యుద్దం
Lives are getting distracted
జీవితాలు చెదిరి పోతున్నాయి..
అక్కడ ..
ఆకాశంలో రాబందులు కసిగా వేట కోసం
ఎగురుతున్నాయి.
ఎన్నో సీతాకోక చిలుకల గూళ్ళు
చెదిరి పోతున్నాయి.
ఎంతో మంది తల్లుల స్తన్యాలు
రుధిరధారలు స్రవిస్తున్నాయి.
శాంతి కపోతాల రెక్కలు తెగి
నేలకూలుతున్నాయి.
భవిష్యత్తు సరే! వర్తమానమే కోల్పోయిన
పసికళ్ళు కన్నీటి సంద్రాలవుతున్నాయి.
కూలిన శిధిలాల మధ్యన మానవత్వం
మనుగడకై పిచ్చిగా వేడుకుంటోంది.
చెవులు పిక్కటిల్లేలా వినిపించే దంష్ట్రాకరాళుడి
వికటాట్టహాసాలు ఈ ఆక్రందనలేవీ వినిపించనివ్వట్లేదు.
అధికారంతో ఒకరూ అహంకారంతో ఒకరూ
ఉన్మాదంతో మేదిని దేహంపై మాయని గాయాలు చేస్తూ…
సంయమనం, సౌభ్రాతృత్వం లాంటి
వారికి అర్ధమే తెలియని కొత్త పాటలేవో
నమ్మకంగా పాడుతూ కుత్తుకలు ఉత్తరిస్తున్నారు.