ఉన్నత స్థాయికి
ఎదుగడమే నా లక్ష్యం
: దేవేందర్ రెడ్డి (డివిఆర్)
ప్రపంచాన్ని నాశనం చేసే అణుబాంబు కంటే మానవుడి ఆలోచనలు ప్రమాదం.. నిజమే కదా.. ఆ అణుబాంబును తయారు చేసింది మనిషే.. మరి ఆ ఆలోచనలను మంచి మార్గంలో తీసుకెళ్లినోళ్లకు ఈ సమాజంలో తిరుగే లేదు.
ఇగో.. ఈ దేవేందర్ రెడ్డి జీవిత ప్రస్థానం కూడా అలాగే ఉంది. అతను ఎవరికి అర్థం కాడు.. ఏమి చేస్తాడో కూడా చాలా మందికి తెలియదు. సమాజంలోని ఆవస్థలను చూసి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పెట్టుబడిగా పెట్టి దేశంలోనే ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఫోన్ లతోనే పనులు చేస్తున్నాడు దేవేందర్ రెడ్డి అలియాస్ డివిఆర్.
దేవేందర్ రెడ్డిది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామం. నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ గా పని చేసినప్పుడు అతనితో నాకు కొంత పరిచయం. దేవేందర్ రెడ్డితో మాట్లాడిన సందర్భాలు తక్కువే. ఉన్న ఊరును వదిలి పిల్లల చదువుల కోసం హైదరాబాద్ విచ్చేసిన దేవేందర్ రెడ్డి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగాలనే ఆలోచనలతో వేస్తున్న అడుగులు స్పీడ్ అందుకున్నాయి.
దేశంలోని ప్రముఖులను పరిచయం చేసుకోవడంలో అతనికి ఉన్న ప్రతిభనే పెట్టుబడి. శ్రీరామ నవమి సంధర్భంగా దేవేందర్ రెడ్డితో ముచ్చటించాను. వయసులో నాకంటే చాలా చిన్నోడైనా అతను చెప్పే జీవిత సత్యాలు కలికాలంలో మనకు ప్రతి రోజు స్వాగతం పలుకుతాయి. ప్రేమగా, అప్యాయంగా మాట్లాడిన ముచ్చటను మీతో షేర్ చేసుకోవాలనిపించింది.
——-
‘‘మల్లేషన్నా.. లైఫ్ సెటిల్ అయినట్లే గదా..?’’ ప్రశ్నించాడు దేవేందర్ రెడ్డి. ఒక్క క్షణం అర్థం కాలేదు.
‘‘అప్పులు చేసి బిడ్డా పెళ్లి చేసాను. అత్తవారింట్లో హాయిగా ఉంది బిడ్డా.. ఇగపోతే.. కొడుకు సర్కార్ జాబ్ ప్రయత్నంలో ఉన్నాడు.’’ చెప్పాను.
‘‘పెళ్లికి అప్పులు చేయడం ఏమిటీ..? నా చిన్నప్పటి నుంచి మీరు విలేకరిగా చేస్తున్నారు గదా..?’’ అతని ప్రశ్నకు నవ్వుకున్నాను.
విలేకరి అంటే కోట్లు సంపాదించి విలాస వంతమైన జీవితం అనుభవిస్తారని అనుకుంటున్నాడెమో అనిపించింది. నవ్వి..
‘’38 ఏళ్లుగా విలేకరిగా పని చేస్తున్నా.. ఈ జూలై 25వ తీది వస్తే నా వయసు 60 ఏళ్లు. కానీ.. ప్రపంచంలో ఎక్కడా ఇల్లు లేదు. నిజామాబాద్ లో వీది పోటు ప్లాట్ (202 గజాలు) ఉంది. మరో నాలుగు గుంటల పొలం ఉంది. ఇవే నా ఆస్తులు. కొటాక్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ 2 రెండు లక్షలు, మనీ ట్యాప్ క్రెడిట్ కార్డుపై లక్షా 84 వేలు, క్రెడ్ బ్యాంక్ లోన్ 4 లక్షల 60 వేలు, ఐసిఐసిఐ బ్యాంక్ లో కారు లోన్ 4 లక్షల 45 వేలు. ఆర్ బిఎల్ బాంక్ పర్సనల్ లోన్ 5 లక్షలు అంటే.. మొత్తం అప్పులు 17 లక్షల 89 వేలు. ప్రామిస్ ఇవే నా ఆస్తులు.. అప్పులు.’’ వివరించాను. దేవేందర్ రెడ్డి కొంతసేపు ఆలోచనలో పడ్డాడు.
‘‘నిజమా..? నమ్మలేక పోతున్న. నీవు జీవితంలో తప్పు చేశావన్నా.. ఫాల్స్ పిస్టెజ్ కు పోయి జీవితంలో డబ్బులు సంపాదించక పోవడం కూడా ఈ రోజులలో చాతగాని తనం కిందే జమ కడుతున్నారు జనం. డబ్బుంటెనే అన్నీ.. నీవు ఎలా డబ్బులు సంపాదించావని ఎవరు చూడరు. నేను జీవితంలో డబ్బుల కోసం నరకం అనుభవించాను. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు.. కానీ.. ఇప్పుడు జీవితం నేర్పిన పాఠాల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నన్ను ఛీ కొట్టినోళ్లే ఈరోజు నా మెంటనెన్స్ చూసి జై కొడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్పగలను. జీవితంలో నేను ఉన్నత స్థాయికి ఎదుగుతాను.’’ వివరించారు దేవేందర్ రెడ్డి.
‘‘ఇంతకు నీవు ఏమి చేసి డబ్బులు సంపాదించావ్.. ఈ గవర్నర్ లతో.. ముఖ్యమంత్రులతో నీకు వ్యక్తి గత సంబంధాలు ఉండటం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. నీవు ఇతరులకు అర్థం కాని ప్రశ్నలా ఉన్నావ్ బ్రదర్.’’ అన్నాను. దేవేందర్ రెడ్డి నవ్వి.
‘‘ధైర్యం.. తెగింపు ముఖ్యం మనం డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తే అన్నీ అవే మన ముందుకు వచ్చి సలాం చేస్తుంటాయి. గవర్నర్ లు.. ముఖ్యమంత్రులతో పరిచయం మాత్రం నా చొరవనే.. నా పెట్టుబడి కూడా అదే. సమాజంలో మనం దివాళ తీసినా అలా కనిపించద్దు. అప్పులు ఉన్నట్లు నీవు ఇప్పుడు చెప్పినట్లు చెప్పొద్దు. బాగా డబ్బులు సంపాదించినట్లుగా కనిపించాలి. ఉదాహరణకు లోపల చినిగిన బనీన్ ఉన్నా.. పైన డ్రెస్ మాత్రం నీట్ గా కనిపించాలి. బంధువులను దగ్గరికి తీయద్దు. అలా అని దూరం ఉంచోద్దు. ఒక్కటి మాత్రం నిజం నీవు ఇతరులకు ఏ పని చేసిన దానికి తగ్గట్లుగా ఫలితం తీసుకోవాల్సిందే. ఇదే సూత్రంను నేను పాటిస్తున్నాను. డబ్బులు సంపాదిస్తున్నాను.’’ వివరించారు దేవేందర్ రెడ్డి.
— —-
దేవేందర్ రెడ్డి తో గంట పాటు జరిగిన మా సంభాషణలో చాలా విషయాలు వచ్చాయి. అతని మాటలలో ఆలోచనల ఉంది. నమ్మకం ఉంది. ధైర్యం ఉంది. అతని జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల కూడా ఉంది.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్