Happiness in contentment
“తృప్తిలోనే ఆనందం…!!
జీవిత మైతే తీరానికి చేరింది
కానీ…..,
అలల్లాంటి కష్టనష్టాలకు,
అంతులేని ఆవేదనకు
పోకాలమెప్పుడో తెలీటం లేదు !!
తీరంలో కూర్చొని….
ఆలల దాగుడు మూతలు
ఆటుపోట్లూ చూస్తూ….
ఇంకెంత కాలం గడపాలి ?
జీవితం కూడా …
సముద్రం లాంటిదే
ఓ పట్టాన అర్థం కాదు
అంత విశాలంగా వున్నా…
ఇంకా దేనికోసమో…
ఆరాటం సముద్రానికి
అలల తాకిడితో తీరాన్నే కబళించే
దుర్మార్గపు కుట్రేదో వున్నట్లుంది
లేకుంటే ..
తన మానాన తను హాయిగా వుండక
మితిమీరిన కోరికలతో పొంగుతూ
తనకు శాంతి లేకుండా…
తీరానికి కునుకు రానీకుండా
ఇలా ఎన్నాళ్ళో ఉరుకులు పరుగులు ?
ఇంచుమించు జీవితం కూడా ఇంతే…..
దొరికిన దానితో తృప్తి లేదు ….
లేనిదానికోసం ఆరాటం ….
అడ్డదారుల్లో ఒకటే పోరాటం
మరుగున పడుతోంది మనిషితనం
తీరం చేరినా…..
Happiness in contentment
మనిషికి సుఖం లేదు
కోరికల సుడిగుండంలో చిక్కి
విలవిల్లాడుతున్నాడు
తనకు తానే సమస్యల్ని సృష్టించుకొని
బయటపడలేక …
ఊబిలో కూరుకు పోతున్నాడు.
కోరికల సుడిగుండం
సునామిలా ముంచేయక ముందే…
ఓ మనిషీ ……,
నిజం తెలుసుకో
తృప్తిలోనే ఆనందాన్ని వెతుక్కో !!
ఎ.రజా హుస్సేన్, కవి