Kuntala Falls Bitter Memories-02
జర్నలిస్ట్ అనుభవం..
కుంటల జలపాతం చేదు జ్ఞాపకాలు -02
ఎంతకూ వేగం అందుకోలేకపోవడానికి కారణం అవుతున్న రోడ్డుపై అసంతృప్తి తో పాలకుల వైఫల్యాన్ని ఎండగడుతు, అత్యవసర సమయాల్లో ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సంభాషణ ఓవైపు కొనసాగుతున్నా మరో వైపు సమాచార నిర్ధారణ కొరకు మా ఫోన్లు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.. ఇంతలో నేరెడిగోండ ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేశారు.. ఇద్దరు యువ టూరిస్ట్ లు జలాపాతంలో గల్లంతయ్యారని నిర్ధారణ తో కూడిన ప్రాథమిక సమాచారం ఇచ్చారు ఎస్ఐ…మిగత వివరాలకు సమయం పడుతుందని ఫోన్ పెట్టేశారు… అంతే వెంటనే స్టాఫ్ రిపోర్టర్లకు సమాచారమిచ్చి, ఆఫిస్ లకు బ్రేకింగ్ సమాచారాన్ని పంపించేశాము… అలా సమాచారం ఇచ్చామో లేదో ఇలా స్టాఫ్ రిపోర్టర్ల నుండి కాల్స్ ప్రారంభమయ్యాయి.. వెంటనే వీడియోలు, పూర్తి సమాచారం సంపాదించాలని, అప్డేట్స్ కొరకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వారినుండి ఫోన్లు.. కుంటాల జలపాతంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న మరణమృదంగం విషయాన్ని యావత్ ఎలక్ట్రానిక్ మీడియా సీరియస్ గా తీసుకుంది.. దాంతో పాటు రాష్ట్రం లోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుంటాల జలపాతంలో ఒకే సారి ఇద్దరు పర్యాటకులు గల్లంతవడమనేది మేజర్ ఇష్యూ గా పరిగణించింది…. దాంతో పాటు EXCLUSIVE గా మొట్టమొదట వార్త మన ఛానెల్ లో రావాలనే ఓ పోటి వాతావరణం కూడ దానికితోడైంది…
ప్రాథమిక సమాచారం అందిన తరువాత ఇక పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే సాధ్యమైనంత తొందరగా జలపాతం వద్దకు చేరుకోవడమే మా ముందున్న ఒకే ఒక దారి… అప్పటికి సమయం మధ్యాహ్నం 3 అవుతుంది బజార్హత్నూర్ మండల కేంద్రానికి చేరుకున్నాము… మధ్యహ్నం రెండు గంటల వరకు ఆకలితో అలమటించిన మా కడుపులు ఆ సంఘటన తో ఆకలిని మరిచాయి… ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కుంటాల జలపాతం వైపు వేగంతో కదిలాయి మా ద్విచక్ర వాహనాలు…. అలా రెండు గంటల తరువాత సాయంత్రం 5 గం”లకు జలాపాతం వద్దకు చేరుకున్నాము.. పర్యాటక సీజన్ లో ఆదివారం కావడంతో భారి సంఖ్యలో ఉన్నారు పర్యాటకులు ఎంతలా అంటే వాహనాల పార్కింగ్ కు స్థలం దొరకనంతగా…
జలపాతం దిగువనకు చేరుకున్నా మాకు విషాదం జరిగిన వాతావరణం అస్సలు కనిపించట్లేదు… అక్కడున్న పర్యాటకులు జలపాతపు సోయగాలను ఆస్వాదిస్తూ వినోదంతో కేరింతలు కొడుతు ఎంజాయ్ చేస్తున్నారు.. అసలు అక్కడ ఏం జరిగిందో కూడ వారికి తెలియనట్లు తాము వచ్చిన పని తాము చేసుకుంటున్నట్లు కనిపించారు అందరు… ఎంతలా అంటే అసలు ఇక్కడ ప్రమాదం జరిగిందా అనే డౌట్ వచ్చేంతలా.. విచిత్రం అనిపించింది…
ప్రమాదం జరిగిన స్థలాన్ని వెతుకుతున్న మాకు ఎడమ వైపు నుండి మొదటి ప్రవాహం లో పైన ఉన్న మొదటి గుండం వద్ద పోలిసులు కనిపించారు.. ఆ గుండం వద్దకు పర్యాటకులకు అనుమతి లేదు.. సాధరణంగా కనిపిస్తూనే అమాంతం మింగేసే రాక్షస గుండం అది.. ఆ గుండం వద్దకు పర్యాటకులు వెల్లవద్దనే కఠిన ఆంక్షలు ఉన్న ప్రమాద సమయంలో పర్యవేక్షణ చేసే భద్రత సిబ్బంది లేకపోవడం వలన ప్రమాదం జరిగిందని అర్థమైంది… ఇక ఆ గుండం వద్దకు చేరుకున్నాము..కొందరు గజ ఈతగాల్లు గాలింపు చేపడుతున్నారు..మాకు కావాల్సిన వీడియోలు తీసుకుని, పోలిసుల వద్ద సమాచారాన్ని తీసుకుని వార్తను కంపోజ్ చేయడానికి నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వెల్లడానికి బయల్దేరాము…అంతలో ఆ ఇద్దరు యువకులతో వచ్చిన స్నేహితుల బృందం గుండం వద్ద కనిపించింది.. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుందామని వారి వద్దకు వెల్లాము…
(తరువాయి భాగం రేపు…)
సాయి కిరణ్ జాదవ్, జర్నలిస్ట్