Mahaprasthana of Bapu dolls-8
బాపు బొమ్మల మహాప్రస్థానం-8
ఆః….!!
“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే,
నిర్దాక్షిణ్యంగా వీరె…” !!
శ్రీశ్రీ 2.2.1935.
నిజానికిది ఓ మినీ కవిత “మినీ కవిత” అని ప్రత్యేకంగా పేరు పెట్టుకొని పుట్టకముందే శ్రీశ్రీ మినీ కవిత లక్షణాలున్న ఈ కవిత (ఆః) రాశాడంటే ఆశ్చర్యమే మరి.!! (శ్రీ శ్రీ గారిని..’ద్రష్ట అనేది ఇందుకే) ఇందులో మొత్తం ఆరు పాదాలున్నాయి. మూడు పాదాల కొక స్టాంజా! ఇందులో శ్రీశ్రీ శిల్పి చాతుర్యాన్ని చూడొచ్చు. మొదటి స్టాంజా మూడో పాదంలో చివరగా వున్న”వీరు” తర్వాత పాఠకులు ‘ఆః’అని చదువుకోవాలి. అలాగే రెండో స్టాంజాలోని మూడోపాదం చివర..” వీరే ” తర్వాత కూడా ఆ:! అని చదువుకోవాలి.అప్పుడే ఈ గేయంలోని చమత్కారం అర్థమవుతుంది. ఒకరి అభివృద్ధికి ఆశ్చర్యపడేవాళ్ళే వారి నాశనాన్ని పట్టించుకోరన్నది ఈ మినీ గేయంలో శ్రీశ్రీ భావన.
బాపు బొమ్మకు ‘బ్నిం’ వివరణ..!!
1980లో ఓ ఉద్యమంలా వచ్చిన మినీ కవితకి స్వరూపం ఇచ్చిన కవిత ఇది. ఈ ఆరు లైన్ల కవిత మినీ కవిత రూప నిర్మాణానికి సలక్షణ ఉదాహరణ.మన చుట్టూ వున్న జనాల ప్రకృతిని చెప్పడానికి ఒక్క అక్షరం టైటిల్ తో నిబిడాశ్చర్యాన్ని వ్యక్తం చేశారు శ్రీశ్రీ. సాటి వారిని ఎదగనీయక పోవడం మానవ ప్రవృత్తి. ఇదో వ్యాధి.ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఈ జబ్బు భయంకరంగా ఉంది అంటారు . దీనికి తగ్గట్టే బాపుగారు వేసిన బొమ్మమహత్తరంగా వుంది.
ఎదుటివారిని,తోటివారిని,సాటి వారిని అవమానాలు పాలు చేయడం మనకి బాగా తెలుసు. ఎ(దు) గుతున్న
వ్యక్తి గుడ్డలు విప్పడం ఎంత అనైతికత..? ఆః.!! (బ్నిం)
ఎ.రజాహుస్సేన్, రచయిత