malloju madhuramma : మల్లోజుల మధురమ్మ ముచ్చట మర్చిపోలేను

mallojula madhuramma : మల్లోజుల మధురమ్మ ముచ్చట మర్చిపోలేను

మత్తెండ్ల కింద కట్టుకున్న ఆ ఇంట్లోకి ఎళ్లంగనే గన్నేరు చెట్టు నిండ పూసిన పూల వాసన గుప్పుమంది. ఆ ఇంట్లోని వాకిట్లో మొలసిన ఎర్రని పూల మొక్కలకు పూసిన పూలను చూస్తే భలే గమ్మత్తనిపించింది. గిదంతా ఎక్కడో అని సోచాంచుతుండ్రా…? కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లిలోని మల్లోజుల కోటేశ్వర్‌‌రావు అలియాస్‌ కిషన్‌జీ ఇల్లు..

ఆ ఇంట్లోకి వార్త తెద్దామని పోయి మత్తురోజులైంది. కానీ.. ఆ దినం నాకింక యాదికుంది. ఆ ఇంట్లోకి ఎళ్లంగానే ఆకు పచ్చరంగు కాటన్‌ చీర కట్టుకుని, తెల్లని రయిక తొడుక్కుని ముడతలు పడ్డ మొఖంతో కనిపించిన ఆ అవ్వనే మల్లోజుల కోటేశ్వర్‌‌రావు, మల్లోజుల వేణు గోపాల్ రావుల కన్నతల్లి.

అగో.. ఇంతకు గీ మల్లోజుల కోటేశ్వర్‌‌రావు, మల్లోజుల వేణు గోపాల్ రావు ఎవలో చెప్పలేదు గదా.. వాళ్లిద్దరూ నక్సలైట్లే. వాళ్లను గన్నది మాత్రం మల్లోజుల మధురమ్మ. 50 ఏళ్ల కింద నక్సలైట్ బాట పట్టినోళ్లలో మల్లోజుల కోటేశ్వర్ రావును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్ కౌంటర్ లో కాల్చి చంపింది. మరీ.. మల్లోజుల వేణు గోపాల్ రావు మాత్రం ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ తుపాకి  గొట్టం ద్వారానే సాధిత్తామని ఇగో ప్రభుత్వాలకు దొరక్కుండా ఆజ్ఞాతంలో ఉండి కొట్లాట చేత్తుండ్రు. బతికుండగానే ఒక కొడుకు మల్లోజుల కోటేశ్వర్ రావు ఎన్ కౌంటర్‌‌లో మరణిస్తే.. మరో కొడుకు వేణు గోపాల్ రావు యాడున్నాడో తెలియక ముసలి తనంలో గా వాళ్లను గన్న మధురమ్మ ఎన్ని కష్టాలు పడుతుందో వార్త కథనం ఇవ్వాలని అరుచుకోవడానికి పోయినప్పుడిదే గీ ముచ్చట.

అగో గా పెద్దపల్లికి పోయినప్పుడు నేనత్తని మారం చేసి నాతో నా బిడ్డ మల్లిక వచ్చింది. ఇద్దరు నక్సలైట్లను కన్న ఆ తల్లిని మాట్లాడిత్తనని వచ్చింది. ఇంట్లోకి పోంగనే కనిపించింది మల్లోజుల మధురమ్మ. కళ్లకు పెద్ద కళ్లద్దాలు.. తెల్లని ఛాయరంగులో ఇంటి అరుగు మీద కూర్చుని ఉంది ఆ తల్లి.. ఆ ఎనుక గోడకు పక్కపక్కనే దేవుళ్ల ఫొటోలున్నాయి. ఆ పక్కనే పెద్దగా మల్లోజుల కోటేశ్వర్‌రావు, అతడి తండ్రి వెంకటయ్య ఫొటోలు కనిపించినయి.

‘అమ్మ.. నమస్తే..’ ఆ తల్లిని చూడంగానే రెండు చేతులు జోడించి దండం పెట్టిన. ‘ఎవరు బిడ్డా..’ పక్కనే ఉన్న కళ్లద్దాలను పెట్టుకుని చూస్తూ అడిగింది మల్లోజుల మధురమ్మ. ‘నా పేరు మల్లేష్‌..’ నేను రిపోర్టర్‌ను.. నేను పని చేసే టీవీ ఛానెల్ పేరు చెప్పాను. ‘రా.. బిడ్డా.. కూర్చో. ఇంతకు ఏంపని మీదచ్చావ్‌.. బాబు..’ అప్యాయతతో పలుకరించింది ఆ మాతృమూర్తి.

తొంభై ఏళ్లకు అడుగులు పెడుతున్న ఆమె ఇంకా ఆరోగ్యంగానే కనిపిస్తోంది. మధురమ్మ ముందు కూర్చుంటే నా బిడ్డ మల్లిక కొంత దూరం నుంచి ఆ తల్లినే చూత్తుంది. కెమెరామెన్‌ భాను కెమోరా కిట్‌తో ఇంట్లోకి వచ్చిండు. ఆలస్యం చేయకుండా స్టాండ్‌ వేసి కెమెరా ప్రేమ్‌ సెట్‌ చేసిండు.

‘ఇంతకు ఎందుకొచ్చారు బిడ్డా.. హైదరాబాద్ నుంచి..’

‘నీ ఇద్దరు కొడుకులు కోటేశ్వర్‌ రావు.. వేణుగోపాల్‌లు చిన్నప్పుడే నక్సలైట్లలలో కలిసి పోయిండ్రు గదా.. గీ వయసులో నీ దగ్గర లేని నీ కొడుకుల గురించి ఏమనుకుంటున్నావో.. టీవీలో చూపించాలని వచ్చానమ్మా..’ ముచ్చట పెట్టిన.

‘ ఇప్పటికే కోటన్నను పోలీసులు కాల్చీ చప్పిండ్రు.. టీవీలో నన్ను చూపిత్తే మా వేణుకు ఏమి కాదా..? ఎక్కడ ఉన్నాడో వాడన్న క్షేమంగా ఉంటే చాలు బిడ్డా..’ మధురమ్మ కళ్లలో భయం..

‘వేణుకు ఏమి కాదమ్మ… నీవు ఎలా ఉన్నావో… టీవీలో చూస్తాడు అతను.’ మాట్లాడుతునే నెపల్‌ మైక్‌ను మధురమ్మ కొంగుకు కనబడకుండా పెట్టిన. లోగో పెట్టి మాట్లాడుమంటే అనుకున్న సమాచారం రాదనిపించి నెపిల్‌ పెట్టిన. అప్పటికే కెమెరా సెట్‌ చేసుకున్నాడు భాను ‘క్యూ..’ అంటూ సిగ్నల్‌ ఇచ్చిండు అతను.

‘నీ ఇద్దరు కుమారులు కోటేశ్వర్‌ రావు.. వేణుగోపాల్‌ రావులు నక్సలైట్లల్లో ఎప్పుడు కలిసిండ్రమ్మ..?’

‘ఏమి చెప్పుమంటావ్‌ బిడ్డా.. వాళ్లు చదువుకుంటునప్పుడు ఇగో ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జేన్నీ కాలంలో నా ఇద్దరు కొడుకులు కోటన్న.. వేణు నక్సలైట్‌ పార్టీలో చేరిండ్రు.. గప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావుండే.. గీ నక్సలైట్లతో సంబంధాలున్నాయని చదువుకునే పిల్లలను పట్టుక పోయి చాలా మందిని కాల్చి చంపిండ్రు.. ఇగో గప్పుడే గా నక్సలైట్‌ పార్టీలో నా కొడుకులు చేరిండ్రు.’ యాభై ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయిన బిడ్డల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది తల్లి మధురమ్మ.

ఆ కన్న కొడుకుల చిన్నప్పుడు ఆడి పాడినయి గుర్తుకొస్తున్నాయెమో.. ఆ తల్లి కళ్ల నుంచి కన్నీళ్ల బొట్లు రాలినయి. ఒక చేత్తో కళ్ల అద్దాలను తీసి కన్నీళ్లను కొంగుతో తుడుసుకుంటూ కొంతసేపు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంది ఆమె..

బుడి బుడి నడకలతో అల్లరి చేస్తూ తన కొడుకులు గుండెలపై తన్నిన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఆమెకు గుర్తుకు వచ్చాయేమో.. కడుపులో దాచుకున్న దుఃఖం బయటకు తన్నుకు వస్తోంది. మరోసారి కళ్లద్దాలను తీసి కన్నీళ్లను కొంగుతో తుడుసుకుంది.

‘‘ బిడ్డా… కోటన్న.. వేణు ఇద్దరు చాలా తెలివి గల పిల్లలు.. కోటన్న లాయర్‌ చదువు కోసం కరీంనగర్‌ వెళ్లిండు.. అక్కడ ఎవరెవరు కలిసారో తెలియదు గాని.. పుస్తకాలు బాగా చదివేవాడు.. రాను.. రాను.. అతనిలో మార్పు కనిపించింది.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పేద ప్రజలు.. దొరల దోపిడీ.. అంటూ వాళ్ల నాన్నతో మాట్లాడేవాడు. యాభై ఏళ్ల క్రింద అనుకుంటా.. ఇందిరమ్మ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది గదా.. గప్పుడు కమ్యూనిష్టులు యాడ కనబడితే అడా పట్టుకుని పోలీసులు కాల్చీ వేస్తుండే.. కోటన్న.. వేణు ఇద్దరు ఇంటికి వచ్చి మేము నక్సల్స్‌ పార్టీలోకి పోతున్నామని చెప్పిండ్రు.. నాకేమి అర్థం కాలేదు. వద్దు బిడ్డా.. మంచిగా చదువుకుని జాబ్‌ చేసుకొండ్రి.. అని చెప్పినా.. ఇక్కడుంటే మమ్ములను పోలీసులు పట్టుకెళ్లి చంపేస్తారమ్మ.. మేము పేద ప్రజల కోసం నక్సల్స్‌ పార్టీలో చేరుతామన్నారు. గాళ్ల నాయన మల్లోజుల వెంకటయ్య కూడా బిడ్డలకే సపోర్టు చేసిండు. మన పిల్లలు లంగతనలు చేయడానికి పోతాంటలేరు గదా..  నక్సలైట్‌ పార్టీలో కలిసి పేదోళ్లకు అన్యాయం జరుగకుండా చూస్తారని నన్ను సముదాయించిండు.. ఇగో.. గప్పుడు ఇంటి నుంచి పోయిండ్రంటే మళ్లీ ఇద్దరు తిరిగి ఇంటి ముఖం చూడక పాయిరి… మా ఆయన వెంకటయ్య చని పోయినప్పుడు కూడా ఇద్దరు కొడుకులు చావుకు కూడా రాలేరు. కానీ.. మా కోటన్న.. వేణులు మారు వేషంలో తండ్రి చావుకు వస్తారని పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో వచ్చిండ్రు. మా ఇంటిలో మంచైనా.. చెడైనా.. ఏది జరిగినా… ఇప్పటికి ఇంటి చుట్టూ సీఐడి పోలీసులు తిరుగుతారు.’’

‘‘మీ కొడుకులు నక్సలైట్‌ పార్టీలో కలిసినందుకు పోలీసులు మిమ్మల్ని ఏమి అనలేదా..?’’

‘‘ఎందుకు అనలేదు.. కోటన్న.. వేణు ఎక్కడున్నారో చెప్పుమని వాళ్ల నాన్నను.. అన్నను పట్టుక పోయి పోలీసుస్టేషన్‌లో వేసి మత్తుసార్లు కొట్టిండ్రు.. కానీ.. వాళ్లకు కూడా తెలియదు గదా.. కొన్ని రోజులు పోలీసు స్టేషన్‌ చుట్టూ తిప్పిచ్చుకునే వాళ్లు.. గా పెద్దపల్లి డీఎస్పీ బుచ్చిరెడ్డిని నక్సల్స్‌ కాల్చి చంపినప్పుడైతే మా ఇంటికి పోలీసులొచ్చి ఇంట్లోని సామాన్లన్ని చిందర వందర పడేసిండ్రు. మా అందరిని లాఠీలతో కొట్టిండ్రు..’’

‘‘నీ కొడుకు కోటేశ్వర్‌ రావు నక్సలైట్ల పార్టీలో కలిసింతరువాత మళ్లేప్పుడు చూసావమ్మ..’’

‘‘పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నా కొడుకు కిషన్‌జీ పేరుతో టీవీలలో మాట్లాడుతుంటే చూసిన.. పేదోళ్ల కోసం కొట్లాడుతున్నాడని.. భూములు లేనోళ్లకు అండగా నిలిసిండని అనుకున్న. గా టీవీలలో మాట్లాడుతుంటే గప్పుడే భయమేసింది.. పోలీసులు పట్టుకుని కాల్చి వేస్తారనుకున్న.. గట్లనే పోలీసులు కోటన్నను  (24 డిసెంబర్‌ 2011 నాడు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం.. మిద్నాపూర్‌ కలోని అడవుల్లో పట్టుకుని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిండ్రు) కాల్చి చంపిండ్రు. ఆరోజు ఏదో పని మీద బయట కెళ్లి తిరిగి ఇంటి కచ్చేసారికి వాకిట్లో మత్తు మంది జనం ఉన్నారు. గా జనం ను చూడాంగనే ఎవరికి ఏమైందోనని భయపడ్డా.. నన్ను చూడగానే పెద్ద కొడుకు అంజనేయులు ఏడుసుకుంట వచ్చి నామీద పడి ‘తమ్ముడు కోటేశ్వర్‌రావు మనకు లేడమ్మ..’ అంటూ ఏడ్చిండు గప్పుడు అర్థమైంది. కోటన్న చని పోయినట్లు.. మత్తు ఏడ్చినా.. గా టీవీలో నా కొడుకు చనిపోయినట్లు వార్తలు చూసి ఏడ్చినా.. కడసారి చూపు చూడాలనుకున్నా.. కోటన్న శవంను పశ్చిమ బెంగాల్‌ నుంచి తీసుక వచ్చిండ్రు. వరవరరావు.. కల్యాణ్‌ రావు.. గద్దర్‌లాంటోళ్లు వచ్చి కోటన్నకు ఎర్రజెండాను కప్పిండ్రు.. అటు తరువాత దహాన సంస్కారలు చేసినము..’’ గోడకు వేలాడుతున్న కోటేశ్వర్‌రావు ఫోటోను చూస్తోంది ఆ మాతృమూర్తి. ఏమి మాట్లాడకుండా కొంతసేపు అలాగే ఉండి పోయింది మధురమ్మ.

‘‘ కోటన్నను చంపిన పోలీసులు నాకు ఐదు లక్షల రూపాయలిచ్చిండ్రని ప్రసారం చేసిండ్రు. నా కొడుకును చంపినోళ్లు పైసాలిత్తే నేను తీసుకుంటానా..? చాలా మంది ఐదు లక్షలిచిండ్రట గదా.. అని అడిగిండ్రు.. అదంతా ఆబద్దం..’’ కన్నీళ్లను తుడుసుకుంటూ మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది.. కానీ.. ఆ తల్లి మధురమ్మ నోటి నుంచి మాటాలు రాక కొంతసేపు మౌనంగా ఉంది.

‘‘నక్సలైట్‌ పార్టీలోకి వెళ్లిన నీ కొడుకులను ఎప్పుడైన కలిసావమ్మ..? వాళ్లు నక్సల్స్ లలో కలిసినప్పుడు ఏమని పిచ్చింది..?’’

‘‘బిడ్డా… ఏ తల్లైనా.. కొడుకులు కళ్ల ముందు భార్య పిల్లలతో మంచి గుండాలని కోరుకుంటుంది గదా.. నేను అంతే గదా.. నా ఇద్దరు కొడుకులు దూరమయ్యారని అప్పుడప్పుడు బాధపడుతుంటి.. మా ఆయన (భర్త) వెంకటయ్య ధైర్యం చెప్పి నన్ను ఓదార్చే వాడు. మన పిల్లలు లంగల లెక్క.. చెడ్డ పనులు చేస్తలేరు.. గాళ్లు పేదల రాజ్యం రావాలని కొట్లాడటానికి పోయిండ్రు.. నీలాంటి తల్లుల బాధలు పోవాలని తుపాకులు పట్టుకుని కొట్లాట చేస్తుండ్రు. పులులు లాంటి పిల్లలను కన్నందుకు తల్లిదండ్రులుగా మనం గర్వ పడాలి.. అనే వారు.’’

కళ్ల నుంచి వస్తున్న ఆ తల్లి మధురమ్మ కన్నీళ్లను  కెమెరామెన్‌ భాను క్లోజ్‌ఆఫ్‌లో బందిస్తుండు.

‘‘బిడ్డా.. నీకొక విషయం చెప్పాలి.. మా ఆయన చాలా ధైర్యవంతుడు.. అతను నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిండు. రజాకార్ల దౌర్జన్యాలను నిలదీసిండు. చాలా రోజులు జైల్లో ఉన్నాడు. గప్పుడు ఆడోళ్లు బయట తిరుగాలంటే కూడా కష్టంగా ఉండే.. మా ఆయన ఇంటికి రాకుండా కోట్లాడుతుంటే.. నేను కూడా ధైర్యంగా అయనకు సఫోర్టు చేసిన.. అందుకే ఇద్దరు కొడుకులు నక్సల్స్ లలో కలిసి పోయినా.. మా ఆయన ఎప్పుడు బాధ పడలేడు.. ఆ ఇద్దరు కొడుకులు పేదల కోసం నాలా కొట్లాడుతున్నారని మెచ్చుకునే వాడు.. నిజాం నవాబుకు.. రజకార్లకు వ్యతిరేకంగా కొట్లాడినందుకు ప్రభుత్వం మా ఆయనను స్వాతంత్య్ర సమర యోధుడిగా గుర్తించి ఫించన్‌ ఇస్తోంది.’’

‘‘ఔనా..! మరిప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా..?’’

‘‘ఇప్పుడు నాకు తొంభై ఏళ్లు.. ముసలితనం వచ్చింది.. కాళ్ల కీళ్లు, పెయి నొప్పులు పెడుతుంటాయి. మొన్న బీమారొస్తే హైదరాబాద్‌ వచ్చి దవఖానలో చేరిన.. నాకు ఆపరేషన్‌ కూడా చేసిండ్రు. ఇప్పుడు మెడిసన్స్‌ వాడుతున్న కొంత బాగానే ఉంది.’’

మల్లోజుల మధురమ్మతో ముచ్చట పెట్టి ఇంటార్య్వూ చేస్తున్న తీరును ఆసక్తిగా గమనిస్తుంది నా కూతురు మల్లిక.

‘‘అమ్మ.. రోజంతా నీవేమి చేస్తుంటావో చెప్పు..’’

‘‘పొద్దున స్నానం చేసి మడి కట్టుకుని వాకిట్లో ఉన్న పూలను తెంపుకుని భగవంతుడకి పూజలు చేస్తుంటది..’’ దూరంలో కూర్చుండి మా ఇంటార్వ్యూను గమనిస్తున్న మధురమ్మ పెద్ద కోడలు అంది.

‘‘నీవు దేవుడికి పూజలు చేస్తావు గదా.. ఏమి కోరుకుంటావమ్మ..’’

‘‘ఏమి కోరుకుంటాను.. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటా.. నా చిన్న కొడుకు మల్లోజుల వేణుకు ఏమి కాకుండా చూడుమని భగవంతుణ్ణి ఓ తల్లిగా కోరకుంటా..’’ అంది మధురమ్మ.

‘‘దేవుడికి పూజ చేసిన తరువాత రోజంతా ఏమి చేస్తావమ్మా..” ‘‘నా పెద్ద కోడలు వంట చేస్తే తిని భక్తి చానల్‌ చూస్తుంటా..’’ ఆ సమయంలోనే వాకిట్లో ఏదో వెహికిల్‌ వచ్చిన శబ్దం వినిపించింది.

‘‘అగో.. వాడే.. నా పెద్ద కొడుకు అంజనేయులు.. నా ఇద్దరు కొడుకులు కోటన్న.. వేణుకు వీడు పూర్తిగా విరుద్దం.. పురోహితం చేస్తుంటాడు.’’ అంది మధురమ్మ.. మొఖంకు పెట్టుకున్న పెద్ద బొట్టు.. కాటన్‌ దోతి కట్టుకుని.. షెర్టు లేకుండా టీవీఎస్‌ మోపెడ్‌పై వచ్చిన అతడిని చూడగానే పురోహితుడని ఎవరైనా గుర్తు పడుతారు. మధుమర్మ పక్క నుంచి లేసి వాకిట్లోకి వెళ్లి అంజనేయులుకు నమస్కారం చేసి విలేకరినని పరిచయం చేసుకున్న.

‘‘అమ్మో.. విలేకరులా.. మీతో నేనేమి మాట్లాడాను..’’ భయపడుతూ అంజనేయులు కెమెరాలో కనిపించకుండా దూరం పోయిండు.

‘‘ మీ ఇద్దరు తమ్ముళ్లు నక్సలైట్‌ పార్టీలో కలిసిండ్రు గదా.. నీవు ఎలా ఫీలావుతున్నావ్‌..’’ అడిగిన.

‘‘నేనేమి చెప్పను. వాళ్ల రూట్‌ వేరు.. నా రూట్‌ వేరు.. రైలు పట్టాలు ఎక్కడైన కలుస్తాయా..? మేము అంతే.. గత జన్మలో చేసిన పాప పుణ్యాలకు అనుగుణంగా జరుగుతుంటుంది.’’

‘‘అదే విషయం కెమెరా ముందు మాట్లాడు..” ‘‘మా అమ్మ మాట్లాడుతది.. నేనేమి మాట్లాడను..’’

‘‘ ఈమె నా కూతురు మల్లిక.. నక్సలైట్‌ పార్టీలో కలిసినోళ్ల ఫ్యామిలీ స్టోరీ చేస్తానంటే నాతో వచ్చింది.. ఆమెకు నక్సల్స్‌ గురించి ఏమి తెలియదు.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకా వరంగల్‌లో ఎంటెక్‌ విద్యార్థి శృతిని.. సాగర్‌లను పోలీసులు కాల్చి చంపారు గదా.. ‘నక్సలైట్లలో నేను కలవాలానా.. డాడీ..’ అంది.. మా పాపకు మీరేమి చెబుతారో చెప్పండి..’’ అంజనేయులును మాటాలలో దించడానికి యత్నించాను.

‘‘మీ నాన్నను పోలీసులతో తన్నించాలంటే నీవు నక్సలైట్లలో కలువమ్మ..’’ అతని ఇద్దరు సోదరులు నక్సలైట్‌ పార్టీలో కలిసిన తరువాత పోలీసులు పెట్టిన చిత్రహింసలు గుర్తుకొచ్చి అలా అంజనేయులు మాట్లాడాడనిపించింది.

‘‘మంచిగా చదువుకుని జాబ్‌ చేసుకోమ్మ..’’ సలహా ఇచ్చాడు అతను.

‘‘మీ సోదరుల గురించి నీవు ఏమి అనుకుంటున్నావో.. అదే టీవీలో చెప్పు..’’ అప్పటికే మల్లికతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న అంజనేయులు కొంత కూల్‌ అయ్యాడు. ఆ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని మాట్లాడటానికి ఒప్పించాను.

‘‘ నా సోదరులు కోటేశ్వర్‌రావు.. వేణుగోపాల్‌రావులు ఇద్దరి రూటే సఫరేట్‌.. లెప్టిస్ట్‌ వాళ్లు.. రైటిస్ట్‌ నేను.. గత జన్మలో చేసిన పాప`పుణ్యాల ఫలితమే మనం అనుభవిస్తుంటాము.. అంతా భగవంతుడి దయ.. నక్సలైట్‌ పార్టీలో కలువాలని నా సోదరులకు దేవుడే అలా రాసి పెట్టి ఉంటాడు. ఇంతకన్నా నేనేమి మాట్లాడలేను.’’ అన్నాడు అంజనేయులు.

ఆ తరువాత మల్లోజుల మధురమ్మను బ్యాక్‌సైడ్‌లో కూర్చోబెట్టి ఎండింగ్‌ పీటుసీ చెప్పడానికి కెమోరామెన్‌ భాను ప్రేమ్‌ సెట్‌ చేసాడు. ఎండింగ్‌ పీటుసీ ఇలా చెప్పాను..

‘‘అమ్మా.. వెళ్లోస్తా..’’ ఇంట్లో కుర్చిపై కూర్చుండి గోడకు వేలాడుతున్న కుమారుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు ఫొటోను తదేకంగా చూస్తోంది ఆ మాతృమూర్తి మధురమ్మ.

‘‘సరే బిడ్డా..’’ ఆ ఫోటోను చూస్తూనే అంది మధురమ్మ.. ఆమెకు మల్లోజుల కోటేశ్వర్‌రావు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయనిపించింది. పశ్చిమ బెంగాల్‌ పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చిన కన్న బిడ్డ మృతదేహం గుర్తుకు వచ్చిందెమో..

పట పట కళ్ల నుంచి నీళ్లు రాలుతున్నాయి. కళ్లద్దాలను తీసి కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంది ఆ మాతృమూర్తి. కన్నపేగు కళ్ల ముందు కాటికి పోతే ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో చూసిన ఆ తల్లి బాధ.. ఆవేదన.. కరుడు గట్టిన హృదయాలకు ఏమి తెలుసు..? మధురమ్మ తన కుమారుడు కోటయ్య జ్ఞాపకాల నుంచి బయటకు రాగానే మరోసారి వెళ్లోస్తాను అమ్మా.. అని చెప్పి పెద్దపల్లి నుంచి బయలు దేరాను. మరునాడు స్క్రిప్ట్ రాసి డెస్క్ కు ఇచ్చాను.

కన్న బిడ్డల కోసం తల్లడిల్లుతున్న తల్లి హృదయం..

యాంకర్‌ : నిజాం నవాబు నిరంకుశ పాలనను నిలదీసిన కన్నతండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు వారిద్దరు.. పల్లెలలో దొరల, భూస్వాములు ఆగడాలను చూసి అసహించుకున్నారు వారు.. నునూగు మీసాలు రాక ముందే తుపాకి పట్టుకుని పోరు బాట పట్టిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్‌ రావు.. మల్లోజుల వేణుగోపాల్‌లను కన్న మాతృమూర్తి మధురమ్మపై స్పెషల్‌ స్టోరీ.. నేనెప్పుడు మర్చిపోలేను..

ముగింపు.. మధురమ్మ కొడుకులు ఇల్లు వదిలారు.. ఊరు వదిలారు.. అయినా.. బిడ్డ దుఃఖం కాదనుకుంది.. రహస్యంగా బతికి ఉన్నాడనుకొని గర్వపడ్డది ఆ తల్లి.. కానీ.. నలభై ఏళ్ల క్రితం  ఇంటి నుంచి వెళ్లిన కోటేశ్వర్‌ రావు శవమై రావడం.. మరో కొడుకు జాడ తెలియక.. ఎప్పుడైన తిరిగి వస్తాడన్న ఆశతో ఇంకా ఎదురు చూస్తోంది ఆ తల్లి మధురమ్మ..

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

malloju madhuramma|yatakarla mallesham|zindhagi|
Comments (0)
Add Comment