శక్తి స్వరూపిణి వీణా పాణి
మూలా నక్షత్ర యుక్త సరస్వతి పూజ
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!
మూలా నక్షత్ర యుక్త సరస్వతి పూజ సందర్భంగా.. శరన్నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది దినాలలో తొమ్మిది రూపాలలో శక్తి/దేవి ఆరాధన అనాదిగా ఆచరణలో ఉంది. సరస్వతి అన్న పదం కూడా రెండు పదాలనుండి వచ్చింది. సర: అంటే సారము అని, స్వ: అంటే నా/వ్యక్తి యొక్క. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీ దేవి అయ్యింది.
చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. వేదకాలం నాటి జ్యోతిషం ప్రకారం బుధ గ్రహానికి సరస్వతిని అధిదేవతగా పేర్కొంటారు. అంతే కాదు సృష్టి సమయంలో బ్రహ్మ ఏకాగ్రతకు భంగం కలగకుండా నిరంతరం వీణ వాయిస్తునే ఉంటుంది. సరస్వతీ దేవీని బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించ డానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా భారతి,
సరస్వతి, శారద, జగతీ ఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధి ధాత్రి, వరదాయిని, క్షుద్ర ఘంట, హంస వాహినిగా, వీణా పాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింప బడుతుంది. సంగీతం, సాహిత్యం, మేధస్సు, ప్రతిభ, స్మృతి, వ్యాఖ్యానం, బోధనాశక్తి, సందేహ నివారణ శక్తి – సరస్వతీ రూపాలే. పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులను సమన్వయం చేయించే ‘సమన్వయ శక్తి’ భారతీ దేవి. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. “శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉటకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.వ్యాసుడు, యాజ్ఞవల్క్యుడు, వాల్మీకి లాంటి ఎందరో మహర్షులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకుని మహోన్నతమైన కావ్యాలను రచించారు. ఆశ్వయుజ పాడ్యమి నుండి దశమి వరకు మొదటి మూడు రోజులు చెడును దూరం చేసే దుర్గామాతగా, తర్వాత మూడు రోజులు సంపదనిచ్చే లక్ష్మీదేవిగా, చివరి మూడు దినాలు చదువుల తల్లి సరస్వతిని పూజించడం పరంపరాను గతంగా అనుసరిస్తున్న సంప్రదాయం. కేరళ, తమిళనాడు లలో నవరాత్రి చివరి మూడు రోజులలో, మహారాష్ట్ర గోవా, కర్నాటక ప్రాంతాలలో మహా సప్తమి సరస్వతీదేవి ఆవాహనం అష్టమి ప్రధాన పూజ, నవమి ఉత్తర పూజ, విజయ దశమి నాడు విసర్జన చేస్తారు. ప్రధానంగా దేవీ నవ రాత్రులలో మూల నక్షత్రం నాడు పుస్తక రూపిణియైన సరస్వతి విద్యా సంస్థలు, స్వగృహాలలో పూజించడం నేటికీ కొనసాగుతున్నది. పరాశక్తి
ధరించిన ఐదు రూపాలలో సరస్వతి ఒకటి. ఆమె కేవలం చదువులకే కాకుండా, సర్వ శక్తి సామర్థ్యాల ప్రసాదినిగా పూజలందు కుంటుంది. రుగ్వేదంలో, దేవీ భాగవతంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, పద్మ పురాణంలో సరస్వతి గురించిన గాధలున్నాయి. వాక్కు వివేకం, బుద్ధి, విద్య, కళలు, విజ్ఞానం అన్నింటికి అధిదేవతగా
హిందుమత ప్రభావితమైన బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహి సరస్వతి, చర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి వంటి నామాలతో ఆరాధన జరిగింది. జైనులు శృత దేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా ఆరాధించగా, భోజ మహారాజు శ్రీ మత్ భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ” అని వాగ్దేవిని ప్రతి ప్రతిషించారని ప్రసిద్ధి. క్రీ.పూ.2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం ఉత్తర ప్రదేశ్లోని మధుర సమీపంలో ఖజ్జాలీటీలో లభించింది. సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణాలపై ఒకవైపు సరస్వతి, మరోవైపు వీణను ముద్రింప చేశాడు. క్రీ.శ.10వ శతాబ్దంలో ఒడిషాలో వీణాపాణి యైన సరస్వతి విగ్రహం చెక్కబడింది. పాలవంశపు రాజుల నాటివని చెప్పబడే సరస్వతి విగ్రహం పాట్నా, కలకత్తా మ్యూజియంలలో భద్ర పరచబడి ఉన్నాయి. ఖజురాహోలోని పార్వనాధాలయంలో, ఖండరీయ మహా దేవాలయంలో వాగ్దేవి విగ్రహాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని ఘంటసాలలో క్రీ.పూ.2వ శతాబ్దికి చెందినదైన సరస్వతి విగ్రహం లభ్యమైంది. చాళుక్యులు నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. నిర్మల్ జిల్లా బాసరలో వేద వ్యాసునిచే ప్రతిష్టితమై,నిత్య భక్తజన సందడితో అలరారుతున్న జ్ఞాన సరస్వతి దేవాలయం గోదావరి తీరాన ఉంది. ఒకనాటి కాశ్మీర్, ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్ భూ భాగంలో ఉన్న శారదా మందిరం అత్యంత ప్రాచీనమైనది. శాండిల్య మహామునికి సరస్వతి సాక్షాత్కారం ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో జరిగినట్లు కథనం. ఆదిశంకరులు, రామానుజులు ఇక్కడి దేవతను దర్శనం చేసుకున్నారని చెపుతారు. శృంగేరీలోని ఆది శంకర ప్రతిష్టిత సరస్వతీ మూర్తి ఆలయం, తమిళనాడులోని కూతనూర్ వద్ద మందిరం, రాజస్థాన్ లోని పిలానీలో బిర్లా కుటుంబీకుల నిర్మిత, తంజావూర్, శ్రీరంగం తదితర ప్రాంతాలలో సరస్వతీ దేవి పూజలందు కుంటున్నది. వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. దుర్గాదేవి నక్షత్రమైన మూలానక్షత్రం రోజున సరస్వతిగా అలంకరించటం విశేషం. ఏడవరోజు సప్తమి మూల నక్షత్రంరోజు నవరాత్రుల్లో ఒకచేతిలో వీణ మరో చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా భాసిల్లే సరస్వతీదేవి అవతారంలో అమ్మవారికి అభిషేకం చేసి, పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. పిల్లలు విద్యా విషయంగా వృద్ధి చెందుతారు.
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494