Farmer life story రైతు జీవితం
మట్టిలో మట్టినై..
చిక్కి శల్యమైన దేహంతో పుడమికి
మరమ్మత్తులు చేస్తున్న షరాబు అతడే..
బీడు వారిన భూముల్లో సిరులు పండాలని.
పేదవారి డొక్కలు ఒక్క పూటైనా నిండాలని.
కలిసిరాని కాలానికి వినతులు సమర్పిస్తున్న ధీనుడతడే.
“చింతలన్నీ “ఓర్పు అనే చిలక్కొయ్యకు తగిలించి,
లోకమంతా చీకట్లో మగ్గుతున్నా!
కన్నుల్లో వత్తులేసుకొని గుడ్డి దీపంలా వెలుగుతున్నాడతడే…
గ్రీష్మ తాపానికి నెర్రెలిడిన భూమిపైన
అతని స్వేదం తో సేద్యం చేస్తున్న
బడుగు బక్కజీవి అతడే.
ముక్కోటి దేవతలను వేడుతున్నాడు
చినుకై తమని దీవించగా రారమ్మని
తొలిపంటతో సంబరాలు మీకే చేస్తామని..
కాలం కరుణించి కర్షకుడి శ్రమ ఫలించింది.
గుంటకాడ నక్కలా దళారి పొంచి ఉన్నాడు
అతని శ్రమను దర్జాగా దోచుకునేందుకే….
నకిలీ విత్తనాలు,తాలు పంటను అందించింది
అప్పుల పెనుభారం ఆత్మహత్యల వైపు నడిపించింది
నిత్యం శ్రమించే కర్షకుడు విఘత జీవిగా …
తను ఆరాధించే మట్టిలో మట్టిగా..
ఎరువుగా కలసిపోతున్నాడు…
రైతే రాజన్న మాటలకర్ధం తెలయక… పాపం!!
(“జాతీయ స్థాయిలో “అక్షరాల తోవ, ఖమ్మం “వారు నిర్వహించిన కవితల పోటీలో కన్సోలేషన్ బహుమతి పొందిన కవిత)
రాము కోలా, కవి
9849001201