Ernest Rutherford’s death on October 19
అణు భౌతిక శాస్త్ర పితామహుడు రూథర్‌ఫోర్డ్
అక్టోబర్ 19న ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ వర్ధంతి
ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ (ఆగస్టు 30 1871 – అక్టోబరు 19 1937) న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయన శాస్త్రజ్ఞుడు. ఆయనకు అణు భౌతిక శాస్త్ర పితామహుడు అనే బిరుదు గలదు. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి (1908) పొందాడు. అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు.
పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే మూడు ముఖ్యమైన మూలకణాలున్నాయి. ఈ కణాలు పరమాణువులో ఏ విధంగా అమరి ఉన్నాయో తెలియ జెప్పేదే పరమాణు నిర్మాణం. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎన్నో నమూనాలను ప్రవేశ పెట్టారు. అందులో రూథర్ ఫర్డ్ నమూనా ఒకటి. తను చేసిన α- కణ పరిక్షేపణ ప్రయోగ పరిశీలనల ఆధారంగా ఈ నమూనాని ప్రతిపాదించాడు.
అణువు యొక్క రూథర్‌ఫోర్డ్ నమూనా (లేదాగ్రహ మండల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత బోర్ నమూనా లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహద పడింది) ను ప్రతిపాదించాడు. ఆయన రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ ప్రయోగాన్ని బంగారు రేకు గుండా α-కణ పరిక్షేపణ ప్రయోగంచేసి కెంద్రకం యొక్క ఉనికిని కనిపెట్టాడు. 1908లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
న్యూజిలాండ్ లోని నెల్సన్ లో 1871 ఆగస్టు 30న జన్మించిన రూథర్‌ఫర్డ్ కు చిన్నతనం లోనే సైన్స్ పట్ల అభిరుచి కలిగింది. పదేళ్లకే ఎలిమెంటరీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేశాడు. న్యూజిలాండ్ విశ్వ విద్యాలయంలో స్కాలర్‌షిప్‌తో చేరిన అతడు బీఏ, ఎమ్ఏ, బీఎస్సీ డిగ్రీలు సాధించాడు. ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూనే అత్యంత వేగంగా ప్రయాణించే విద్యుదయ స్కాంత తరంగాలను కనిపెట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇరవై ఏడేళ్ల వయసులోనే కెనడా లోని మెగిల్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి పరిశోధనల్లో నిమగ్న మయ్యాడు.
అక్కడే యురేనియం, థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు వెలువరించే ఆల్ఫా, బీటా వికిరణాలను ఆవిష్కరించాడు. రేడియో ధార్మిక విఘటనం (Radio active decay) నియమాలను ప్రతిపాదించాడు. ఒక రేడియో ధార్మిక పదార్థంలో ఉండే సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే ‘అర్థ జీవిత కాలం’ ను నిర్వచించాడు. ఈ సూత్రం ప్రకారం రేడియో డేటింగ్ పద్ధతి ద్వారక్వ భూమి వయస్సును కూడా కనుగొనవచ్చని చెప్పాడు. అలాగే కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా నైట్రోజన్‌ను, ఆక్సిజన్‌గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనలకు 1908లో నోబెల్ బహుమతి అందుకున్నాడు.
కెనడా నుంచి ఇంగ్లండ్ తిరిగి వచ్చిన తర్వాత పలుచటి బంగారు రేకుపై ధనావేశమున్న ఆల్ఫా కిరణాలను ప్రసరింప చేసినప్పుడు 20000 కణాలలో ఒకటి వెనక్కి తిరిగి రావడాన్ని గమనించాడు. అందుకు కారణం పరమాణువులో ధనావెశమున్న కేంద్రకం ఉండటం కారణంగా కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు వాటిని వికర్షించడమేనని కనుగొన్నాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, పరమాణువు ల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించాడు. ఇదే రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనాగా పేరొందింది. దీనినే గ్రహమండల నమూనా అంటారు. ఆ తర్వాత కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లు ఉంటాయని ఊహించాడు. రసాయన చర్యలతో ఒక మూలకాన్ని వేరొక మూలకంగా మార్చలేం. కానీ కేంద్రక చర్యలతో ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చవచ్చు.
స్థిరమైన మూలక కేంద్రకాలను α – కణం లేదా ప్రోటాన్‌తో తాడించడం వల్ల వాటిని వేరొక మూలకాలుగా మార్చొచ్చు. ఈ ప్రక్రియను కృత్రిమ పరివర్తనం అంటారు. రూథర్‌ఫర్డ్ మొదటిసారిగా నత్రజనిని ఆక్సిజన్‌గా మార్చాడు. ఆ విధంగా ఏర్పడిన మూలకాలు కొన్ని రేడియో ధార్మికతను ప్రదర్శిస్తాయి. వాటిని రేడియో ఐసోటోపులు అంటారు. వాటిని మనం వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, పరిశ్రమల్లో ఉపయో గిస్తున్నాం. ఆయన శిష్యుల్లో చాలా మంది నోబెల్ బహుమతులు సాధించడం విశేషం. అనేక అవార్డులు సాధించిన ఆయన గౌరవార్థం 104 అణుసంఖ్య ఉన్న మూలకానికి రూథర్ ఫోర్డియం అని పేరు పెట్టారు.
రామ కిష్టయ్య సంగన భట్
9440595494