Johars to Maoist top leader RK మావోయిస్ట్ నేత R.K. కు జోహార్లు

సోషల్ మీడియాలో..

Johars to Maoist top leader (Ramakrishna) RK

మావోయిస్ట్ అగ్రనేత (రామక్రిష్ణ) ఆర్.కె.కు జోహార్లు

 

కామ్రేడ్ ఆర్కె కు విప్లవ జోహార్లు… సోషల్ మీడియాలో రెండు రోజులుగా వరుసగా పోస్ట్ లు.. నక్సలైట్ ఉద్యమంలో పని చేసి అలిసి పోయినోళ్లు.. సిద్దంతాలను విమర్శించినోళ్లు.. నక్సల్స్ హింసత్మాక సంఘటనలకు పాల్పడుతున్నారన్నోళ్లు.. సిపిఐ.. సిపిఎం.. న్యూడెమోక్రసీ… జనశక్తి.. విద్యావంతులు.. అభ్యుదయ భావాలున్నోళ్లు అందరూ ‘‘అమర్ హై రామక్రిష్ణ..’’  అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఒక్కో పోస్ట్ లో ఒక్కో అభిప్రాయం.. కవిత్వంతో నివాళులు అర్పించిన కలం యోధులున్నారు..  ఓరల్ గా పోస్ట్ ల సారాంశం విప్లవ వీరుడు ఆర్.కె. మరణం భారత విప్లవోద్యమానికి తీవ్ర నష్టమేనని.. ఆర్.కె. మరణంపై వ్యంగ్యంగా పోస్ట్ లు పెట్టిన కుల గజ్జిగాళ్లు కూడా ఉన్నారు.  జనం కోసం నాలుగు రోజులు ఇల్లు వదలని వారు నలుపై ఏళ్లు విప్లవోద్యమంలో పని చేస్తూ ప్రాణాలర్పించిన యోధుడి మరణంలో కులం వాసన చూస్తున్న కుక్కలున్నాయని విమర్శల పోస్ట్ లు.

అక్కిరాజు హరగోపాల్ అలియాస్  రామక్రిష్ణ అలియాస్ ఆర్ కె. పేర్లు ఏవైనా.. అతను విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమం వైపు అడుగులు వేశాడు.. నాలుగు దశాబ్దాల క్రితం వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ చదువుకు స్వస్తీ పలికి నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తుపాకి పట్టాడు. అట్టడుగు వర్గీయులను చైతన్యవంతులను చేస్తునే ఉద్యమ (అడవి) బాట పట్టాడు. శతృవుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు.. ఉద్యమానికి ఊపీరిగా పోరాటాలు చేసిన అక్కిరాజు హరగోపాల్  బూర్జువ ప్రభుత్వ తుపాకి తూటాల నుంచి తప్పించుకుని ఆనారోగ్యానికి దొరికి పోయాడు.  గిరిజన, ఆదివాసుల జీవితాలలో మిళితమై ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆర్.కె. ఆనారోగ్యంతో మరణించడం అభ్యుదయ వాదులకు బాదే..

మొదట ఆర్.కె. మరణం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. అదంతా శతృవు వ్యూహం అనుకున్నారు. నక్సలైట్ అగ్ర నేతల ఉనికి తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ప్రభుత్వం పన్నె ఎత్తుగడలాంటిదే అనుకున్నారు మావోయిస్టు ఉద్యమాన్ని బలపరిచే వాళ్లు.. కానీ.. నిజంగానే శుక్రవారం ఆర్కే అంత్యక్రియల ఫొటోలను విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని  పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు శుక్రవారం (15 అక్టోబర్ 2021 నాడు) మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొంది. ఆ అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు ఆర్ కె. మృత దేహంపై ఎర్ర జెండాను కప్పి నివాళులు అర్పించినట్లు ఫోటోలు విడుదల చేశారు. ఆర్.కె. కుమారుడు మున్నా కూడా తండ్రి బాటలోనే ఉద్యమంలోకి వెళ్లి ఎన్ కౌంటర్ లో మరణించాడు. అతని భార్య కూడా ఉద్యమంలో పని చేస్తూ అరెస్ట్ అయ్యింది.

సీన్ కట్ చేస్తే..

సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని పోస్ట్ లు ఇవే.. కామ్రేడ్ ఆర్కె కు విప్లవ జోహార్లు. చాదస్తపు బ్రాహ్మణ కులంలో పుట్టి పీడిత ప్రజల కోసం తన చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాల్ని గడ్డిపరకలా గా వదిలేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కులగజ్జి వెధవలు అగ్రవర్ణాలలో అమరులు ఉన్నారా??  విప్లవోద్యమంలో కూడా వాళ్లది ఆధిపత్యం అని బట్టలు చించుకునే బ్రోకర్ గాళ్ళకు ఇలాంటి అమరుల పేర్లు రూపాలు గుర్తుకు వస్తేనే కులగజ్జి వెధవలకు వణుకు పుడుతుంది.

కామ్రేడ్ RK.. మరణాలెప్పుడూ లోటునే మిగులుస్తాయి. మీ మరణం విప్లవానికి అంతులేని లోటుని మిగిల్చింది. నాలుగు దశాబ్దాలుగా అడవికి రక్షకుడిగా ఆదివాసీలకు అండగా సభ్య సమాజానికి అన్నగా మీరు చేసిన త్యాగాలు మీ వీరత్వం మీ మరణం తర్వాత కూడా మిమ్మల్ని అజేయున్ని చేస్తాయి.అడవిలోని కొండల్ని తొలిచి గనుల్ని దోచుకుపోవాలనుకున్న కార్పొరేట్ గుంటనక్కలను ఉరికించి తరిమిన మీ తెగువ విప్లవ స్పూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. కామ్రేడ్ RK బాంబులు బంధూకుల మధ్య మీ వీరత్వపు ధగధగల రుద్ర తాండవం శత్రువులను భీతావాహుల్ని చేసిన కధల్ని  విప్లవలోకం మనసారా పాడుకుంటుంది.తుపాకీ గుళ్ళ మధ్య మెరిసిన మీ ధీరత్వపు జ్వాలల చూపులే నవ భవితకు మార్గం చూపుతుంది. తుపాకీ గొట్టంతో వచ్చే రాజ్యం కోసం అలుపెరగక శ్రమించిన శ్రామికుడా ఇక మీరు విశ్రాంతి తీసుకోండి.  నలుపై యేళ్ళుగా అడవిలో ఉద్యమం కోసం తిరుగాడిన మిమ్మల్ని ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపలేకపోయింది. ఈ దోపిడీ రాజ్యంలో జీతం కోసం పనిచేసే అమాయక పోలీసుల కోంబింగ్ లు ఎన్కౌంటర్ లు వ్యూహాలు మిమ్మల్ని భయపెట్టలేకపోయాయి. మీ సహజ మరణం శత్రువుల ఘోర పరాజయం అని విప్లవ లోకం చరిత్రై ఘర్జిస్తుంది. ఇది మీకు మాత్రమే సాధ్యమైన ఘణ విజయంగా చరిత్ర లిఖిస్తుంది. విజయం అనేది గమ్యం అనుకునే మూర్ఖులకీ మీ మరణం మీ జీవితం మీ పోరాటంలో దాగిన గెలుపులూ, దివిటీలా అమరుల ఎర్రటి స్థూపపు పతాకమై అడవి గాలుల ఊయలలో రోషమై ఎగురుతుంది. అమరుడా అరుణోదయ కాంతితో సమాజాన్ని మేల్కొలుపుతూనే వర్థిల్లు…

RK అనే ఒక మావోయిస్ట్ అనారోగ్యంతో చనిపోతే, అతను ఎన్కౌంటర్ లో  ఎందుకు చావలేదు, ఆగ్రకులాల మావోయిస్టులు లు సహజమరణమే పొందుతారు, క్రిందికులస్తులే ఎన్కౌంటర్ లో చనిపోతారు అనే మీ ఆలోచననిమించిన దిగజారుడుతనం, కులకంపు మరెక్కడవుండదు. నిజానికి మీలాంటి కుల బానిసలు, కులకంపు మానసిక రోగులు ఉద్యమంలోఉంటే, పోలీస్ ఎంకౌంటర్స్ కంటే కూడ, మీలాంటి వారే అంతర్యుద్ధంలో కులాల వారిగా విడదీస్తూ చంపుతారెమో అనేవిషయంలో నాకు సందేహం లేదు.

*****

జీవితాన్ని విప్లవ కార్యాచరణ చేసిన అక్కి రాజు హరగోపాల్ కామ్రేడుకి జోహార్లు అర్పిస్తూ, పునర్ వివేచనకే అస్కారం ఇవ్వని ఆ అడవి మార్గాన దిటవుగా బహుశా, అనివార్యంగా నడిచిన, నడవాల్సి వచ్చిన నిజాయితీ నేతకి వినమ్ర నివాళి…  ఇలా ఎన్నో పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

ZINDHAGI.COM/Johars to Maoist top leader (Ramakrishna) RK / NAXALIGHT RAMAKRISHNA R.K/ మావోయిస్ట్ అగ్రనేత (రామక్రిష్ణ) ఆర్.కె.కు జోహార్లు/ CPI (ML) MAOIST
Comments (0)
Add Comment