Motherland is calling you and me
దేశమాత పిలుస్తోంది నిన్నూ నన్నూ
ఆనందంతో నా గుండె
హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది ఇప్పుడు
నేలను ముద్దాడిన త్యాగధనుల రక్తపు మరకలు
ఇంకా శబ్ధం చేస్తూనే వున్నాయి
తట్టిలేపిన మట్టివాసనలోంచి నా దేశం పేరు
తొణికిసలాడుతు తళుకులీనుతుంటే
ఎగురుతున్న జెండాను చూస్తూ
ముడివీడిన నా కనురెప్పల సందుల్లోంచి జారిన
అశ్రు బిందువులు రెండు
ఆనందభాష్పాలై ఉబ్బితబ్బిబ్బౌతున్నాయి
నా దేశం పేరు నరనరాన వినిపిస్తోంటే
నే తాకిన ప్రతి అడుగూ
నాదేనన్న భావన రాగానే
ప్రకంపనలతో నా దేహం పరవశించిపోతోంది
నిశ్చలంగా చూస్తున్న పృకృతినంత
ఒక్కసారిగా ఆలింగనం చేసుకోవాలన్న చిన్న ఆశ
ఒంటిమీది వెంట్రుకలకెంత దేశభక్తో మరి
నా దేశం పేరు వినిపిస్తోంటే
నిక్కబొడుచుకుంటూ నినదిస్తోంది మళ్ళీ మళ్ళీ
భారత్ మాతాకీ జై అంటూ….
అంతరాలు ఎన్నున్నా
అంతరంగాలు ఒక్కటిగా చేసుకుని
కల్మషమెరుగని కన్నీరులా కదిలిపోదాము
దేశమాత పిలుస్తోంది నిన్నూ నన్నూ…