అయ్యా, నారాయణస్వామి గారూ… మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు

  • తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారన్న రఘురామకృష్ణరాజు
  • నారాయణస్వామి కూడా అదే మాట అంటున్నారని వెల్లడి
  • నారాయణస్వామితో పెద్దగా పరిచయం కూడా లేదన్న రఘురామ

గత కొన్ని రోజులుగా కొందరు తనను రాజీనామా చేయమని దుర్భాషలాడుతున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. ఇవాళ కూడా ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రఘురామకృష్ణరాజు అదే అంశంపై మరోసారి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి స్పందించినట్టు తెలిసిందని, తాను జగన్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడి ఎంపీ సీటు తెచ్చుకున్నానని, అందుకే రాజీనామా చేయాలని నారాయణస్వామి అనడం తగదని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.

నారాయణస్వామి రాజకీయాల్లో సీనియర్ అని, ఆయనంటే తనకు గౌరవం ఉంది కాబట్టి కొన్ని పదాలను ఇక్కడ ఉపయోగించడంలేదని రఘురామ పేర్కొన్నారు. “అయ్యా, నారాయణస్వామి గారూ… నేను ఎవరి కాళ్లూ పట్టుకుని ఎంపీ సీటు తెచ్చుకోలేదు. ఎవరెవరు ప్రాధేయపడితే నేను ఈ పార్టీలోకి వచ్చానో గతంలోనే చెప్పాను. మీతో మాట్లాడదామని ప్రయత్నిస్తే మీరు లైన్లో దొరకలేదు.

నాకు తెలిసిన మరో విషయం ఏమిటంటే… ఉపముఖ్యమంత్రి బిరుదాంకితులైన మీకు ఏ జిల్లాలోనూ జాతీయ జెండా ఎగురవేసే అవకాశం దొరకలేదట కదా! మీ సహచరుడైన ధర్మాన కృష్ణదాస్ కు ఉపముఖ్యమంత్రి హోదాలో ఓ జిల్లాలో పతాకావిష్కరణ చేసే అవకాశం ఇచ్చి మీకు మాత్రం ఏ జిల్లా కేటాయించని విషయం వెల్లడైంది. జగన్ అందరికీ అగ్రతాంబూలం ఇస్తారని మీరు చెబుతున్నారు. అది నిజమే. మరి మీరు నాపై వ్యాఖ్యలు చేసిన తర్వాత మిమ్మల్ని ఏ జిల్లాకూ కేటాయించకుండా పక్కనబెట్టారు. ఈ విషయంలో మీకు బాధలేకపోయినా, మీ తరఫున నేను బాధపడుతున్నాను. మీకు, నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఎక్కడో చిత్తూరులో ఉన్న మీరు నా గురించి మాడ్లాడాల్సిన అవసరం లేదు” అంటూ హితవు పలికారు.

Comments (0)
Add Comment