Mahaprasthana of Bapu dolls-9
బాపు బొమ్మల మహాప్రస్థానం-9
దేనికొరకు..?
ఈనాటి కవిత్వం మంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం చేస్తోంది? అని దిఖ్ఖరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం.” (చలం,యోగ్యతా పత్రం) తన్నుతాను సంబోధించుకుంటూ.. తనను తాను శోధించుకుంటూ, తనను తానే తవ్వుకుంటూ రాసుకున్న ‘ ఆత్మాశ్రయ ‘ కవిత ఇది. ఎంత మహాకవైనా తనూ మనిషే..! తనకూ ఎమోషన్స్ వుంటాయి. రక్త మాంసాలు కష్టాలు నష్టాలు బాధలు గాధలూ వుంటాయి. నిజానికిది శ్రీశ్రీ గారి ఆత్మ శోధన అయినా అందరికీ వర్తించే కవిత. ఆందరికీ అవసరమైన కవిత కూడా. వేళ కాని వేళలలో లేనిపోని వాంఛలతో దారి కాని దారులలో కానరాని కాంక్షలతో దేనికొరకు పదే పదే దేవులాడుతావ్ ? ఆకటితో, అలసటతో, ప్రాకులాడుతావ్ ? శ్రీనివాసరావ్ !
శ్రీనివాసరావ్ !
దేనికోసమోయ్!
నడిరాతిరి కడలి వద్ద
హోరుగాలి ఉపశ్రుతిగ,
నీలోనే నీవేదో ఆలపించుతావ్!
జగమంతా నిదుర మునిగి
సద్దణిగిన నడిరాతిరి
నీలోనే నీవేదో ఆలకించుతావ్!
శ్రీనివాసరావ్ !
శ్రీనివాసరావ్ ! ”
…1939(?)
తవ్వోడలు పెట్టిన తవ్వుకున్నా తరగని కోరికల సమాహారం జీవితం. “నేనెవరు ? అని ప్రశ్నించుకుంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావన్న” రమణులవారి బోధలోని భావం తెలుసుకుంటే.. బాధల బాదర బందీలోంచి, లౌకిక వాసనల దేహపు జైలునుంచి విడుదల కావడం పెద్ద కష్టమేమీ కాదు. మనిషి కోరికలు పుట్ట. కోరికలున్నంత కాలమే తండ్లాట. ఈ తండ్లాట తనతో తాను చేసేది. తన కోర్కెల చిక్కుముడిలో చిక్కుకున్న మనసు పడే వేదన. సంఘర్షణ. శ్రీశ్రీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. Mahaprasthana of Bapu dolls-9
అయితే.. శ్రీశ్రీ గారిది తాత్విక వేదన కాదు! లోకపు ఆవేదన. లోకపు బాధనంతా తన బాధగా చేసుకున్న శ్రీశ్రీ శోధన.. సాధన. బీద బడుగుల కోసం శ్రీశ్రీ శోధన ఇది.
అసలే వేళకాని వేళ.. అందులో దారి కాని దారి. కానరాని కోర్కెలు. దేనికొరకీ దేవులాట. దేనికోసం ఈ పాకులాట. శ్రీనివాసరావ్ !దేనికోసమోయ్! నడిరాతిరి కడలి వద్ద హోరుగాలి ఉపశ్రుతిగ, నీలోనే నీవేదో ఆలపించుతావ్! గొణుక్కుంటావ్! లోకమంతా నిద్దరలో మునగినప్పుడు సద్దు మణిగిన నడిరాతిరి నీలోనే నీవేదో ఆలకించుతావ్! ఎవరు వింటారు నీ ఘోష? శ్రీనివాసరావ్ ! శ్రీనివాసరావ్ ! ”
బాపు బొమ్మకు ” బ్నిం ” వివరణ..!!
బంధనాలు తెంచుకుని బయటకు వెళ్ళి పోవడానికి దారి తెరుచుకుంటే కనబడుతుంది.
ఆ.. OUT గేట్ లోకి తనని గెంటేయించుకున్నట్టు ఈ ఆత్మాశ్రయ ‘ చిత్త’ కవిత్వానికి అక్షరాలా ‘చిత్ర’ రూపం ఇచ్చారు బాపు గారు.
అవ్యక్త ప్రపంచానికి తనను తాను గెంటుకున్న మహాకవి.’ వ్యక్తా వ్యక్త ఆలాపనలో ప్రేలాపనలో (కవితా ఓ కవితా లోని వాక్యాలు అన్వయించుకోక తప్పదు. అవును కదా శ్రీనివాసరావ్) ఏవేవో దారులలోకి వెళ్ళి పోతున్నావ్ ! అవును ఇక్కడ తన ప్రసిద్ధ నామం ‘ శ్రీశ్రీ ‘ అనకుండా
శ్రీనివాసరావ్ ! అనడం వెనుక నిగూడార్థం వుందా? వుంటే.. అదేంటో? అవ్యక్తపు ఊహల అంతరార్థం చెప్పాల్సింది. మీరే.. మీరే… శ్రీనివాసరావ్ !”..(బ్నిం)