Mahaprasthana of Bapu dolls-6 బాపు బొమ్మల మహాప్రస్థానం

Mahaprasthana of Bapu dolls-6
బాపు బొమ్మల మహాప్రస్థానం-6

మానవుడా!

రాశి చక్రగతులలో రాత్రిందివాల పరిణామాలలో
బ్రహ్మాండ గోళాలు పరిభ్రమణాలలో
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో ప్రభావం పొందినవాడా
మానవుడా! మానవుడా!

సౌందర్యం ఆరాధించే వాడా!
కవితలో శిల్పంలో పురుగులో,  పుష్పం లో
మెరుపులో,  మేఘంలో

సౌందర్య ఆరాధించే వాడా!
జీవించే వాడా! సుఖించేవాడా!
దుఃఖించేవాడా! విహ్వలుడా!
వీలుగా! ప్రేమించే వాడా!
వియోగీ, యోగీ, భోగీ, త్యాగీ,!

ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించే వాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా,
ఆకాశంలో, సముద్రంలో అన్వేషించే వాడా!

అశాంతుడా! పరాజయం ఎరుగని వాడా!
ఊర్ధ్వదృష్టీ, మహామహుడా! మహాప్రయాణికుడా!
మానవుడా! మానవుడా!

కొట్లాడుకునేవాడా!
ఓర్వలేని వాడా!
సంకుచిత స్వభావుడా!
అయ్యో ! మానవుడా!

(Mahaprasthana of Bapu dolls-6)

ఓహో మానవుడా!
ధర్మస్థాపనకు యుద్ధం చేసేవాడా!
అన్యాయం భరించలేని వాడా!
ఆదర్శజీవీ! మహాత్మా ! మానవుడా!

ఆసియా, అమెరికా,యూరప్,
ఆఫ్రికా, ఆస్ట్రేలియాలలో
సముద్రం ద్వీపాలలో
ధ్రువ ప్రాంతాలలో పట్టణాలలో,
పల్లెల్లో, వనివో, దరిద్రుడివో,
వృద్ధుడివో,యువకుడవో
తెల్లని,నల్లని,ఎర్రని,పచ్చని రంగో,
బలవంతుడివో,బలహీనుడివో,
బ్రదికేవాడా! పాడేవాడా!
మానవుడా! మానవుడా!
అవిభక్త కుటుంబీ ఏకరక్త సింధూ
మానవుడా! మానవుడా!

అనేక భాషలు మాట్లాడే వాడా.!
అనేక స్థలాలలో తిరిగేవాడా!
అనేక కాంతులు వెదజల్లే వాడా!
సహృదయా! సదయా! సన్మార్గ గామీ!
సముద్రాలు దాటేవాడా!
ఎడారులు,పర్వతాలూ గడిచేవాడా!
ఆకాశాలను వెదికే వాడా!
నక్షత్రాలను శోధించేవాడా!
పిపాసీ,తపస్వీ.!

వంతెనలు నిర్మించిన వాడా!
వైద్యశాలలు, వస్తుప్రదర్శనశాలలు,
గ్రంథాగారాలు,పరిశ్రమాలయాలు,
ధూమశకటాలూ, నౌకలూ,విమానాలూ,
నిర్మించిన వాడా!
దూరదృష్టి,దూరశ్రవణశక్తులు
సాధించినవాడా!
మానవుడా! మానవుడా!

రసైకజీవీ!
కవీ ! నటుడా! శిల్పాచార్యా!
గానకళాకోవిదుడా! వేదాంతీ!
విజ్ఞానధనీ! భావధునీ !

దుఃఖమయా! దయాళూ! పరదుఃఖాసహనశీలి!
చీమను కూడా చంపడానికి
చేతులు రానివాడా! బుద్ధమూర్తీ! జీసస్!
సంఘపశూ! శ్రమైక జీవీ! శరీరం పరీవృతుడా!
ఘర్మవర్ష పయోదుడా! రక్తకణ సమష్టి కుటుంబీ
కష్టజీవీ! కార్మికుడా! మానవుడా!

కూలీ, మాలీ, రైతూ!
గుడిసెలలో బ్రతికేవాడా!
గంజినీళ్ళుతాగి కాలం గడిపేవాడా!
కడుపెడు సంతానం కలిగిన వాడా!
ఆకలికన్నూ మానవుడా!

తిరగబడేవాడా!
అన్యాయాలకు ఆహుతికావడానికైనా
జంకనివాడా!
ఖైదీ రౌడీ

ఖూనీకోర్
బేబీ
మానవుడా! మానవుడా! ” ..(శ్రీశ్రీ)

(Mahaprasthana of Bapu dolls-6)

“మానవుడే నా మతం, మానవుడే నా సందేశం”

అన్న మహాకవి మాటల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. శ్రీశ్రీ వ్యక్తి కాదు. ఓ సమష్టి శక్తి. ఆయనకు కులమతాల్లేవు. ఆయన కవితా సెగలు, పొగలకు హద్దులూ, సరిహద్దుల్లేవు.
విశ్వ మానవుడాయన..!!

“దూరం కరిగిపోతుంది కాలం మరిగిపోతోంది
మానవుడా మేలుకో నేస్తం ఏలుకో ఈ విశ్వం సమస్తం”

‘సరిహద్దుల్లేని సకల జగజ్జనులారా
మనుష్యుడే నా సంగీతం మానవుడే నా సందేశం..’ శ్రీశ్రీ !!

ఓ సామాన్యుడి గురించి ఇంతగా, కలవరించి, పలవరించి నా కవి తెలుగు సాహిత్యంలో బహు అరుదు. మానవుడే నా సందేశమనచన ఒక్క వాక్యం చాలు. ఆయన కవితా లక్ష్యమేమిటో నిర్ధారించడానికి మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు చేసిందంతా సామాజిక రుగ్మతను నిదానించడం మాత్రమే.
సామాజిక, ఆర్ధిక వ్యత్యాసాలకు సమాజం చీలిపోయి బడుగు జనం అట్టడుగుకు నెట్టివేయబడ్డారు. పొట్ట నింపుకోడానికి గుక్కెడు గంజి కూడా దొరకని జనం కోకొల్లలు. శ్రీశ్రీ వారికోసం కాలం పట్టాడు.కవిత్వం రాశాడు. ‘మహాప్రస్థానంలో అభ్యుదర కవిత్వం విప్లవ బీజాలు మాత్రమే వున్నాయి. విప్లవ సాహిత్యం లేదు.’ఇది నా మాట కాదు. శ్రీశ్రీ గారే స్వయంగా చెప్పుకున్నారు.( మహాప్రస్థానం ముందు మాట శ్రీశ్రీ)

కోపం వచ్చినా పర్వాలేదు

కోపం వచ్చినా పర్వాలేదు కానీ..కొందరు వామపక్ష రచయితలు, విమర్శకులు శ్రీశ్రీ ని విప్లవకారుడిగా ప్రజెంట్ చేస్తూ మహాప్రస్థానం ఓ విప్లవ గీతిక అంటూ లేనిపోని ముద్రలు వేశారు. అభ్యుదయానికీ విప్లవానికీ మధ్యవున్న సున్నితమైన గీతను అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఇది. అయితే అర్థం చేసుకున్నవారు కూడా కావాలని మహాప్రస్థాన గీతాలకు విప్లవం పూత పూశారు. శ్రీశ్రీ గారు చెప్పినట్లు. “విప్లవం సాహిత్యం అంటే.. ” సామాన్య ప్రజానీకాన్ని విప్లవాచరణ కుద్యుక్తుల్ని చేసే విధంగా సాగేది” (మహాప్రస్థానం ముందు మాట శ్రీ శ్రీ.)
చలం గారు చెప్పినట్లు.”రాత్రి చీకట్లో లోకం నిద్రలో భయం కర స్వప్నాలు కాంటో,దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగత మించితే వైతాళికుడు శ్రీశ్రీ..”(యోగ్యతా పత్రం నుంచి ) మనిషి.. ముఖ్యంగా బడుగు మనిషి, ఓ పేదోడి సమగ్ర ఆవిష్కరణ దృశ్యం ఈ కవిత. (Mahaprasthana of Bapu dolls-6)

పేదోడి ఆవిష్కరణ దృశ్యం ఈ కవిత
” మానవుడా! మానవుడా!” మహాప్రస్థానంరాసేవరకు శ్రీశ్రీ ‘Out and Out Bourgeois ఆయనలో చైతన్యం పెంచడానికి మార్క్స్ కారణం కాదు. అప్పటికి శ్రీశ్రీ మార్క్సిజమ్ గురించి చదువుకునే లేదు. అయితే కంటికి కనిపించే పుస్తకమల్లా చదివేవాడు. నాటకాలు చూసేవాడు. తారాబాయి, కోడి రామ్మూర్తి సర్కస్ లు చూసేవాడు. ఇవన్నీ శ్రీశ్రీ లో కళాత్మక చైతన్యాన్ని నింపాయి. వాటి ఫలితమే మహాప్రస్థానం. సామాన్యుడికి సందేశం.

బాపు బొమ్మ..!!.
ఈ కవితకు బొమ్మ వేసే ముందు బాపు గారు రాసుకున్ననోట్స్ మానవుడా ! (Common Man) ఇందులో
బుద్ధ, హిందూ, క్రీస్తు Muslim ) అని రాసుకున్నారు. రాసుకున్నట్లే శిలువపై సామాన్య మానవుడ్ని ప్రతిష్టించి
వివిధ మతాలకు సంకేతంగా నెలవంక, పదం పద్మ పీఠం, చిత్రీకరించారు.

బ్నిం వివరణ..!!

ఈ కవితకు బాపుగారు వేసిన బొమ్మ లో “త్రిమత ” సూచన చేశారు. ఇక్కడ శిలువ వేయబడ్డ వ్యక్తి, శిలువ నెక్కిన దేవుడూ మానవుడే. బొమ్మలో పదం పద్మ పీఠం హిందూ తత్వానికి ప్రతీక. రంజాన్ బాపు చిత్రం సృష్టి కవితకి భావార్ధాన్ని చూపించింది. ఇక్కడ నానా వృత్తుల ప్రవృత్తులు నలుపు తెలుపు లో మనస్తత్వ చిత్రాలూ. రంగు రంగుల నేపథ్యాలు చలో శ్రీశ్రీ అనేక ద్వంద్వ ప్రవృత్తులు పట్టి చూశారు. కట్టకట్టి చూపెట్టారు. ఇందులో మహాకవి మానవ జీవానికి MRI scan చేశారు. ఈ కవితలో జూమ్ వెళ్ళిన క్లోజ్ షాట్లు, బాగా ఎత్తుకెళ్ళిన క్రేన్ షాట్లూ కనిపిస్తాయి.”(బ్నిం)(Mahaprasthana of Bapu dolls-6)

ఎ.రజాహుస్సేన్.
హైదరాబాద్..!!

Mahaprasthana of Bapu dolls-6 / zindhagi.com / abdul Rajahussen
Comments (0)
Add Comment