Keshava Pillai is a guide for journalists జర్నలిస్టులకు మార్గదర్శి కేశవ పిళ్ళై అక్టోబర్ 8న జయంతి
దీవాన్ బహదూర్ పట్టు కేశవ పిళ్ళై (అక్టోబరు 8, 1860 – మార్చి 28, 1933) భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు. పట్టు కేశవపిళ్లే తమిళనాడు లోని ఉత్తర ఆర్కాటు జిల్లాలో వేంకటా చలం, సుబ్బమ్మ దంపతులకు 1860, అక్టోబరు 8వ తేదీన జన్మించాడు. మద్రాసులో ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఆయన హిందూ పత్రికలో విలేఖరిగా తన వృత్తిని ఆరంభించాడు. అనంతపురం జిల్లా, గుత్తిలో కరెస్పాండెంటుగా ఆయన 1883లో తన 22వ యేట నియమించ బడ్డాడు. గుత్తిలో స్థిరపడటం వలన పట్టు కేశవ పిళ్లెను ప్రజలు “గుత్తి కేశవపిళ్లె”గా పిలువ సాగారు.
1893, అక్టోబర్ 4వ తేదీన బ్రిటిష్ సైనికుల అత్యాచారం నుండి యిద్దరు హిందూ మహిళలను రక్షించే క్రమంలో, గుత్తిలోని రైలుగేటు కీపర్ గూళిపాలెం హంపన్న ప్రాణాలొడ్డాడు. ఈ సంఘటనలో బ్రిటిష్ సైనికులు హంపన్నను కాల్చి చంపారు. ఆ సంఘటన గురించి గుత్తి కేశవపిళ్లే హిందూ పత్రికకు వార్త పంపగా అది ప్రముఖంగా ప్రచురింప బడింది. ఆ వృత్తాంత మంతా హిందూ పత్రికలో రావడంతో ఇంగ్లీషు వారు ఆంగ్లేయులకు ఏర్పరిచిన ప్రత్యేకమైన ప్రతిపత్తులతో కూడిన కోర్టులో విచారణ జరిపించారు. అప్పట్లో కేశవపిళ్లే గుత్తిలో సెకెండ్ గ్రేడ్ ప్లీడర్‌గా ప్రాక్టీసు చేసేవాడు. ఈ సంఘటన గురించి బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా వాదించాడు. అక్కడ ఉన్న జ్యూరీ వారిలో అధికభాగం ఆంగ్లేయులు, మిగిలిన కొందరు వారిపై జీవనము ఆధారపడిన దుబాసీలు. కోర్టులో ఆ స్త్రీలు వ్యభిచారులని, హంపన్న వ్యభిచరింప జేసే వ్యాపారియని వ్యభిచారం విషయంలో డబ్బు ఎక్కువ తక్కువల్లో తమను కొట్టవచ్చాడని, ఆత్మరక్షణార్థం తాము కాల్చామని వాదించారు.
వాదనలు నడుస్తూండగానే ఈ కేసుకు వ్యతిరేకంగా హిందూ పత్రికలో చాలా వార్తలు, అభిప్రాయాలు వచ్చాయి. చివరకు ఈ కేసులో వ్యభిచార వ్యవహారంలో తేడా రావడంతోనే ఈ ఘటన జరిగిందని, హంపన్న అమాయకుడేమీ కాదన్న వ్యాఖ్యలు చేస్తూ ఈ నేపథ్యంలో ఆంగ్ల సైనికుల దోషం ఏమీ లేదని తేల్చి, నిర్దోషులుగా విడిచి పెట్టాయి. ఇది జాత్యహంకారానికి ఉదాహరణ అంటూ హిందూ దినపత్రిక తీవ్రంగా ఖండించింది. స్థానికులు వీరుడైన హంపన్నపై ఇటువంటి ఘోరారోపణ చేయడాన్ని సహించలేక ఓ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి హిందూ పత్రిక సహకరించి, తమ పత్రిక ద్వారా విరాళాల కోసం ప్రయత్నాలు సాగించింది. గ్రామస్థులు, హిందూ పత్రికవారూ విరాళాలిచ్చిన దాతల సహకారంతో హంపన్న స్మారక చిహ్నాన్ని నిర్మించారు. స్మారక సంఘం వారు స్మారక చిహ్నం నిర్మాణానికి తొమ్మిది చదరపు టడుగుల స్థలాన్ని కొనుగోలు చేసి, దానిపై ఏడడుగుల ఎత్తుగల రాతిస్తంభం నిలబెట్టి, దానికి ఓ స్మారక ఫలకాన్ని వ్రాయించి పెట్టారు. చుట్టూ ఆవరణ గోడ కూడా కట్టించారు. ఆ శిలాఫలకంపై ఆంగ్లంలో ఈ క్రింది విధంగా చెక్కారు. “Here lie the remains of Goolapalien Hampanna, the Gate keeper, who while defending two Hindu women against a party of European soldiers near the Gunta
హంపన్న వృత్తాంతంతో ఆయనను స్థానిక ప్రభుత్వం గుర్తించి అనంతపురం, కర్నూలు, బళ్ళారి జిల్లాలకు జిల్లా బోర్డు సభ్యుడిని చేసింది. 1916-17లో ఇతడు కాంగ్రెస్ సభ్యునిగా చురుగ్గా పని చేశాడు. మద్రాసు శాసన మండలి సభ్యునిగా ఎన్నుకో బడ్డాడు. ఆయన గుత్తి తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశాడు. మద్రాసు ఫారెస్ట్ సభ్యుడిగా సేవలను అందించాడు. శ్రీలంకలోని భారతీయ వర్తకుల కోరిక మేరకు అక్కడికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి ఒక నివేదికను సమర్పించాడు. 1885లో బొంబాయిలో జరిగిన స్వాతంత్ర్యోద్యమ ప్రథమ మహాసభకు అయన హాజరయ్యాడు.
కేశవ పిళ్ళై గుత్తి నగర పాలికకు ఎన్నికై, నగర పాలిక సభ్యుడుగా పనిచేశాడు. చివరకు ఆయన నగర పాలికలకు ప్రాతినిధ్యం వహించడానికి మద్రాసు శాసన మండలికి ఎన్నికయ్యాడు. కేశవ పిళ్ళై తన తొలినాటి నుండి రాజకీయాల్లో ఆసక్తి చూపాడు. 1885, డిసెంబరు 28న బొంబాయిలో జరిగిన తొలి భారత జాతీయ కాంగ్రేసు సమావేశంలో, గుత్తి పట్టణ ప్రతినిధిగా పాల్గొన్నాడు. ఆ తర్వాత మరింత తీవ్రవాద పద్ధతులను అవలంబించి కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. ఆయన జస్టిస్ పార్టీని, ద్రవిడ ఉద్యమాన్ని గట్టిగా వ్యతిరేకించాడు.
కేశవ పిళ్ళై మద్రాసు శాసన మండలిలో చాలాకాలం పాటు పనిచేశాడు. సభలో అనేక సంస్కరణా ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుంది. పానగల్ రాజా ప్రభుత్వం ఆమోదించిన జైలు మార్గదర్శకాలు, జైలు కమిషన్ యొక్క ప్రధాన రచయిత పిళ్ళై. మద్రాసు అటవీ కమిషన్ సృష్టికర్త కూడా ఆయనే. ఆ తర్వాత కేశవ పిళ్ళై శాసనమండలి ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికై, ఆ హోదాలో కొంతకాలం పని చేశాడు.
ఆయన సేవా దృక్పథాన్ని గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదుతో సత్కరించింది.
రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత సెల్: 9440595494