తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్తకు కొరియా పురస్కారం
మత్స్యరంగం శాస్త్ర వేత్త డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తాకు
పద్మశ్రీ అవార్డు రావడం అభినందనీయం
అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీలి విప్లవం ద్వారా ఆహారభద్రతను సాధించడం కోసం మత్స్యరంగంలో విశేషంగా కృషిచేసిన డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తాకు కేంద్రప్రభుత్వం “పద్మశ్రీ” అవార్డును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ర్ట అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ రాష్ర్ట సలహాదారుడు పిట్టల రవీందర్.
డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా ను గౌరవించడం తెలంగాణ మత్స్యరంగానికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు వారు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ మత్స్యరంగ ప్రముఖునిగా సేవలందిస్తున్న డాక్టర్ విజయ గుప్తాను ఈ అవార్డుకు ఎంపిక చేయడం హర్షనీయమని వారు అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి అనేక దేశాల్లో మత్స్యరంగాల అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో “నీలి విప్లవం” విజయవంతం కావడానికి డాక్టర్ విజయ్ గుప్తా ఎంతో పాటు పడ్డారని వారు తమ ప్రకటనలో కొనియాడారు.
ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పిట్టల రవీందర్ అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణలో ఉపరితలజలవనరుల చేపల పెంపకంలో (inland fisheries) డాక్టర్ విజయ్ గుప్తా పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు ఈ సందర్భంగా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న సందర్భంగా డాక్టర్ విజయ్ గుప్తాను రాష్ట్ర రాజధానిలో త్వరలో ఘనంగా సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.