Man Korkelu (poetry)
మనిషి కోర్కెలు (కవిత్వం)
జీవితం కోర్కెల అంగడి
అమ్ముడుబోతున్న కొద్దీ
కొత్త స్టాకు వచ్చి చేరుతుంది!
కోర్కెలు రెక్కలు గుర్రాలు
ఎగిరే కొద్దీ ఆకాశాన్ని చేరుకోవాలనే
వల్లమాలిన దురాశ..!
సముద్రంలోని చేపలు కోర్కెలు
పట్టడానికి
ఎన్ని వలలైనా సరిపోవు…!
కలల తుపానులు కోర్కెలు
ఎంత కట్టడి చేసినా
తమపని తాము చేస్తాయి,!
కోర్కెలు పుట్ట గొడుగులు
ఎన్ని తీసినా
కొత్తగా పుట్టుకొస్తూనే వుంటాయి.
కోర్కెలు అక్షయ పాత్ర
నెరవేరే కొద్దీ
నిండుతూనే వుంటాయి.
కోర్కెలు సుడిగుండాలు
సోయి లేకుండానే
నిండా ముంచేస్తాయి.!
కోర్కెలు చేప ముళ్ళు
కసుక్కున గొంతులో దిగబడి
నానా పరేషాన్ చేస్తాయి.
పరమపద సోపాన పటంలో
పాములు కోర్కెలు
ఎప్పుడు కాటేస్తాయో తెలీదు!
మిత్రమా..!
జర పైలం
కోర్కెలు ఊబి గుంటలు
తెలీకుండానే ముంచేస్తాయి..!!