Mukti Kshetra book review పుస్తక సమీక్ష
మోక్షపురి.. కాశీ నగరి!!
“మానవ నేత్రం”తో చూడటం నుంచి “మనోనేత్రం”తో దర్శించటం నేర్చుకునే వరకు కాశీకి ఎన్ని సార్లైనా వెళ్తూనే ఉండాలంటారు కదా..!! నేరుగా వెళ్లి అక్కడి ఆధ్యాత్మిక శోభను కనులారా వీక్షించిన వారికే అలా ఉంటే…
ఇక నాబోటి అక్షరాల్లో అంతర్యామిని సందర్శించే వారి పరిస్థితి ఏమిటి??
అందుకే కాబోలు ఈ వారం కూడా ఆ పరమ శివుడు మళ్లీ కార్తీక యాత్రా విశేషాల పుస్తక సమీక్ష చేయిస్తున్నాడు. మరోమారు మహాదేవునికి నమస్కారాలు సమర్పిస్తూ #ముక్తిక్షేత్రం” పుస్తకం పై ఈనాటి సమీక్ష..!!
ఔషధంగా పని చేస్తుంది యోగ
పూర్వీకులు మనకి ప్రసాదించిన అద్భుత వరం యోగ.. సింధూ నాగరికత కాలం నుంచి యోగా సాధన ఉందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.. నేటి సమాజంలో ఆధునిక జీవన శైలి కారణంగా మనిషి మానసిక ఆందోళన పెరగడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కూడా కోల్పోతున్నాడు. ఈ రెండింటికీ చెక్ పెడుతూ మానసిక ప్రశాంతతో పాటు శరీర సౌష్టవానికి అద్భుత ఆయుధంగా, ఔషధంగా పని చేస్తుంది యోగ..
చిన్ననాటి నుంచే సాధన
అటువంటి సాధనాన్ని ఎంచుకొని ఎంతో మందికి ఉచితంగా శిక్షణ ఇస్తూ ఫోన్ లోనూ శారీరక సమస్యలకు పరిష్కారాలు ఇస్తూ… చిన్ననాటి నుంచే సాధన చేస్తున్నారు శ్రీ రమా శాండిల్య గారు.. యోగ తో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ, అక్కడ సమాచారాన్ని ఇతరులకు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిలో భాగంగా తన కాశీయాత్ర విశేషాలకు సంబంధించిన ముక్తి క్షేత్రాన్ని పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.
23 అధ్యాయాలు
వారణాసిలో తొలి అడుగు
“వారణాసిలో తొలి అడుగు” మొదలుకొని “శుభయాత్ర”తో ముగిసిన ఈ పుస్తకంలో 23 అధ్యాయాలు ఉన్నాయి. 2008లో మొదటిసారి కాశీకి వెళ్ళిన రచయిత్రి అనుభవాలు మొదలుకొని అత్యంత పవిత్రమైన శ్రావణమాసంలో దైవ కృప తో పాటు మానవ సంకల్పం తోడై ఆమె చేసిన కాశీ యాత్ర విశేషాలు ఓసారి మనమూ విని తరిద్దాం రండి..!!
వినాయకుడి ఆలయం, విశ్వనాధుని ఆలయం, కేదార్ ఘాట్ లో లంబోదరుడు, చింతామణి, గణపతి, మంగళ వినాయకుడు, మణికర్ణికా ఘాట్ లోని మణికర్ణిక వినాయకుడు, మోద వినాయకుడుతో పాటు పది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడు తొలిపూజలందుకొనే ఏకదంతుడు.. ఇలా 64 ఘాట్లో అనేక రూపాల్లో కొలువైన వినాయకులను కనులారా దర్శించవచ్చు.
ఆదికేశవ ఘాట్, కేదార్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, గంగా స్నానం, దశాశ్వమేధ ఘాట్, కాలభైరవ ఆలయాలు, ద్వాదశాదిత్యులు, నవదుర్గ, విశాలాక్షి దేవాలయం, కాశీ నగర విశిష్టత, అక్కడి ప్రత్యేక పండుగలు ఇలా… ఎన్నో ప్రత్యేక ప్రాంతాలను, క్షేత్రాలను ఆధ్యాత్మికత శోభను జోడించి మనోనేత్రం తో వీక్షించి మనకు అందించే ప్రయత్నం చేశారు.
17 వ శతాబ్దం వరకూ పదిసార్లు
వేదకాలం నుంచి 17వ శతాబ్దం వరకూ పది సార్లు దశాశ్వమేధ ఘాట్ వద్ద అశ్వమేధ యాగం జరిగిందట.!! మంచి జాతి గుర్రాలను పట్టపురాణులతో పూజలు చేయించి క్షేత్రం లోకి వదిలిపెడతారు. వాటికి కాపలాగా రాకుమారులు గాని, సేనాధిపతులను గాని వెంట పంపుతారు. అలా ఆ గుర్రాలు ఎంత దూరం వెళ్తే అక్కడ వరకు నడిచిన రాజ్యాలన్నీ రాజుల సొంతమై పోతాయి. ఇలా గుర్రం వెనక్కి వచ్చిన తర్వాత గుర్రం తో పాటు అనేక జంతువులను యాగానికి బలి ఇస్తారు. ఈ విషయాన్ని విశ్వనాథుని గుడిలోని పూజారులు భక్తులకు చెబుతారు.
ఆరోగ్యప్రదాతకు ఆరాధన
ఆరోగ్య ప్రదాత అయిన సూర్య దర్శనం ఇక్కడ ప్రత్యేకమైనది. అందుకే కాశీలో ద్వాదశాదిత్యుల దర్శనానికి ప్రత్యేకత ఉంది. పన్నెండు ఆదిత్య రూపాయలకు పన్నెండు ఆలయాలు ఉన్నాయి. ఈతిబాధలు తొలగేందుకు ప్రత్యేకంగా చేయాల్సినది గంగా స్నానం, ఆదిత్య దర్శనం అని పెద్దలు చెబుతుంటారు. వీటి వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని ప్రధాన నమ్మిక. Mukti Kshetra book review
కుంభమేళా..భళా!
కాశీలో కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత ఉంది. రచయిత్రి ఇక్కడ మొదటిసారి అర్థ కుంభమేళాలో అఘోరాలను చూసి ఒకింత ఆశ్చర్యానికి, ఒకింత భయానికి గురవుతారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా జడలు కట్టిన జుట్టుతో, బూడిద రాసిన ముఖంలో ఎర్రటి బొట్టుతో, కర్ర పట్టుకొని కాళ్లకు చేతులకు రుద్రాక్షలు ధరించి వింతవింత రూపాల్లో కనిపించారు. మరో రకమైన సాధువులు కూడా ఇక్కడ శివ భక్తులకు దర్శనమిస్తారు. సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని వీరు కూడా దుస్తులు ధరించరట. వీరంతా మరణానికి గాని, మరణించిన వారికి గాని ఏ మాత్రం భయపడకుండా శవాల దగ్గర నిద్రపోతూ ఉంటారు. వీరి దృష్టిలో శివుడు మాత్రనే దేవుడు. అంతా శివమయం అని నమ్ముతారు. ఇక ఘోరాలు నిర్మించుకున్న ఆలయం చుట్టూ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో ఎపుడూ తంత్రపూజలు జరుగుతుంటాయట..!!
చూసిన కనులదే భాగ్యమట!!
ఈ పుస్తకంలో కాశీ నగరం విశిష్టత అధ్యాయము సంపూర్ణ గ్రంధంగా చెప్పవచ్చు. భారతదేశం ప్రాచీన నగరాల్లో ఒకటి కాశీ పుణ్యక్షేత్రం. మోక్షపురి గా పిలుచుకొనే ఈ క్షేత్రంలో మనిషి జీవించినప్పుడు ఏమి చేయకూడదు అనేది ‘మరణం,” చూసి తెలుసుకోవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం, అష్టాదశ పీఠాల్లో ఒకటైన విశాలాక్షి మందిరం ప్రత్యేకంగా దర్శించుకోవలసినవి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం మనల్ని. మంత్రముగ్ధులను చేస్తాయి గంగా హారతి చూసిన కనులదే భాగ్యం అన్నట్టు ఉంటుంది. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, కాలభైరవ దర్శనం, వినాయక, విశ్వనాధ , విశాలాక్షి అమ్మవార్ల దర్శనాలు అతి ప్రధానంగా చేస్తారు. కాశీలో గద్దలు ఎగరకపోవడం, బల్లులు శబ్దం చేయకపోవడం, శవాల నుంచి దుర్వాసన రావకపోవడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. Mukti Kshetra book review
తొలికాంతి కిరణం ఇక్కడే..!!
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశి పైనే పడిందని, అప్పటి నుంచి విజ్ఞాన ఆధ్యాత్మిక అంశాల నెలవుగా కాశీ విరాజిల్లుతోందని పూర్వీకులు చెబుతారు. శివుడే వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాధల సారాంశం కూడా చెబుతోంది. కాశీ అంతటి శక్తివంతమైన క్షేత్రం కాబట్టి విశ్వేశ్వరుడు అక్కడ కొలువయ్యేందుకు ఎంచుకున్నాడంటారు. ఈ నగరం పంచభూతాలను, నాడీ కేంద్రాలను ఆధారంగా చేసుకొని నిర్మించబడినది. కాలం గడుస్తున్న కొద్దీ కాశీనగరంలో మార్పు వచ్చినప్పటికీ అక్కడ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నది అక్షర సత్యం.
అరిషడ్వర్గాలను వదలాలి!!
కాశి క్షేత్రం లో ఏదో ఒకటి వదలాలని పెద్దలంటారు. అయితే ఇక్కడ విడిచిపెట్టాల్సింది ఇష్టమైన పళ్లనో, కూరగాయలనో కాదు.. అరిషడ్వర్గాలను.. కాయ అంటే కాయము (శరీరం), పండు అంటే ఫలము.. ప్రతిఫలాపేక్ష వదిలేయమని అర్థము.. కాశీ నగరాన్ని ఆధ్యాత్మికత దృష్టితో, భక్తిప్రపత్తులతో దర్శించుకున్నవారి జన్మ ధన్యమే.. అటువంటి తన యాత్రా విశేషాలను మనకందరికీ తెలియజేసిన రచయిత్రికి ధన్యవాదాలు.
పుష్ప దంతేశుని దర్సనం..
బ్రహ్మ, విష్ణు, శివాత్మక ప్రతిరుపాలైన త్రి దళాలతో లక్ష్మీదేవి నెలకొని ఉన్న మారేడు దళాలతో శివుని పూజిస్తారు. తులసి లేకుండా విష్ణుపూజ, మారేడు లేకుండా శివార్చన, గరిక లేకుండా గణపతి పూజ చేయరు. ఈ పవిత్ర పూజ సామాగ్రిని, పూజా ద్రవ్యాలను పొరపాటున గాని, ఏమరుపాటున గాని కాళ్లతో తొక్కిన మహాపాపం. కాశీలో కొలువైన పుష్పదంతేశుని కొలిచినట్టైతే ఆ పాపహరణం చేసుకోవచ్చని అక్కడి అర్చకులు చెబుతారు..!!
ఇక్కడి కాలభైరవ ఆలయ సమీపంలో విశ్వేశ్వర్ గంజ్ ప్రాంతంలో ఉండే కొత్వాల్ పోలీస్ స్టేషన్ లో ఒక ప్రత్యేకత ఉంది. ఇంచార్జి స్థానంలో కాలభైరవుని ఫోటో ఉంచి, పూజలు చేస్తారట. పక్కన కుర్చీలో ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తారట. ఇలాంటి విశేషాలెన్నో కాశీ నలుమూలల్లా చూడొచ్చు.
ఆవేదన నుంచి ఆధ్యాత్మికత
కాశీ యాత్ర విశేషాలు ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి రచయిత్రి తన జీవితంలో సంఘటనలను మేళవించి రాసిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్న తనంలో తన జీవితంలో జరిగిన పెను విషాదం, దాని వల్ల కలిగిన అభద్రతా
భావం, ఆ ఘటన నుంచి బయటపడటానికి చేసిన అనేక ప్రయత్నాలు ఉన్నపుడు మనసు మెలిపెట్టినవుతుంది. అయితే వాటిని అధిగమించి యోగ సాధన ద్వారా వచ్చిన మార్పులు, తన జీవితానికి దిశానిర్దేశం చేసుకున్న తీరు ప్రశంసనీయం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడుదొడుకులను యోగసాధన, దైవారాధన తో అధిగమించిన విధానం ఈ తరం వారు కచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం. Mukti Kshetra book review
పుస్తకానికి ముందు మాటతో పాటు, అందమైన ముఖచిత్రాన్ని అందించిన చిత్రకారులు శ్రీ కూచి సాయి శంకర్ మాస్టారు ప్రతిభ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నాకు ఆరోగ్యపరంగా, వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు సలహాలిస్తూ.. నా ఆత్మస్తైర్యానికి తానూ ఒక కారణం అవుతున్న రమా శాండిల్య అమ్మకు అభివందనాలు తెలియజేసుకుంటూ.. మరో ఆధ్యాత్మిక యాత్ర త్వరలోనే పుస్తక రూపం దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా…!!
అమ్ము.బమ్మిడి, రచయిత
పుస్తకం : ముక్తిక్షేత్రం
రచయిత : రమాశాండిల్య
వెల : 150/-