Life of Journalist Sheikh Abdul Karim
జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ కరీం జీవితం
నిబద్ధత గల పాత్రికేయుడు ‘షేక్ అబ్దుల్ కరీం’…!!
స్థూలంగా పాత్రికేయులు రెండురకాలు..ఒకరు జర్నలిస్టు,మరొకరు ఎర్నలిస్టు.ఇందులో మొదటి కోవకు చెందిన
వాడు షేక్ అబ్దుల్ కరీం..!! ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా,ధర్మాజీ గూడెం లో 1955,డిసెంబర్ ఒకటో తేదీన ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.చింతలపూడిలో ఇంటర్మీడియట్,సత్తుపల్లిజె విఆర్ ప్రభుత్వం కళాశాలలో బికామ్ డిగ్రీ పూర్తిచేశాడు.
1982లో దినసరి వేతనంపై ఈనాడులో చేరాడు.ఈయన పనితనం నచ్చి ఆతర్వాత స్టాఫ్ రిపోర్టర్ గా తీసుకున్నారు. రిపోర్టర్ గా హైదరాబాద్లో సుదీర్ఘ కాలం పనిచేశాడు. ఆతర్వాత ఈ టివీకి మార్చారు.అక్కడ కూడా చాలా కాలం పనిచేశాడు. అయితే పూర్తికాలం అక్కడ వుండలేని పరిస్థితుల్లో బయటకు వచ్చాడు. రెండు మూడు టీవీలు మారాడు. కొంతకాలం తేజ వీక్లీలో పనిచేశాడు. ఆ తర్వాత ఎబిఎన్ లో చేరి చాలా కాలం పనిచేశాడు. అక్కడే రిటైర్ అయ్యాడు.ఆ తర్వాత కూడా కొంతకాలం అక్కడే కొనసాగాడు. Life of Journalist Sheikh Abdul Karim
ఈనాడుతో కెరీర్ మొదలైంది
పాత్రికేయుడు గా ఈనాడుతో కెరీర్ మొదలైంది. చాలా కాలం రిపోర్టింగ్ చేశాడు. కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ గా చాలా మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు వుండేవి. చెన్నారెడ్డి లాంటివారు కూడా నేరుగా ఫోన్ చేసి కరీం తో మాట్లాడేవారు.కొంతకాలం వరంగల్(టాబ్లాయిడ్) డెస్క్ ఇంచార్జీ.అప్పట్లో మొత్తం తెలంగాణకు, ఉత్తర తెలంగాణకో టాబ్లాయిడ్ ‘సెంటర్ స్ప్రెడ్’ రెండు పేజీలు కరీం దగ్గరుండి పెట్టిచ్చేవాడు.ఏదైనా రోజు పేజీలు కూర్పు సరిగా లేకపోతే రామోజీరావు గారు ఆ పేజీ ముఖమ్మీద “ఏం కరీం ఇవాళ డ్యూటీలో లేడా” ? అని కామెంట్ రాసేవారు.
అందరూ మెచ్చుకునేలా సమర్థంగా
రిపోర్టింగ్ అయినా డెస్క్ వర్క్ అయినా అందరూ మెచ్చుకునేలా సమర్థంగా చేసేవాడు. స్టేట్ బ్యూరోలో జనరల్, పొలిటికల్ రిపోర్టింగ్ సుదీర్ఘ కాలం చేశాడు. అసెంబ్లీ -కౌన్సిల్ ప్రొసీడింగ్స్, కాంగ్రెస్ వంటి పార్టీల అంతర్గత రాజకీయాలు,ఇరిగేషన్-పవర్ వంటి శాఖాపరమైన విశ్లేషణలు,కథనాలు అలవోకగా రాసేవాడు. భాష మీద పట్టు, మంచి పద సంపద, తార్కిక జ్ఞానం, వేగం ఆయన ప్రత్యేకతలు.
బతుకంతా జర్నలిజం వృత్తితో
పెద్ద వాళ్ళతో పరిచయాల మధ్య తిరిగినా అవినీతి మకిలీ అంటని,అహం బలపడని సాధు జీవి! పలు పత్రికలు, ఛానళ్ళు బతుకంతా జర్నలిజం వృత్తితో మమేకమయ్యాడు. సమకాలీన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై గట్టి పట్టు వుండేది.ఎక్కడ పనిచేసినా కలివిడిగా వుండేవాడు. అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం జర్నలిస్టులకు సహజంగా వుండే అలవాట్లు ఈయనకు కూడా వున్నాయి. సిగరెట్లు బాగా తాగుతాడు. అలాగే మద్యం అలవాటు సరేసరి. మంచి భోజనం ప్రియుడు.బాగా వంట చేస్తాడు. రకరకాల బిరియానీలు,నాన్ వెజ్ డిష్ లు చేయడంలో దిట్ట.
జంగారెడ్డి గూడెం నుంచి హైదరాబాద్
జంగారెడ్డి గూడెం నుంచి బయలుదేరి హైదరాబాద్ వరకు కరీం జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు. ఆర్థిక ఇబ్బందులు చేబదుళ్ళు లేని నెల వుండేది కాదు. కొన్నేళ్ళు గా భార్యా వియోగంతో బాధపడుతున్నాడు. కొంతకాలంక్రితం ❤గుండె కు స్టంట్ లు కూడా వేశారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. బంగారు తల్లులు తండ్రిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మనవలు, మనవరాండ్రతో కాస్తంత ఆనందంగానే వున్నాడనుకుంటున్న సమయంలో గుండె మొరాయించింది. బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో హార్ట్ ఎటాక్ తో కాలం చేశాడు. పాత్రికేయుడిగా జీవితం చరమాంకం వరకు పనిచేస్తూనే వుండాలన్నది ఆయన కోరిక. యాదృఛ్ఛికమే అయినా అదే జరిగింది. ఓ మధ్యతరగతి మందహాసం ఎలావుంటుందో, జీవితంలో స్ట్రగుల్ అంటే ఏమిటో కరీంను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
జర్నలిజం లో విలువలు కరువైన ఈ రోజుల్లో అటువంటి నిబద్ధత,సమర్థత కలిగిన పాత్రికేయుడు దూరమవడం
నిజంగా నష్టమే.!!