిసెఫ్ స్పష్టం చేసింది.  బాలికల ఉన్నత విద్య మరో సమస్యగా మారింది, ఇప్పటికి అధిక రాష్ట్రాల్లో 40%నికి పైగా  పదో తరగతి కంటే ముందే బడి మాని వేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు  చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఉన్నత విద్యలో డ్రాపౌట్స్ తగ్గడంలేదు. బాల్య వివాహం కారణంగా రాష్ట్రంలోని 28 శాతం మంది బాలికలకు పద్దెనిమిది సంవత్సరంలోపే వివాహాలు చేస్తున్నారు. యునెస్కో వెలువరించిన ప్రపంచ విద్య నివేదిక ప్రకారం భారత దేశంలో వయోజన నిరక్షరాస్యులలో మహిళలు 68 శాతం వున్నారు. పంతొమ్మిది ఏళ్లు నిండక ముందే దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నారు. బాలికల సంఖ్య 41 శాతం అని జనగణనలో తేలింది. బాల్య వివాహాలు, పాఠశాలలు చేరువ, అందుబాటులో పూర్తి స్థాయిలో లేకపోవడం, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల కొరత, లైంగిక విచక్షణ వంటి సమస్యలు భారతావనిలో బాలిక విద్యకు శాపంగా పరిణ మించింది. పోషకాహార లోపం కారణంగా రక్తహీనతతో బాధపడుతున్న బాలికల సంఖ్య దేశంలో దాదాపు డెబ్బై శాతం అన్న అంచనాలు తీవ్రంగా కలవర పరుస్తున్నాయి. మహిళా కార్మిక శక్తి, వారి ఆదాయం, అక్షరాస్యాత స్థాయి, జననాల విషయం, తదితర అంశాల్లో అధమస్థాయిలో వున్న 20 దేశాల్లో మన దేశం ఒకటి కావడం ఆందోళనకర అంశం. మహిళలు పురుషులకన్నా ఎందులోనూ  తక్కువ కాదు. ఆడపిల్లలు ప్రతి రంగంలో, చదువులో మొదలుకుని ఆటల దాకా, రాణిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతున్నారు.

బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్‘ పేరుతో ఓ కార్యక్రమం తెచ్చింది. బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది. 2008 నుంచీ దీన్ని ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై ఈ రోజున అవగాహన కల్పిస్తోంది. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక… “బేటీ బచావో బేటీ పడావో” స్కీం తెచ్చారు. తద్వారా బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారు.

నేడు మహిళా సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మైనర్లపై అత్యాచారాలు ఆగడంలేదు. సమాజంలో అమ్మాయిలు, మహిళలకు రక్షణ కరువ వుతున్నది. ఎంతోమంది ఆడ పిల్లలు ఈ లోకంలో  అడుగుపెట్టక ముందే  బలవంతపు మరణాలకు బలవు తున్నారు. ఆధునిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవతా విలువలు మాత్రం పెరగడం లేదు. దానికి నిదర్శనం భ్రూణ హత్యలు. గర్భస్త శిశువుల లింగ నిర్ధారణను నిషేధించి తద్వారా ఆడపిల్లల భ్రూణ హత్యలు నివారణ కోసం 1994లోనే చట్టం తెచ్చినా అది ఏనాడూ పకడ్బందీగా అమలైన జాడలు లేవు. సమాజంలో చైతన్యం నింపాలంటే ముందు మహిళ జాగృతం కావాలి. స్త్రీ కళ్లు తెరిస్తే కుటుంబం, దానితో పాటు గ్రామం, రాష్ట్రం, దేశం పురోగతి బాట పడతాయి’ అని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుంచు కోవాలి. కౌమారదశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలి.

బాలికలు  వారి చట్టపరమైన హక్కులు మరియు జీవిత వాస్తవాలను గురించి తెలుసు కోవాలి. వారు మంచి విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ హక్కులను కలిగి ఉంటారని అవగాహన కల్పించాలి. గృహ హింస చట్టం 2009, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 నిషేధించడం మరియు కట్న నిషేధ చట్టం 2006 వంటి చట్టాల గురించి వారి సరైన హక్కులు పొందడానికి మరియు జీవితంలో అన్ని సవాళ్లను ఎదురుకొని ముందుకు వెళ్ళాలి. బాలికలపట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేదింపులు, అత్యాచారాల నుండి రక్షించడానికి కుటుంబం, మిత్రులు, సమాజం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత

సెల్: 9440595494

October 11 is International Girls' Day/zindhagi.com
Comments (0)
Add Comment