JAI BHIM movie జై భీమ్ సినిమా

JAI BHIM movie

 పేదల హృదయాలలో నిలిసిన

‘‘జై భీమ్’’ సినిమా

జై భీమ్ సినిమా చూస్తుంటే నాకైతే మత్తు దు:ఖమచ్చింది. తప్పు చేయక పోయిన పోలీసులు దొంగ కేసులు పెట్టి కొట్టిండ్రు. లాకప్ లో ఏసి కొడుతుంటే నాకు ముప్పయేండ్ల కిందటి విలేకరిగా జాబ్ గుర్తుకచ్చింది.  నక్సలైట్ అనే అనుమానమత్తే చాలు పట్టుక పోయి మత్తు తన్నెటొోళ్లు. ఇగ నక్సలైట్లతో సంబంధాలున్నోళ్లనైతే అబ్బబ్బా.. ఎంత చిత్రహింసలు పెట్టెటోళ్లో ఇగో గీ ‘జై భీమ్’ సినిమాలో కూడా గట్లనే చూపించిండ్రు.

ఇది యధార్థ కథ..

ఇగో.. ఇది సినిమా కాదు. 1995 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో కమ్మాపురంలో జరిగిన యధార్థ కథ. ఆ సంఘటనను తీసుకుని T.J జ్ఞానవేల్ అధ్బుతంగా సినిమా తీసిండ్రు. అయినా ఎవ్వడైనా గిప్పుడు కమర్షియల్ సినిమాలను తీత్తారు. కానీ గీ సినిమా వేరు. నిజ జీవితాన్ని తెరపైకి ఎక్కించిన తీరు చూస్తుంటే ముచ్చటేస్తాది. రూరల్ ఏరియాలో విలేకరిగా పని జేసిన రోజులు గుర్తుకు వచ్చి మత్తు బాధ పడ్డ. JAI BHIM movie ‘జై భీమ్’ సినిమా నవంబర్ 2, 2021 నాడు ప్రైమ్ అమెజాన్ లో రిలీజ్ చేసిండ్రు. రాత్రికే నా బిడ్డ మల్లికతో కలిసి చూసిన. ‘‘నిజంగా గిట్ల పోలీసులుంటారా డాడీ..’’ అడిగింది బిడ్డ. నక్సలైట్ల పేరుతో పట్టుక పోయి కాల్చి చంపిన సంఘటనలు చెప్పిన. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఇందల్ వాయిలో దొడ్డికి పోయిన నర్సింహులును పోలీసులు కాల్చి చంపిండ్రు. అతనికి నిజానికి నక్సలైట్లతో సంబంధం లేదు. కానీ.. అతని పేరుతోనే మరోకరు నక్సలైట్లతో సంబంధాలు పెట్టుకున్నందుకు పోలీసులు అతనే ఇతననుకుని చంపెసిండ్రు. అదే విషయం నేను చెప్పితే నా బిడ్డ నమ్మలేదనుకో..?

నటీ నటులకు సెల్యూట్..

‘జై భీమ్’ సినిమాలో అందరూ జీవించిండ్రు. సినిమా చూస్తుంటే నటించినోళ్లు సినీ ఆర్టిస్ట్ లని మరిచి పోయి చూత్తుంటాం. నేను పల్లెటూర్ నుంచి వచ్చిన కదా.. అందులో రూరల్ ఏరియాలో విలేకరిగా పని చేసినోణ్ణి కదా.. ఇగో.. ఆ సినిమా చూస్తున్నంత సేపు నేను మనిషిని కాలేక పోయిన. గీ సినిమాలో చూపిచ్చినట్లు పదేండ్ల కిందటి వరకు మన తెలంగాణలోని పల్లెల్లో గిట్లనే ఉండే. నేనే అందుకు ప్రత్యక్ష సాక్షిని.

బాల గోపాల్ సార్ గుర్తోచ్చిండు..

ఈ సినిమాలో ప్రజల పక్షణ నిలిసి పోరాడే చంద్రం పాత్రను చూస్తుంటే మానవ హక్కుల కోసం పోరాటం చేసి నక్సలైట్ల ఏరియాలో తిరిగిన బాల గోపాల్ సార్ గుర్తుకు వచ్చిండు.  నక్సలైట్ల పేరుతో పోలీసులు అమాయకులను పట్టుక పోయి చిత్రహింసలు పెట్టినప్పుడు.. ఎన్ కౌంటర్ పేరిట కాల్చి చంపినప్పుడు ఇగో గా బాల్ గోపాల్ సార్ వత్తుండే.

గిరిజనుల జీవితాలు..

‘జై భీమ్’ సినిమాలో గిరిజనుల జీవితాలను బాగా చూపిచ్చిండు. పెత్తందారులు పెత్తనం కళ్లకు కట్టినట్లు ఉంది. అక్రమంగా కేసులు పెడుతున్న వారి గురించి ప్రశ్నించే గొంతులు లేవు. ప్రభుత్వం – పోలీసులచే గిరిజనులు అనుభవిస్తున్న నరకం సినిమాలో బాగా చెప్పిండ్రు. సినిమా చూస్తుంటే మనం స్వాతంత్య్ర దేశంలోనే ఉన్నామా..? అనే డౌట్ వస్తోంది. సినిమాలో చూపిచ్చినట్లు మనకు ఎదురైతే అమ్మో..  పోలీసు స్టేషన్ లో ఆ చిత్రహింసలకు ఎవడన్న చచ్చి పోవాల్సిందే. దక్షణ భారత దేశంలో మంచి పేరున్న యాక్టర్స్ సూర్యా జ్యోతిక ఈ సినిమాను తీసిండ్రు. సినీ హీరో సూర్యా లాంటి నటుడు ఓ మార్క్సిస్ట్ – నక్సలైట్  పునాది కలిగిన న్యాయవాది పాత్రలో నటించడం సాహసమే. అర్బన్ నక్సలైట్ల పేరుతో అక్రమంగా అరెస్టులు చేస్తున్న నేటి పరిస్థితులలో ధైర్యంగా JAI BHIM movie ‘జై భీమ్’ సినిమా తీసినోళ్లకు సెల్యూట్.

లాయర్ వృత్తికి జేజేలు..

‘‘గిరిజన, పేద వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు  లాయర్  వృత్తి తుపాకిలా పని చేస్తోంది. ప్రజాపోరాటాలు, న్యాయ పోరాటాలు. అంతిమంగా ఉద్యమాలే ప్రజల్ని కాపాడుతాయి. కానీ.. సోషల్ మీడియాకు అడాక్ట్ అవుతున్న నేటి యువత కళ్లుండి చూడలేని గుడోళ్లలా వ్యవహరిస్తున్నంత కాలం ఇగో.. పేదలకు అన్యాయం జరుగుతునే ఉంటుందచ్చు.

సినిమా ఎండింగ్ లో..

లాయర్ చంద్రు ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని పేపరు చదువుతుంటాడు. ఆ టైమ్ లో అక్కడే ఉన్న రాజన్న బిడ్డ చంద్రులాగే కాలుమీద కాలేసుకుని కూర్చోని న్యూస్ పేపర్ చదవడం ఈ సినీమాకు హైలెట్. ఆ సీన్ చదువు ప్రధాన్యతను గుర్తు చేసింది. ‘జై భీమ్’ సినిమా ఓరల్ గా చదువు, జ్ఞానం, విద్య ఆవశ్యకతే భవిష్యత్ కు మార్గం అంటూ హీత బోధ చేస్తోంది. అన్యాయాన్ని గెలిపించే చాలా మంది లాయర్ లు ఉన్నారు. కానీ.. అందుకు భిన్నంగా నిస్వార్థంగా, నిజాయితీగా పని చేసే  చెన్నై జస్టిస్ చంద్రు పాత్ర అందరికీ మార్గదర్శకం. మానవ హక్కుల కేసుల్లో ఫీజు తీసుకోని గొప్ప న్యాయవాది. రాజ్యం ఉద్యమకారుల అణిచివేతకు తెచ్చిన ఎన్నో కేసులపై నిర్విరామంగా పోరాడినవాడు. JAI BHIM movie

లాల్ నీల్ జెండాలతో.. 

పోరాడితే దోపీడి లేని వ్యవస్థ ఏర్పాడుతుందనే సందేశంకు గుర్తుగా చంద్రు ఆఫీస్ లో వెనుక మార్క్స్,  లెనిన్ ఫోటోలు ఉంటాయి. అలా మార్క్సిజం అంబేడ్కరిజం ఇండియాలో కలిసి పనిజేయాల్సిన అవసరాన్ని దర్శకుడు పరోక్షంగా చెప్పి మంచి పని చేసిండు. ఈ  ‘జై భీమ్’ సినిమాలో ఫోటోగ్రాఫి, స్ల్రీన్ ప్లే సూపర్. నటించిన జ్ఞానవేల్, సూర్యా, జ్యోతిక మీకు జై భీమ్ లాల్ సలాం.. రెడ్ సెల్యూట్..

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

949 222 5111

JAI BHEEM movie/ ZINDHAGI.COM /YATAKARLA MALLESH / GOOD CINEMA/JAI BHIM movie/
Comments (2)
Add Comment
  • Niranjan

    ఎక్సలెంట్.. ఇంకా ఈ ప్రజాస్వామ్య దేశంలో మానవత్వం ఉంది అని ఈలాటి సినిమా ఋజువు.

    • zindhagi

      Thanks నిజమే…