‘ఉదయం’ ఆత్మీయులతో నా బంధం : ఎస్. వి.రమణా చారి

ఆ నాటి ఆనంద ఉదయం

యాదుందా మిత్రులారా …
అలనాటి జ్ఞాపకం ఆ దండాలు పెడుతున్నది నేనే మీ ఎస్. వి.రమణా చారిని అందరికీ టేలిన్యూస్ చారి (రమణా చారి)అంటే చిరపరిచితం అనుకుంటా…మన ఉదయం వార్షికోత్సవం సందర్భంగా ‘దొంగలు బాబోయ్ దొంగలు’ అనే నాటకం ప్రదర్శించాం…దర్శకులు శ్రీహర మూర్తి గారు.నా పక్కన తెలంగాణ శకుంతల గారు నటించారు(ఫోటో లేదు).

మొన్న మన ఉదయం ఆత్మీయకలి యకలో కలుసుకున్నప్పుడు ఆ బంధంతో ముడిపడిన అనుబంధాన్ని , జ్ఞాపకాన్ని మిత్రులు చెబుతున్నప్పుడు నాతో పాటు నటించిన నీల్, పురుషోత్తం గారు గుర్తు చేసినప్పుడు ఆ అనుభూతులు వర్ణించ రానివి. ఆ పాత మధురాలను ఏలా మరచి పొగలం. ఏ వ్యక్తిని పలుకరించినా…మీరు పలానా కదా…కరక్టేనా?? అన్న సంశయాలతో ఆ ఉద్విగ్న గంటలు క్షణాలుగా గడిచాయి.

నిజంగా కాల గమనం చాలా గమ్మత్తుగా ఉంటుంది. నేను ఉదయం లో చేరిన ప్పుడు సిటీ ఇంచార్జి గా కాసుల ప్రతాప్ రెడ్డిగారు వున్నారు.నన్ను శ్రీ రామ చంద్ర మూర్తి గారి దగ్గరకు తీసుకెళ్లారు.రిపోర్టింగ్ కోసం త్యాగరాయ గానసభకు నన్ను పంపించారు.ఆ తరువాత రెండు,మూడు రోజులకు మీరు బాగారాస్తున్నారు.మీరు రిపోర్టింగ్ వద్దు డెస్క్ లో పనిచేయండి అని మూర్తి గారు చెప్పారు అని ప్రతాప్ రెడ్డి గారు చెప్పడంతో… సిటీ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా పనిచేయటం ప్రారంభించాను.

ఓ రోజు కరీంనగర్ జిల్లా ప్రత్యేక సంచిక కోసం మఫిసల్ డెస్క్ లో కొందరు సబ్స్ పనిచేస్తున్నారు..అది గమనించి నేనుకూడా వారితో పని చేస్తూ అలాగే రాత్రి 1 గంట వరకు వున్నాను.ఏమండీ మీరు ఇంకా నాతో పాటు వున్నారు.మీరు వెళ్ళండి అంటూ చాలా సార్లు ఓ బక్క పలుచని వ్యక్తి అన్నారు.లేదండి మీరు ఒక్కరే వున్నారు. నేను కూడా ఉంటాను అని వారితో పని చేస్తూ సర్ ఈ ఆర్టికల్ బావుంటుంది అంటూ చెప్పాను. మీరు తెలిసింది టక టక రాయండి, ఐటమ్స్ దిద్దండి అంటూ నాకు ప్రేరణ కల్పించారు.

ఓ ఆర్టికల్ చూపిస్తూ సర్ ఇందులో మరికొన్ని జోడించ మంటారా అని అడిగా మీరు మీకు తెలిసింది రాయండి అని మరో సారి చెప్పారు.అప్పటికే నాకు ఈనాడు కరీంనగర్ జిల్లా బెజ్జంకి స్ట్రింగర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో జిల్లాలో ఉన్న సాహితీ మూర్తుల గురించి రాశాను.సమయం రాత్రి 2 గంటలు దాటింది.నన్ను వెళ్ళమని చెప్పడం తో నేను వెళ్లి పోయాను.ఆ రాత్రి ఆ ప్రత్యేక సంచిక ప్రింట్ కావాలి.నేను రాసిన ఆర్టికల్ కు నా బై లైన్ పెట్టాలని చాలా శ్రమించి నా ఇంటి పేరుతో సహా నా పేరు పెట్టారు.

ఇలా ఉదయం పత్రికలో మొదటి సారిగా నా పేరు రావటం నేను నా జీవితం లో మరచి పోలేనిది.అలాగే నాకు ఆ పేరు ఇచ్చిన వ్యక్తి శ్రీ టీ.కే. లక్ష్మణ్ రావు గారు. అప్పటి నుంచి నాకు పని ఎలా చేయాలో చాలా మెళుకువలు నేర్పినవారు శ్రీ లక్ష్మణ్ రావుగారు. ఇలా ఉదయం లో అటు డెస్క్ లోనూ,టేలిన్యూస్ లోనూ కొనసాగాను. వివిధ సందర్భాలలో శ్రీ బ్రహ్మానంద రెడ్డి,శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు నన్ను డెస్క్ లో పనిచేయమని ప్రోత్సహిస్తూ అవకాశం కల్పించారు. అలాగే హెడ్డింగ్ లకు ఏ పాంట్ ఇవ్వాలి, ఏది హెడ్డింగ్ ఉంటే బావుంటుందో నేర్పిన వారు శ్రీమతి రాజీవ(జి.కృష్ణ గారి కూతురు)గారు,వేణుగోపాల స్వామి,ఎస్జీవి శ్రీని వాస రావు,వీఎస్ ప్రభాకర్,వేదాంత సూరి, కవిత్వం పట్ల చాలా ఆసక్తి కలిగించిన వారు శ్రీ చైతన్య ప్రసాద్ గారు ఇలా నాకు పలువురు పెద్దలు పని నేర్పారు.

అందరితో కలివిడిగా పని చేస్తూ పోవటం సరదాగా గడిచింది. అన్నింటి కన్నా గొప్ప విషయం ఇటు టేలిన్యూస్ తో శ్రీ ఆనంద భాస్కర్, వెంకటరత్నం, కాళీ దాస్, సైదా రెడ్డి గార్లతో పనిచేస్తూ సిటీ డెస్క్ లో రిపోర్టర్లతో కలిసి మెలసి ఉండటం. వివిధ సందర్భాలలో మిత్రులు తెచ్చిన వార్తలకు లీడ్ రాసే విషయాలలో వారితో ముచ్చటించటంతో మిత్రులు పీ.వీ.చారి (క్రైం),నెల్లుట్ల రాధా మనోహర్, దిల్ సుఖ్ నగర్ ప్రమోద్, మ్యాడం మధు సూధన్, బషీర్భాగ్ జగన్, పండరి, చందా నగర్ కమాల్,  క్రైమ్ మౌలాలి, చార్మినార్ శంకర్,వేణు మాధవ్, రాంనగర్ హరి ప్రసాద్ ,సికింద్రాబాద్ పవన్, కె.ఎన్. చారి(దిక్క్సుచి) తదితరులతో స్నేహం ఏర్పడింది.

యువకెరటాలుగా ఉన్న మాకు శ్రీ ప్రశాంత్ రాయ్, శ్రీ పాశం యాదగిరి గారు ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను చెప్పే వారు. రాత్రి 12 దాటితే ప్రయాణ సౌకర్యాలు ఉండేవీ కాదు.ఈ బాధలు భరించలేక నేను రాంనగర్ లోనే ఓ అద్దె రూమ్ తీసుకున్నాను. ఇక నావెంటే మా మిత్ర బృందం ఉండేది. వారిని నా అద్దె కొంపలోకి దొంగతనంగా(యజమానికి తెలియ కుండా) తీసు కెళ్లే వాడిని.. ఆ రాత్రి ఉన్నదేదో వండుకుని తినే వాళ్ళాం. ఒకొక్కరి దగ్గర ఎంత ఉందో లెక్కలు వేసుకొని పైసలు జమ చేసుకొని బియ్యం, చింతపండు తెచ్చుకొని వండుకుని తినేవాళ్ళం. ఈ విషయం ఉదయం పెద్దలందరికీ తెలుసు.ఈ విషయంలో వారి,వారి చేయూతను వారు అందించిన ఆ ఆనంద క్షణాలను మర్చిపోలేనివి.

శ్రీ గోపి(గోపాల కృష్ణ)గారు కూడా కొన్ని రోజులు టేలిన్యూస్,సిటీ ఇంచార్జి గా చూశారు. ఆ తర్వాత వారి ఆధ్వర్యంలో జనపథం అనే పేజీ వచ్చింది. వారికి సహాయకుడిగా నేను పనిచేశాను.
జనపదం పేజీ చాలా హైలైట్, వారు రాసే రాతలకు ఇచ్చే హెడ్డింగ్ లకు తిరుగులేదు. వ్యగ్యం చాలా ఉండేది.

ముఖ్యంగా ఈ పేజీ కోసం అప్పటి రిపోర్టర్లు శ్రీ మిట్టపల్లి శ్రీనివాస్, బాలగంగాధర్. ఆర్.సత్యనారాయణ(ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ) మారుతీ ప్రసాద్, కర్నూల్ శ్రీనివాస్, దాసరి కృష్ణారెడ్డి, వీ.పీ,ఎస్. రాజు, బసవేశ్వర్ రావు తదితరులు బాగా వార్తలు అందించే వారు. ఆ వార్తలకు సినిమా స్టయిల్ కథలు, పాటలు,వివిధ కధాంశాలను జోడించి గోపీ గారు రాసే విధానం ఓ హై లైట్. ఆట,పాట….వార్త….ఏదయినా ఉదయం పత్రిక దే గ్రేట్.

మళ్ళీ అందరిని ఒక దగ్గర గా చేర్చి ఆ నాటి అనుబంధాల ను గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పించిన సహృదయులు, మిత్రులు శ్రీ సైదా రెడ్డి, హేమ సుందర్ తదితరులకు కృతజ్ఞతలు. అందమయిన ఆ ఆనంద జీవితాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం. ఆనంద క్షణాలను ఆస్వాదిద్దాం

ఇట్లు
మీ…
ఎస్. వి.రమణా చారి

My relationship with my loved ones in the morning: S. V. Ramana Chari
Comments (0)
Add Comment