శ్రీకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి
రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్.
విషయం : వరదలవల్ల నష్టపోయిన రైతుల గణాంకాలు సేకరించి పరిహారం చెల్లించుట -బీమా పరిహారం చెల్లించుట గురించి..
ఆర్యా!
రాష్ట్రంలో సెప్టెంబర్ 25 నుండి 29 వరకు గులాబ్ తూఫాన్ వల్ల పడిన అధిక వర్షాల వల్ల 2.20 లక్షల ఎకారాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్, సిరిసిల్లా, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, ములుగు, వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. మిగిలిన జిల్లాల్లో కూడా కొద్ది-గొప్ప నష్టం వాటిల్లింది. వరి, పత్తి, సోయా, పసుపు, పొగాకు, మక్కజొన్న, కూరగాయల పంటలకు బాగా నష్టం జరిగింది. నేటికి పంట చేనులో వరద నీరు పారుతూనే ఉంది.
ఆగస్టు 30నుండి సెప్టెంబర్ 4వరకు కురిసిన వర్షాల వల్ల 8లక్షల ఎకరాలల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఒకే సంవత్సరం ఈ వానాకాలంలో 3సార్లు పంట నష్టాలు వాటిల్లాయి. మొదట జూన్ మొదటి వారంలో విత్తనాలు వేయగా అతి వర్షాల వల్ల విత్తనాలు మొలకేత్తలేదు. రెండవ సారి, మూడవ సారి పప్పుధాన్యాలు, పత్తి విత్తనాలు పెట్టారు. రెండవ సారి ఆగస్టులో కురిసిన వర్షాల వల్ల నష్టపోయారు. ప్రస్తుతం మూడవ సారి కురిసిన తూఫాన్ వల్ల మరింత నష్టపోయారు. ఒకే ఏడాడి మూడు సార్లు వరద నష్టాలు రైతులు భరిస్తున్నారు.
2020-2021లో అతివృష్టి వల్ల 12.65లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కానీ హైకోర్టులో పంటలు దెబ్బతినలేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయడం విచారకరం. కేంద్రానికి లేఖలు వ్రాసిన తరువాత రాష్ట్రంలో విచారించగ నష్టం జరగలేదంటు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో ప్రభుత్వం తరుపున ఫిటిషన్ వేశారు.
గత సంవత్సరం ఈ సంవత్సరం లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముగ్గురు రైతులు చనిపోయారు. గత సంవత్సరం మొత్తం 51 మంది చనిపోయారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కనీసం గణాంకాలు సేకరించడానికి ప్రయత్నించలేదు. కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న 14వ, 15వ ఫైనాన్స్ కమీషన్ ప్రకృతివైపరిత్యాల నిధులను కూడా వ్యయం చేయకపోవడం జరుగుతున్నది. రైతులను ఆదుకోవడానికి వెంటనే హైకోర్టు తీర్పు ప్రకారం గణాంకాలు సేకరించి, కౌలు రైతులతో సహా నష్టపోయిన రైతులకు పరిహారం చేల్లించాలని కోరుతున్నాము.
రాష్ట్ర ప్రభుత్వం తమ నిధుల నుండి మొదట చెల్లించి తరువాత కేంద్రం నుండి రాబట్టుకోవాలి. కేంద్రానికి జరిగిన నష్టం వివరించి నిధులు కోరాలని, కేంద్ర బృందాలు వచ్చి నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నాము.
ధన్యవాదములతో…
– తీగల సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి