Mahaprasthana of Bapu dolls-7 బాపు బొమ్మల మహాప్రస్థానం-7

Mahaprasthana of Bapu dolls-7
బాపు బొమ్మల మహాప్రస్థానం-7

ఋక్కులు…!!

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా
హీనంగా చూడకు దేన్నీ !
కవితామయమేనోయ్ అన్నీ !

రొట్టెముక్కా,అరటి తొక్కా,బల్లచెక్కా…
నీ వైపే చూస్తూ వుంటాయ్ !
తమ లోతు కనుక్కోమంటాయ్ !

తలుపు గొళ్ళెం,హారతి పళ్ళెం,గుర్రపు కళ్ళెం
కాదేదీ కవిత కనర్హం !
ఔనేను శిల్పి మనర్ఘం
ఉండాలోయ్ కవితావేశం
కానీ వోయ్ రస నిర్దేశం
దొరకదటోయ్ శోభాలేశం

కళ్ళుంటే వుంటే చూసి,
వాక్కుంటే వ్రాసీ !
ప్రపంచ మొక పద్మ వ్యూహం
కవిత్వమొక తీరనిదాహం.!!

శ్రీ శ్రీ 14.4.1934.

కవిత్వం ఎలా వుండాలో చెప్పాడు శ్రీశ్రీ

కవితా ఓ కవితా.. గేయంలో కవిత్వం ఎలా వుండాలో చెప్పాడు శ్రీశ్రీ. ఋక్కుల్లో కవితా వస్తువు గురించిన మీమాంసకు ఫుల్ స్టాప్ పెట్టాడు. సృష్టిలో ఏదీ కవిత కనర్హం కాదన్నాడు. కవి ప్రతిభావంతుడైతే చాలు వస్తు వేదైనా లెక్కలోకి రాదన్నాడు.కవిలో సత్తా వుండాలే కానీ అది కుక్క పిల్లయినా,అగ్గిపుల్లయినా,సబ్బు బిళ్ళయినా ఫరకేం పడదు.అంతేనా? తలుపు గొళ్ళెం,హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం కాదేదీ కవిత కనర్హమని తేల్చి చెప్పాడు.కవిలో కవితా వేశాం,కవిత్వంలో శిల్పం,వుంటే చాలు రసనిర్దేశానికి అడ్డేముంటుందన్నాడు. ప్రపంచమొక పద్మ వ్యూహమైతే…కవిత్వం తీరని దాహమన్నాడు.శోభాలేశం దొరికినా ప్రపంచంలో రసనిర్దేశం చేసి కవితావేశంలో రాయమన్నాడు.ఈ నాలుగుపంక్తులూ సాహితీ పరుల నాలుకలు మీద నిలిచి పోయాయి.

కవిత్వం పట్ల శ్రీశ్రీ కి ఓ స్పష్టత

కవిత్వం పట్ల శ్రీశ్రీ కి ఓ స్పష్టత వుంది.చలంగారు చెప్పినట్లు..” ఈ వృద్ధ ప్రపంచానికి నెత్తురూ,కన్నీళ్ళూ తడిపి కొత్త Tonic తయారు చేశాడు శ్రీశ్రీ… హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటలు రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు.మాటల్నికత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చటైం అతనికే చేతనవును”(యోగ్యతా పత్రం)
బాపు బొమ్మ…!!

ఋక్కులు గేయానికి బొమ్మ వేయాలనుకున్నప్పుడు
ఈ గేయం ఆధునిక కవిత్వానికి సూక్తం, వేదంలా తోచింది
బాపు గారికి.అదే నోట్సులో రాసుకున్నాడు.దాన్నే మనసు
లో పెట్టుకొని ఆధునిక వేదం,సూక్తం చేస్తున్న’బ్రహ్మ’ లా శ్రీశ్రీ ని చిత్రించారు.!!

‘బ్నిం’ వివరణ..!!

శ్రీశ్రీ కవితను వెక్కిరిస్తూ…” ఏం రాశాడురా!ఈ మహాకవి!
‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా…’ ఇదో కవిత్వమా?

అప్పటివరకూ పద్యాలు పల్లకిలో ఊరేగుతూ.. హారతి పట్టించుకుంటున్న పెద్దలందరూ ఒక్క మారున ఫక్కున నవ్వారు. అందుకేగా కళ్ళుంటే చూసి, వాక్కుంటే వ్రాసి అన్నారు మహాకవి.

కుక్క పిల్లలో విశ్వాసం చూడొచ్చు.అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించవచ్చు.సబ్బు బిళ్ళతో కల్మషాన్ని కడుక్కోవచ్చు. ఉండాలోయ్ కవితా వేశం.! కానీవోయ్ రసనిర్దేశం! అంటూ కొత్త వేదాన్ని బోధించిన శ్రీశ్రీ ని బాపు బ్రహ్మ స్వరూపంగా ఊహించి,నవీన వేదాన్ని ఉపదేశిస్తున్న హంస వాహనుడుగా చిత్రీకరించడం నిజంగా రసనిర్దేశం.

హంస ఏది కావాలో అదే తీసుకుంటుంది.’పరబ్రహ్మ’
పలుకులు’ఋక్కులు’ అవుతాయి.(బ్నిం).!!

ఎ.రజాహుస్సేన్
హైదరాబాద్

Mahaprasthana of Bapu dolls-7 /zindhagi.com /abdul Rajahussen / yatakarla amllesh
Comments (0)
Add Comment