Electoral democracy
హుజురాబాద్ ఉప ఎన్నికలలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది
ఆరు నెల్లయిందనుకుంటా. హుజురాబాద్ వరకు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ఆ మాట కొస్తే “బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్” గా పేర్కొనబడే ప్రజాస్వామ్యం ఎన్నికలు జరుగుతున్న ప్రతీచోటా ఆ ఎన్నికలు జరుగుతున్న కాలం లో పరిఢవిల్లుతూనే ఉంది. హుజురాబాద్ వరకు ముప్పయ్యో తారీకు సాయంకాలం వరకు అనంతరం రెండో తేదీ ఫలితాలొచ్చేవరకూ ప్రజాస్వామ్యానికి ధోకా ఉండదు. అయిదు నెల్ల నుంచే ఇక్కడ ఇంటింటికీ వాల్ క్లాక్ పథకం అమలయింది. కొన్ని చోట్ల కుట్టుమిషన్ పథకం కూడా.
ఓటు కోసం వస్తువులు
ఓటర్లు తమ హక్కు భుక్తం గా లభించాల్సిన ప్రతీ వస్తువునూ అడిగి మరీ తీసుకోవడం ప్రజాస్వామ్యం లోనే సాధ్యం కదా. ఎన్నికల ప్రక్రియ మొదలవగానే ఎక్కడికక్కడ ఓటర్లు, కుటుంబాలు తమకు లభించాల్సిన ప్రతీ సౌకర్యాన్నీ ఓట్ల సందర్భం లో ఇచ్చే సవులత్లనూ తూ చ తప్పకుండా తీసుకోవడం ఇక్కడ ఎంతో ఆనందాన్ని కలిగించింది. రాని వాళ్ళు తమకు తప్పక లభించి తీరాల్సిన సౌకర్యాలను అడిగి మరీ తీసుకోవడం ఒక్క ప్రజాస్వామ్యం లోనే సాధ్యమని హుజురాబాద్ ద్వారా సమాజానికి తెలిసింది.
ప్రతీ ఓటర్ ఓ మేనల్లుడే..
ఎన్నికలప్పుడు ప్రతీ ఓటర్ ఓ మేనల్లుడనే దృక్పథాన్ని పార్టీలూ నాయకులు తరచి చెప్పడం హుజురాబాద్ ఎన్నిక ద్వారా ప్రస్ఫుటమయింది. కవర్లలో కానుకలు ఇచ్చే విధానం, రిటర్న్ గిఫ్ట్ గా ఓటును కోరుకోవడం ఇవన్నీ ఎంతో గొప్పగా అనిపిస్తున్నాయి. హుజురాబాద్ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన తరుణమిది.. పార్టీలు హుజురాబాద్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించాయి. నాయకులు డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చనే విశిష్ట లక్షణాన్ని చాటి చెప్పారు.. మిగిలింది మూడు పువ్వులూ ఆరుకాయల్లా పరిఢవిల్లే ప్రజాస్వామ్యం.
- పివి కొండల్ రావు, సీనియర్ జర్నలిస్ట్