Mahaprasthana of Bapu dolls-14
బాపు బొమ్మల మహాప్రస్థానం-14
నవకవిత….!!
కవిత్వమంటే ఏమిటో? ఎలా వుండాలో చాలామందిచెప్పారు. అలా కవిత్వానికి ఎన్నో నిర్వచనాలు పుట్టుకొచ్చాయి. కవిత్వం కాంతాసమ్మితంగా వుండాలన్నది మనపూర్వీకుల అభిప్రాయం.’కవిత్వం నిప్పుల కొలిమిలా వుండాలి’ ఇది విప్లవకవుల మనోగతం.”నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు.. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అంటాడు తిలక్. ఆయన మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎవరు ఏమార్గం ఎన్నుకున్నా వాళ్ళు రాసేది మాత్రం కవిత్వమై వుండాలి.
ఇక ఈ కవిత్వం ఎవరికోసం? అన్నపుడు సమాజం మొత్తానికి పనికొచ్చే కవిత్వం రాయడం కష్టమే కాబట్టి. కవులు తాము ఏ వర్గాన్ని ఎంచుకోవాలో తేల్చుకుంటారు. ఒకరు రసమయ కవిత్వానికి మొగ్గుచూపితే మరొకరు తాడిత,పీడిత కవుల పక్షం వహిస్తారు. ఎవరి పక్షం వహించినా ఏదిరాసినా అందులో కవిత్వాన్ని మాత్రం మిస్ కాకూడదు..!
కవిత్వం జుంటితేనె.పాఠకులకంటపడగానే ఆబగా జుర్రేసేట్లుండాలి. ఆతర్వాత అది ఒంట బట్టాలి. జీర్ణం కావాలి. కొత్త అనుభూతికి నాంది పలకాలి. అప్పుడే కవిత్వ జన్మకు సార్ధకత. పాఠకులకు మృష్టాన్న భోజనం. !
శ్రీశ్రీ తన మార్గాన్ని తనే వేసుకున్నాడు. వాడుక భాషలో రాయమన్న గురజాడ మాటను జవదాటకుండా ఉత్సాహంతో, ఉద్రేకంతో ఉద్యమించి మహాప్రస్థానం గీతాలను రాశాడు.”అందమైన అబద్ధాలలోకన్నా నిష్ఠురమైన నిజంలోనే మంచి కవిత్వం దర్శనీయమవుతుందని విశ్వసించాడు. అదే విశ్వాసంతో మహాప్రస్థానం గీతాలలో సామాజిక,వాస్తవికతకు దర్పణం పట్టాడు. సామాజిక రుగ్మతను నిదానించడానికి ఓ ప్రయత్నం చేశాడు. ” ఇదీ మన ప్రపంచం.! ఇలా వున్నారు. ఇచ్చటి ప్రజలు ” ! అన్నాడు. Mahaprasthana of Bapu dolls-14
“మహాప్రస్థానంలో అభ్యుదయ కవిత్వమూ,విప్లవ బీజాలు వున్నాయి. విప్లవ సాహిత్యం లేదు.” అంటారు శ్రీ శ్రీ..!! ఏది ఏమైనా తన కవితా మార్గమేమిటో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు.’ నవకవిత ‘ ఎలా వుండాలో ఇందులో చక్కగా చెప్పాడు. కవితా ఓ కవితా ఖండికలో కవిత్వం గురించి చెబితే,ఇందులో వర్తమాన ‘నవకవిత’ ఎలా వుండాలో అద్దంలో చూపెట్టాడు.
“సిందూరం, రక్తచందనం,
బందూకు,సంధ్యారాగం,
పులి చంపిన లేడి నెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నాయన జ్వాలిక,
కలకత్తా కాళికా నాలిక,
కావాలోయ్ నవ కవనానికి.
ఘాటెక్కిన గాంధీకి ధూమం,
పోటెత్తిన సప్త సముద్రాల్,
రగులు కొనే రాక్షసి బొగ్గూ,
బుగులుకొనే బుక్కా గుండా,
వికసించిన విద్యుత్తేజం,
చెలరేగిన జనసమ్మర్దం,
కావాలోయ్ నవ కవనానికి.
రాబందుల రెక్కల చప్పుడు,
పొగ గొట్టపు భూంకార ధ్వని,
అరణ్యమున హరీంద్ర గర్జన,
శిరోజాల ప్రచండ ఘోషం,
ఖడ్గమృగోదగ్ర విరావం,
ఝంఝానిల షడ్జధ్వానం,
కావాలోయ్ నవ కవనానికి.
కదిలేది, కదిలించేదీ,
మారేదీ, మార్పించేదీ,
పాడేదీ,పాడించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పెను నిద్దుర వదిలించేదీ,
పరిపూర్ణ బ్రదుకిచ్చేదీ,
కావాలోయ్ నవ కవనానికి..”!!
శ్రీ శ్రీ…3.8.1937.
“ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం చేస్తోంది?అని ధిక్ఖరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం అంటారు ” చెలం.( యోగ్యతా పత్రం)
శ్రీశ్రీ ఈ గేయంలో నవకవితా ధర్మాన్ని వివరించాడు. నవ కవితకు నిర్వచనంగా ఈ గేయాన్ని రచించాడు. ఆధునిక కవిత్వానికి ఆలంబనోద్దీపనాల పట్టికగా భావించేలా ఈగేయాన్ని తీర్చిదిద్దాడు. ఇందులో నవకవిత్వ లక్షణాలున్నాయి. అయితే వాటిని కాస్తంత వ్యంగ్యంగా చెప్పాడు. “సిందూరం, రక్తచందనం,బందూకు,సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురూ, ఎగరేసిన ఎర్రని జెండా,రుద్రాలిక నాయన జ్వాలిక,కలకత్తా కాళికా నాలిక,రాబందుల రెక్కల చప్పుడు, పొగ గొట్టపు భూంకార ధ్వని, అరణ్యమున హరీంద్ర గర్జన,శిరోజాల ప్రచండ ఘోషం,ఖడ్గ మృగోదగ్ర విరావం,ఝంఝానిల షడ్జధ్వానం, ఇప్పుడు నవ కవనానికి కావాలన్నాడు. ఈ పద ప్రయోగంలో కాఠిన్యాన్ని కాస్తంత దట్టంగానే దట్టించాడు. అయితే గేయం చివర్లో మాత్రం కదిలేది, కదిలించేదీ,మారేదీ, మార్పించేదీ, పాడేదీ, పాడించేదీ, మునుముందుకు సాగించేదీ,పెను నిద్దుర వదిలించేదీ, పరిపూర్ణ బ్రదుకిచ్చేదీ, కావాలోయ్ నవ కవనానికి..”అంటూ సుతిమెత్తని పదాలతో కవిత్వ మార్దవాన్ని గుర్తుచేశాడు. పాలకులకు వ్యతిరేకంగా Mahaprasthana of Bapu dolls-14
బాపు బొమ్మ…!!
బాపు గారు ఓ బొమ్మ వేసే ముందు దానికి సంబంధించి తన బుర్రలో వున్న ఆలోచనను రఫ్ గా కాగితంమీద పెడతారు. ఇది కేవలం బొమ్మలకు మాత్రమే కాదండోయ్! సినిమాలకు కూడా ఇదే పద్ధతినిఅనుసరిస్తారు.సినిమాలో ఓ సీన్ తీయబోయే ముందు, ఆ సీన్ ఎలా వుండాలో, నటీనటులు హావభావాలతో సహా డ్రాఫ్ట్ గీసుకుంటారు. ఓ సారి డ్రాఫ్ట్ తయారైందంటే..ఇక సీన్ మారే అవకాశమే వుండదు. డ్రాఫ్ట్ లో ఎలా వుందో అచ్చం అలానే అచ్చుగుద్దినట్లు సీన్ రావడం,పండటం జరిగిపోతాయి. ఈ ‘నవకవిత’కు బొమ్మ వేసే ముందు కూడా ఓ రఫ్ స్కెచ్ ను వేసుకున్నారు.” కాలం చీకటి తెరను ఎత్తు తున్నట్టు బాల భానుడు కింద Common man sleeping “అని దానికెదురుగా రాసుకున్నారు. అలాగే చక్కని బొమ్మ వేశారు..!!
బాపు బొమ్మకు’బ్నిం’వివరణ..!!
ఇక్కడ కాలం కర్తవ్యాన్ని స్మరించుకుంటుంది. ఇప్పుడేది అవసరమో గుర్తిస్తుంది.తనని తానే తట్టి లేపుకొని తనువంతా నెత్తురు రంగై మనసంతా రుధిరమై మరుగుతుంది. కలం గానం కూడా శృతి చేసుకొని పయోధర ప్రచండ మోతతో సుప్రభాత ఘోషతో చీకటి తెర లేపింది. సుప్తశక్తిని కదిపింది.పెను నిద్దుర వదిలించింది. బాపు గారు కవి భావనని ద్విగుణీకృతం చేసిన అద్భుతం వెలుతురుకి పశ్చిమంగా పడుకున్న వ్యక్తి వెన్నుకి వేడెక్కించడం అదే పెను నిద్దుర వదిలించేదీ…(బ్నిం) Mahaprasthana of Bapu dolls-14
ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్