Mercy Margaret Poetry
అనుభూతి, ఆగ్రహం, ఆలోచన
మెర్సీ మార్గరేట్ కవిత్వం
చిత్రలేఖనం నిశ్శబ్ద కవిత్వమైతే, కవిత్వం మాట్లాడే చిత్రలేఖనం. మెర్సీ మార్గరేట్ కవిత్వం నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. మాట్లాడుతూ మౌనంగా వుంటుంది. ఒక్కో పదం పెయింటింగ్‌లా కళ్ల ముందు కదులుతుంది. ఎన్నో సత్కారాలతో పాటు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం (2011) కూడా పొందిన మెర్సీ కవిత్వంలో అనుభూతి, ఆవేశం, ఆలోచన వున్నాయి. కాలం వాలిపోతున్న వైపు కవితా సంపుటి రెండోది.
మొదటిది మాటల మడుగు
కాలం వాలిపోతున్న వైపు కొంచెం కొంచెంగా చదివాను. ఒకేసారి చదివేస్తే అయిపోతుందని. కాలం వాలిపోతున్న వైపు చూపు సారించాను. కరచాలనాల మధ్య మృత్యువు లీలగా నవ్వడం అర్థం కావాలంటే జీవితం తెలియాలి.
ఆమెను రక్తమాంసాలతోనే పెరగనీ
కట్టుబాట్ల సిమెంట్ ఇసుకలతో
చలువరాతి చలనం లేని స్థితిలో కాదు
ఆడపిల్లలు ఎలా పెరగాలో చెప్పడానికి ఇంతకంటే ప్రతీక ఏముంటుంది?
కూతుళ్ల రెక్కలు నరకడానికి..
రెక్కల ఆకాశం కూడా ఫెమినిస్టు కవిత. చాలా ఏళ్ల క్రితం చదివిన మార్క్వెజ్ కథతో పాటు, జయ రాసిన రెక్కలున్న పిల్ల కథ కూడా గుర్తొచ్చాయి. మన అమ్మలు, అమ్మమ్మలు విరిగిపోయిన రెక్కలతోనే జీవించారు. మన పిల్లలైనా ఎగిరితే చాలు. కానీ చాలా మంది తండ్రులు ఇంకా కూతుళ్ల రెక్కలు నరకడానికి సమాజాన్ని సాన పెడుతున్నారు. Mercy Margaret Poetry
పుస్తకం అంటే చెట్టు చేసిన త్యాగం
మాటల్ని పొదుపుగా వాడడమే కవిత్వం. అదో రసవిద్య. మాటల్ని బంగారం చేయడం మెర్సీకి తెలుసు. చాలా మాటలు, పదాలు, అక్షరాలు వెంటాడుతూ వుంటాయి. ప్రతి పుస్తకంలో చెట్టు లిపితోనే మాట్లాడ్తాం. ఎందుకంటే పుస్తకం అంటే చెట్టు చేసిన త్యాగం, కన్న కల, రక్త స్పర్శ. చెట్లు అతి పురాతన మహా బోధకుడు కూడా ఆమె దృష్టిలో. ఇది చదివినప్పుడు , విన్నప్పుడు నుంచి ఆడుకున్న చెట్లు, కళ్ల ముందే ఎండు మృతదేహాలుగా మారి ట్రాక్టర్లలో రాలిపోయిన దృశ్యాలు గుర్తుకొచ్చాయి.అదృశ్యాదృశ్యం కవితలో ప్రవహించే సెలయేటిలో ఒంగి ఒంగి రూపం చూసుకునే ఊరు మాయమవుతుంది. పట్నం రాకాసి తినేసింది. వలస వెళ్లిన పక్షులు, తిరిగి వస్తున్న రెక్కల చప్పుళ్లు వినిపించాలని మెర్సీ ఆశ. జరిగేనా?
ఇవన్నీ అనుభూతి చెందాలంటే..
రైతు మట్టి దేహంపై మొలకెత్తిన పాట, పాడడం వచ్చనుకున్న చిలుకల సందడిలోకి విషాద రుతువు, నోట్లు రాలుతున్న శబ్దం మధ్య వినిపిస్తున్న దేశభక్తి గీతం , తాగుబోతు తండ్రి. మద్యం సీసా ఖర్చుకైనా కన్నీరు, రెండు చిన్ని పిచ్చుకలు చప్పరించే మాటలు, డబ్బు మనిషి వాసనేయడం, చెవులపై పూసే సంగీతపు చెట్టు, ముంజేతికి వేలాడే తాళం, అడవంతా పారే నదీ దీపం, ఏకలవ్యుల బొటనవేళ్లు తిన్నవాళ్లు, సీతాకోక రెక్కల వర్షం, రెండు కళ్ల నిండా తవ్వుకున్న ఇంకుడు గుంతలు, ఇవన్నీ అనుభూతి చెందాలంటే కాలం వాలిపోతున్న వైపు చదవాలి. Mercy Margaret Poetry
నిజానికి తూనికలు , కొలతల మధ్య జీవిస్తున్నప్పటికీ , ఈ కవిత్వాన్ని తూచే తూనికరాళ్లు లేవు. ఆకాశమంత ఎత్తు లేకపోతే ఏం? ఒక గోడను వెతుక్కున్నాం. ఆ గోడపై ఒక చిత్రలేఖనం, రహస్య లిపితో , మెర్సీ మార్మిక కవిత్వం.