రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలనేది సుషాంత్ సింగ్ అభిమానుల డిమాండ్. బీహార్ ఎన్నికల నేపథ్యంలో సుషాంత్ సింగ్ కేస్ పొలిటికల్‍గాను ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరతగతిన న్యాయం చేసేయాలనే ఆరాటం ప్రభుత్వం చూపించింది. అయితే చాలా మంది అనుమానించినట్టు సుషాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్ర ఏమీ లేదు. కనీసం సిబిఐ విచారణలో అయితే ఆ దిశగా ఏమీ బయటపడలేదు. అలాగే అతని ఆరోగ్యం క్షీణించడానికి ఆమె ఏవో మందులు వాడిందనే ఆరోపణలు కానీ, అతని డబ్బుని దుర్వినియోగం చేసి తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుందనే ఆరోపణలు కానీ రుజువు కాలేదు. అసలు న్యాయం కావాలని డిమాండ్ చేసింది ఈ విషయాలలో అయితే, ఇన్నాళ్ల పాటు విచారణలో డ్రగ్స్ క్రయము, వినియోగం విషయంలో మాత్రమే రియా దోషిగా తేలింది.
ఆమెను అరెస్ట్ చేయాలనేది జనం డిమాండ్ కాబట్టి అది నెరవేర్చడానికి ఈ ఒక్క నేరం సరిపోయింది. అందుకే ముందు ఆమె సోదరుడిని, తర్వాత రియాను అరెస్ట్ చేసేసింది. ఏదయితేనేమి రియా అరెస్ట్ అయింది కదా అంటూ సుషాంత్ ఆర్మీ సంబరాలు చేసుకుంటోంది. ఇది బాలీవుడ్ పెద్దల కుట్ర, సుషాంత్ మాజీ మేనేజర్‍తో పాటు ఇది డబుల్ మర్డర్, ఒక బడా రాజకీయ నాయకుడి పాత్ర… ఇలా వివిధ థియరీలు వినిపించిన వాళ్లు అదంతా వదిలేసి డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్ అవడాన్ని ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ డిమాండ్స్ కి తగ్గట్టు ప్రభుత్వాలు నడుస్తోన్న తీరుకి ఇదో తాజా ఉదాహరణ మాత్రమే.
Tags: sushant rajput suicide, rhya chakraborthy arrest , cbi, drugs