JCS Prasad Varthanthi
JCS ప్రసాద్ వర్థంతి
ఎమర్జేన్సీ రోజులు. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తే ప్రాణాలు తీసింది ప్రభుత్వం. దోపీడి లేని వ్యవస్థ కోసం పోరాటం చేసే వారిని ఎమర్జేన్సీ కాలంలో కాల్చి చంపింది ప్రభుత్వం. సిపిఐ (ఎం.ఎల్.) మావో ఆలోచన విధానంతో పీడిత ప్రజల కోసం పని చేసే పిడిఎస్ యు నిర్మాత కామ్రేడ్ జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ ను అరెస్ట్ చేసి 1975 నవంబర్ 5వ తేదిన కాల్చి చంపిన రోజును గుర్తు చేసుకుంటూ కన్నెగంటి రవి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. విజయవాడలో నీలం రాంచంద్రయ్య గారితో పాటు జంపాల చంద్రశేఖర్ ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లా ఇల్లెందు అడవులలో కాల్చి చంపారు. అతని మాటల్లోనే..
జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ స్వగ్రామం
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ. అతని ఊరికి రెండు కిలో మీటర్ల దూరంలో మా ఊరు. పేదల కోసం పని చేసే ప్రసాద్ ను కాల్చి చంపినప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు. ఎమర్జెన్సీ ఎత్తేశాక 1978 నవంబర్ 5న ఎత్తొండలో మొదటి సంస్మరణ సభ జరిగింది. ఆ సభ కరపత్రం మా నాన్న రాశారు. మేము మా ఊరి నుండీ 100 మందిమి నడిచి సభకు వెళ్ళాం.
జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్
జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ అమరుడై 46 ఏళ్లు గడిచింది. ఆ కామ్రేడ్ ప్రసాద్ స్ఫూర్తితోనే శ్రామిక ప్రజల, రైతుల పక్షాన పని చేయడానికి కారణమైంది. మా ఊరి నుంచి ఎదిగి వచ్చిన రంగవల్లి అక్క మరో స్ఫూర్తి. 1990 దశకంలో నిజామాబాద్ నగరం కోటగల్లిలో JCS ప్రసాద్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటైంది.నాన్న ఆ ట్రస్ట్ కు ఒక దశాబ్దం పాటు బాధ్యులుగా ఉన్నారు. స్వంత భవనంలో ఒక మంచి లైబ్రరీ పెట్టాం. నాన్న నేర్పిన మార్క్సిజం, ఈ అమరుల స్ఫూర్తి ఇప్పటికీ నేను ఒక సామాజిక కార్యకర్తగా నిలబడి పని చేయడానికి దోహదం చేస్తున్న అంశాలు. జోహార్ కామ్రేడ్ JCS ప్రసాద్..
– కన్నెగంటి రవి, రైతు ఉద్యమ నాయకులు