Mother’s dream మాతృస్వప్నం ( కవిత)

Mother’s dream

మాతృస్వప్నం ( కవిత)

ఈ నిశ్శబ్ద నిశీధి
భయంగొలుపుతోంది
ఇది ప్రళయం ముందటి
హెచ్చరికే అనిపిస్తోంది

నీ విహారం ఆపేసి
నా హృదయాంబుదిపై వాలి
ఆ ఉప్పెన చప్పుడు విన్నాక
మళ్లీ విహరించేవు గానీ

నా గర్భంలో శిశువు
భూకంపం పుట్టిస్తూ ఉన్నాడు
వాడు నా నవనాడుల్ని
మెలిపెట్టేస్తూ ఉన్నాడు
ఓ వైపు మధుర భావన
మరో వైపు బెదురు యావ
నా అదరాల్ని వణికిస్తున్నాయి
పురుడు ఇప్పుడో అప్పుడో

వాడు జననంతో పాటూ
మనన హక్కుల్నీ సహితం
ఈ నేల పత్రం మీద వ్రాసుకొని
మరీ వస్తున్నాడు

అందుకే నేను వాడికోసం
బోధిసత్వుడి ఆకాంక్షలు
పృథ్వి మీద పరిఢవిల్లాలని
స్వప్నిస్తూ ఉన్నాను

నీవు ఆకాశ దిగి
నా భుజంపై వాలిపో
నా చెవిలో ధైర్యపు బీజాక్షరాల్ని
ఉపదేశించేవు గానీ

ఇప్పుడు నాకు
తోడుండాల్సిన వాడు
సరిహద్దును కాపు కాస్తున్నాడు

జననం కోసం పుత్రుడు
మాతృభూమి కోసం తండ్రీ
ప్రసవం కోసం నేనూ
మృత్యువుతో చదరంగం
ఆడుతూనే ఉన్నాం

అచ్చట డేగలు నీకోసమే
మాటేసి ఉన్నాయట
మానవ రుధిరం మరిగిన
పులి దాహపు ఆవిరులు
మేఘాలై కమ్ముకున్నాయట
ఏ క్షణమైనా సునామీ
ముంచేయొచ్చట

సరిహద్దులు ఏవైనా
తెగిన పేగుబంధాలు కురిసే
రక్తాశ్రువులు ఉప్పగా వెచ్చగా
ఉంటాయని నీకు తెలియదా

నీవు లేత మల్లెల కన్నా సుకుమారం
నీ హృదయం నిను నేను
చిత్రించబోయే చిత్రవస్త్రం కన్నా తెలుపు

నీవు టపటపా చప్పట్లు కొడుతూ
అష్టదిక్కుల్ని అల్లేస్తూ ఉంటే
శాంతి ఎంత సుందరమో
ద్యోతకమౌతూ ఉంటుంది
నీవు నేలకూలి నెత్తుటి మడుగులో
గిలగిలా తన్నుకుంటూ ఉంటే
రణం మారణహోమం ఎంతటిదో
బోధపడుతూ ఉంటుంది

కాలాలు మరువని
హిరోషిమా నాగసాకీ పొలికేకలు
నీ జీవన స్మృతుల్లో ఈటెలై నిన్ను
వేటాడుతూనే ఉన్నాయి కదా
ఆ కపాలాల విలాపాలాపనలు
చరిత్ర వీధుల్లో ప్రతిధ్వనిస్తూనే
ఉన్నాయి కదా

మిన్నులో నీ పయనం ఆపి
నా నయనాల కలల్లో
నీ ప్రతిబింబాన్ని చూడు
నీవూ నేనూ ఒకటిగానే
అగుపిస్తాము

నాకూ నీ లాగే శాంతి కపోతమై
విశ్వమంతా విహరించాలని ఉంది

పర్కపెల్లి యాదగిరి

Mother's dream / zindhagi.com
Comments (0)
Add Comment