Mahaprasthana of Bapu dolls-15 బాపు బొమ్మల మహాప్రస్థానం-15

Mahaprasthana of Bapu dolls-15
బాపు బొమ్మల మహాప్రస్థానం-15

‘అభ్యుదయం’

‘అభ్యుదయం’ అనే మాటను మనం మామూలుగా వాడే ‘అభ్యుదయ పరంపరాభివృద్ధిగా’ అనే అర్థంలో గాక కొత్తగా వాడారు శ్రీశ్రీ.నరజాతికి పరివర్తన నవజీవన శుభం సమయం. అదే ‘అభ్యుదయం ‘ అన్నది శ్రీశ్రీ భావన.

అభ్యుదయం…!!

ఏవో,
ఏవేవో,ఏవేవో,
ఘోషలు వినబడుతున్నాయ్!
గుండెలు విడిపోతున్నాయ్!

ఎవరో,
ఎవరెవరో,ఎవరెవరో,
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు ! భయో
ద్విగ్నంగా వర్తిస్తున్నారు!

అవిగో! అవిగవిగో ! అవిగవిగో !
ఇంకిన, తెగిపోయిన,మరణించిన,
క్రొన్నెత్తురు,! విపంచికలు! యువ యోధులు!

నేడే, ఈనాడే, ఈనాడే,
జగమంతా బలివితర్ది!
నరజాతికి పరివర్తన!
నవజీవన శుభసమయం !
అభ్యుదయం…”!!

శ్రీశ్రీ 2.4.1937.

మహాప్రస్థానం విప్లవ కావ్యమని, విప్లవాన్ని ప్రేరేపిస్తోందని కొందరు విమర్శకులు లేనిపోని విషయాలను
అంటగట్టారు. నిజానికి మహాప్రస్థానం విప్లవ ప్రధానమైన కావ్యం కాదు‌. ఇందులో విప్లవ బీజాలు మాత్రమే
వున్నాయి. విప్లవ సాహిత్యం లేదు. ఉన్నదల్లా “అభ్యుదయమే” ఆ మాటకొస్తే మహాప్రస్థానం రాసే నాటికి శ్రీ శ్రీ మార్క్స్ ను చదవలేదు. మార్క్సిజమ్ ను ఒంటబట్టించు కోలేదు. ఈ మాటలు నావి కావు. శ్రీశ్రీ గారే స్వయంగా చెప్పుకున్నారు. (నా మాట మహాప్రస్థానం ) ” కవిత్వంలో అయినా జీవితంలో అయినా ‘సామ్యవాదం’ నా గమ్యం” అంటారు శ్రీ శ్రీ.

బాపు బొమ్మ..!!

ఈ గీతానికి బాపు గారు రాసుకున్న నోట్..!

“అభ్యుదయం…

నేడే జగమంతా బలి వితర్ది నవజాతికి పరివర్తన కొడవలితో నరకబోతున్న Common Man.”!!

బాపు బొమ్మకు ‘బ్నిం’వివరణ…!!

యువ యోధులు. తెగిపోయిన విపంచికలు. కొన్నెత్తురులు కలవాళ్ళు. వాళ్ళు జగత్తుని బలిపీఠం చేస్తారు. ధనమూలం’ జగత్ అయితే ఆ ధన రక్కసిని రెక్కలు విరిచి కట్టి ‘ బలిపీఠం’ మీదకెక్కించడం అభ్యుదయం..’!!  మహాకవి వాచ్యానికి వడ్డీ వ్యాపారిని టోపీతో సూచ్యంగా చిత్రించడం బాపుగారి చిత్ర వైచిత్రి. ఇక్కడ కొడవలి మరో గొప్ప ఆయుధం.ఇదే నిజం. దీనికి బాపు గారు వేసిన రఫ్ బొమ్మ కూడా చూపించే అదృష్టం ఈ పుస్తకానిది. అన్నట్లు ఇది లండన్ కృష్ణ మూర్తి గారి గొప్ప ప్రచురణలో చోటు పొందింది.(బ్నిం)

( ఇంతటితో సమాప్తం )

ఎ.రజాహుస్సేన్, రచయిత
నంది వెలుగు..!!

Mahaprasthana of Bapu dolls-15 / zindhagi.com / abdul rajahussen / yatakarla mallesh
Comments (0)
Add Comment