Let’s stop acting (poetry) నటించడం మానేద్దాం (కవిత్వం)

Let’s stop acting
నటించడం మానేద్దాం

రాత్రికి, రాత్రి నిద్రపట్టడం లేదు
వావి వరుసల్ని తగలబెడుతూ
మానవత్వాన్ని మట్టిలో కలుపుతూ
పశుత్వాన్ని పెంచుకుంటూ
మానవ మృగాలు నేడు
చిగురు తొడిగే బాల్యాన్ని సైతం చిదిమేస్తుంటే

శబ్ధం కూడా నిశ్శబ్ధానికి పోటీపడింది
గాయపడుతున్న నా దేశం చేసే రోధన
గాలి కూడా వినకూడదని

విషాన్ని చిమ్ముతూ కాటేసే కాలనాగులు సైతం
బుసలు కొట్టడం మానేశాయి
మసి పూసుకున్న మనిషి మృగత్వంలోకి
పరకాయ ప్రవేశం చేస్తుంటే

ఎవరికైతే నాకేమని
ఏదైతే నాకెందుకని
పగలు జరిగిన ఘాతుకాల్ని
రాత్రికల్లా మరిచిపోతున్నాము
చిక్కని బురఖా సందుల్లోంచి చూస్తూ
కుచించుకుపోతున్న మానవత్వాన్ని కప్పుకుని

రమిస్తున్న కాముడు రాజ్యమేలుతున్నాడు
చట్టాలెన్ని చేసినా సమస్యల ఫలితం మాత్రం
నిర్జీవమై నిలిచే వుంటుంది
చలిచీమల పద్యం చదివిన వాల్లం
ఇకనైనా నటించడం మానేద్దాం
ప్రతిఘటించడానికి ప్రతినబూనుదాం
మార్పును కోరుతూ అడుగులో అడుగేస్తూ..


మచ్చరాజమౌళి

దుబ్బాక, 9059637442

Let's stop acting / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment