రోత రాతలు నామీద వద్దు!
నీకు దండం పెడతా నన్ను వదిలేయ్ !
రైతే రాజు, అన్నదాత దేశానికి వెన్నెముక లాంటి మాటలు ఇకనైనా మానేస్తే బెటర్. రైతు రాజు కాదు స్వామి, దేనికీ గొరగాని వాడు. ఆరుగాలం శ్రమించినా అప్పులు పండించుకునే అమాయకుడు. వచ్చేశారన్నా పంట బాగా పండుతుంది. మంచి లాభాలు వస్తాయని ఆశించి భంగపడే నిత్య ఆశాజీవి.
కఠోరమైన వాస్తవం ఏంటంటే వ్యవసాయం ద్వారా లాభపడిన రైతులు ఎంత మంది ఉన్నారు? బంగళాలు కట్టి, కార్లలో తిరుగుతున్న వారి సంఖ్య ఎంత? చెప్పలేం. అసలు ఉంటే కదా చెప్పడానికి? వందకు వంద శాతం అన్నదాతలంతా అప్పుల బాధలు పడుతున్నవారే. ఇక ముందుకూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగాల్సిందే!
ప్రభుత్వాలు రైతులకు ఎనలేని పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అంటున్నాయి. రైతుబంధు, రైతుబీమా, కోటి ఎకరాలకు నీళ్లు, 24 గంటల ఉచిత కరెంటు అంటూ ఊదరగొడుతున్నాయి. అయితేనేం, రైతుల ఆత్మహత్యలు ఆగుతున్నాయా? లేదే!. రైతులకు మేలు చేస్తున్నాం అని చెప్పే ప్రభుత్వాల పరిస్థితి.. ఈతాకు వేసి తాటాకు దొబ్బాం అన్నట్లుంది.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీ నాయకులు రైతుల పట్ల నిజమైన ప్రేమను చూపించలేదు ఓవైపు రైతుబంధు, కిసాన్ యోజన అంటూ మరోవైపు ఎరువుల ధరలు పెంచడం, డ్రిప్ప్, వ్యవసాయ పనిముట్ల మీద ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా రద్దు చేయడం, ధాన్యం అమ్మకాల్లో అరిగోస పెట్టడాన్ని ఎలా మర్చిపోగలం?
పొద్దున లేస్తే చాలా అధికారులు, రాజకీయ నాయకులు నోరు తెరిస్తే తామూ రైతు కుటుంబం నుంచే వచ్చామని పిచ్చిమాటలు చెప్తుంటారు. రైతులు పడే కష్టం తమకు తెలుసు అంటారు. రైతును రాజుగా మార్చేందుకు ఎంతో కృషి చేస్తున్నామంటారు. ఇదంతా కేవలం స్టేజీల మీది కెమెరాలు ఉన్నంత సేపు కొట్టే గప్పాలు మాత్రమే. ఏ అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా సరే మనస్సాక్షిగా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఎంత మంది రైతులను తమ కార్యాలయంలో కూర్చోబెట్టి గౌరవంగా వారి సమస్య పరిష్కరించి పంపిన సందర్భాలున్నాయి?
రాష్ట్రంలో ఏ అధికారి అయినా మాసిన బట్టలతో ఆఫీస్ కి వచ్చిన రైతును పిలిచి ఓ చాయ్ తాగించి సమస్య అడిగిన సందర్భాలున్నాయా? ఎందుకు ఈ అధికారులు, నాయకులు రైతులంతా తమ తల్లిదండ్రుల్లాంటి వాళ్లే అని ఆలోచించరు? వేళ్లకు బంగారు రిగులు పెట్టుకుని, మెడలో లావుపాటి చైన్ వేసుకుని వచ్చిన వాడికి అవే కార్యాలయాల్లో ఎనలేని గౌరవం దొరుకుతుంది. వాడు లంగైనా, లఫూట్ అయినా.
చివరకు రైతుల పరిస్థితి ఎంత దిగజారిందంటే..
తన కారుకు బర్రెలు అడ్డు వచ్చాయని రైతుకు 7,500 రూపాయల జరిమాన విధించాడు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య. ఆయన చేసిన ఈ ఘనకార్యం పట్లం ఏం మాట్లాడుకోగలం. ఇంతటి గొప్ప మనసు కలిగిన ఈ కలెక్టర్, నల్లగొండ జిల్లాలో చదివాడు అని చెప్పేందుకు సిగ్గు అనిపించినా తప్పడం లేదు. గతంలో గిట్టుబాటు ధర కోసం కడుపు మండి ఆందోళనకు దిగిన ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించారు.
చిన్ని పిల్లలతో కలిసి బాధిత రైతు కుటుంబాలు జైలు దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటే మనసున్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఇక మీరు చెప్పే రైతురాజ్యం ఎక్కడున్నట్లు? ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి పరిసర గ్రామాల్లో రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, జాతీయ రహదారి విస్తరణలో రైతులు ఉన్న భూములను కూడా కోల్పోయి మరోచోట కొనుగోలు చేస్తే RRR పేరుతో మళ్ళీ తీసుకుంటున్నారు. మల్లన్న సాగర్, చర్లగూడెం రిజర్వేయర్ రైతుల పరిస్థితి దారుణం. అధికారపార్టీ ఎమ్మెల్యేల భూమునుంచి వెళ్లాల్సిన అలైన్మెంట్ ను మార్చి పేద రైతుల భూముల మీదికి మళ్లించిన ఘనాపాటీలు కూడా రైతుల గురించి లెక్చర్లు దంచుతున్నారు. తాజాగా కామారెడ్డిలోనూ భూమి కోల్పోయే పరిస్థితి వచ్చిందని రైతు ప్రాణాలను కోల్పోయాడు.
ఆ ఘటనతో జిల్లా రైతాంగం ఆందోళన బాటపట్టింది. కనీసం, రైతుల దగ్గరికి వెళ్లి వినతిపత్రాన్ని తీసుకునేందుకు కలెక్టర్ ప్రయత్నించలేదు. కావాలంటే రైతులే 10 మంది వచ్చి వినతిపత్రం ఇవ్వాలంటూ ఆఫీసులోనే కూర్చుండిపోయారు. రైతులేమైనా ఉగ్రవాదులా? గంటల తరబడి ఆందోళన చేస్తున్నా ఎందుకు వారి దగ్గరికి వెళ్లి వినతిపత్రం తీసుకోలేదు? ఈ మహానుభావులు కూడా రైతుల శ్రేయస్సు గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు.
తాజాగా ఓ ఎమ్మార్వో ఎమన్నారంటే?
ఓ రైతుకు పాసు పుస్తకాలు ఇవ్వకుండా చాలా రోజులుగా నిలుపుదల చేశాడు. నేను కాస్త ఆ రైతు ప్రాబ్లం సాల్వ్ చేయాలని అడిగాను. “వాడు ఇప్పుడే వచ్చాడు. నేను చేసి పెడతానులే” అనే సమాధానం వచ్చింది. కనీసం వచ్చిన రైతు వయసుకైనా గౌరవం ఇవ్వని పరిస్థితి. ఎమ్మార్వో వయసు ఆ రైతు కొడుకు వయసంత ఉంటుంది. అలాంటి అధికారులు కూడా తాము రైతు కుటుంబం నుంచి వచ్చామని చెప్పుకోవడం దారుణాతి దారుణం.
ఈ మధ్యే నిడిమనూరు మండలం ఎర్రగూడెం గ్రామానికి చెందిన చాలా మంది రైతులు నాసిరకం పుచ్చ విత్తనాలు నాటి చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి న్యాయం జరిగేలా చూడాలని హార్టికల్చర్ అధికారికి చెప్పాను. “విత్తనాలు అమ్మిన ఏజెన్సీ వాళ్లు ఎంతో కొంత ఇస్తారు తీసుకెళ్లమని చెప్పండి” అన్నాడు సదరు అధికారి. నాసిరకం విత్తనాలు అమ్మి రైతులను నట్టేట ముంచిన విత్తనాల ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సదరు అధికారి, రైతులు ఏదో ముష్టి తీసుకొని వెళ్లాలని చెప్పడం నిజంగా సిగ్గుచేటు.
నేను ఈటీవీలో పని చేస్తున్న సమయంలో..
2009లో భారీ వర్షాలు వచ్చాయి. ఆ సమయంలో ఈటీవీ కెమెరామెన్ చిరంజీవితో ( ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు) కలిసి కనగల్లు దగ్గరకి స్టోరీ కోసం వెళ్తున్న సమయంలో కనగల్ లో ఓ రైతు తన పొలంలో ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా నీట మునిగింది. ఆ ధాన్యాన్ని కాపాడుకునేందుకు జోరు వర్షంలో వరాలకు గండ్లు కొడుతూ ఆ వర్షపు నీటితో జతకట్టిన ఆ రైతు కన్నీళ్లను చూసిన నాకు కన్నీళ్లు ఆగలేదు.
నేను తనకు కాసేపు సాయం చేశాను. ఓ రైతు కొడుకుగా రైతు పడే కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టే ఆ పని చేశాను. కానీ, అధికారులైనా, రాజకీయ నాయకులైనా రైతుల పేరుతో రాజకీయాలు చేసుకోవడం తప్ప, వారికి లబ్ది చేకూర్చే ఆలోచనేమీ లేదు. రైతు సదస్సుల్లో అధికారులు, శాస్త్రవేత్తలు కనపడుతారు కానీ, అసలు రైతుల అనుభవాను లెక్కలోకి తీసుకోరు. జస్ట్, రైతును తమ అవసరాల కోసం వాడుకోవడం తప్ప, అతడికి చేసే మేలేమీ ఉండదు. ఇప్పటికైనా వారి మానాన వారిని వదిలేయండి, వారికేదో చేస్తున్నామనే ఓవరాక్షన్ ఆపడం మంచిది.
శేఖర్ కంభంపాటి,
జర్నలిస్ట్, నల్లగొండ
ఫేస్ బుక్ సౌజన్యంతో..