గుడ్మార్నింగ్
Couples with mental disorders Diverce..> దంపతులు మనస్పర్థాలతో విడాకులు తీసుకుంటే..?
ఎవరైనా దంపతులు విడాకులు తీసుకుంటే, మనలో చాలా మందికి ‘కోతులకు కొబ్బరి కాయ దొరికినట్టు’ అందులో మళ్ళీ , వాళ్లు సెలబ్రిటీలు అయితే, మరీ టూమచ్ చేస్తుంటారు. ఇష్టానుసారం కామెంట్స్ చేస్తుంటారు. అందులో మళ్ళీ అనేక రకాల, వర్గాల, కులాల మతాల ప్రాంతాల జెండర్ల దృష్టి కోణాలు కూడా ఆ కామెంట్లకు జత అవుతాయి.
గత నాలుగు రోజులుగా ,అటు మీడియాకు,ఇటు పాఠక వీక్షకులకు ,ఇద్దరు సినిమా నటీనటుల విడాకుల వ్యవహారం ,ఓ సంచలన వార్తా విషయం!
వీక్షకులు ఇలాంటి విషయలనే ఎక్కువ చూస్తారని,టీవీ న్యూస్ చానెల్స్ వారు- ఇటువంటి వార్తలనే రీడర్స్ ఎక్కువ పట్టించుకుంటారని ,వార్తాపత్రికల వారు అంటుంటారు. మొత్తమ్మీద ‘వారి వీరి ‘ పరస్పర సంస్కారాలు , అలా డ్రైనేజి లాగా వ్యక్తం అవుతూ ఉంటాయి.
నిజానికి, విడాకుల విషయం, ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం. దాంతో సమాజానికి పనిలేదు. నష్టం లేదు.
చక్కగా సంసారాలు చేసుకునే వారంతా,ఏమీ దేశ సేవ చెయ్యడం లేదు. ఆసక్తి అభిరుచి అవసరాలను బట్టి, కాపురాలు సాగుతూ ఉంటాయి. చాలా దాంపత్యాలు విధిలేక సాగుతుంటాయి.భర్తలు చనిపోయిన తరువాత, కొందరు భార్యలు రిలీఫ్ పొందుతారు. అలాగే భర్తలు కూడా కొందరు ఉన్నారు.
భార్య చనిపోయింది అని ఒకాయన , ఒకటే ఏడ్పు ఏడుస్తుంటే, ఓదార్చే మనిషి ఒకాయన’ నా పెండ్లాం చచ్చిపోనందుకు, నేను ఏడుస్తున్నాను- నువ్వెందుకు ఏడుస్తున్నావు?’ అని చెవుల్లో చెప్పాడు ఒకప్పుడు.
బలవంతంగా సాగుతున్న కాపురాలు ,కోట్లలో ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేక ,ఎందరో కలహాల కాపురాలను సాగిస్తూ ఉన్నారు.
‘ వివాహం అనేది, అవసరమైన అరిష్టం’ అని
ఓ ఆధునిక తత్వవేత్త అన్నాడు.అరిష్టం అంటే, చెడ్డది అని!
అసలు వివాహమే వద్దని ,స్వేచ్ఛగా బ్రతకమని ప్రచారం చేసేవారు కూడా, మళ్లీ మనకు సెలబ్రిటీలే!
ఎవరి ఇష్టానుసారం వారు- ఎవరి తత్వం ప్రకారం వారు,
ఎవరి బ్రతుకు వారు బ్రతికే హక్కు ,ఎవరికైనా ఉంది. దాన్ని కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు.అది నేరం కూడా!
వివాహ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభం అయిందో, విడాకుల వ్యవస్థ కూడా అప్పుడే ప్రారంభం అయింది.
‘గుంపు’ వ్యవస్థ కాలంలో కూడా, మనిషికి కొంత స్వేచ్ఛ ఉండేది. కుటుంబ వ్యవస్థ ప్రారంభం అయిన తరువాతనే, మనిషికి స్వేచ్ఛ లేకుండా పోయింది. మనిషి గుణగణాలు, మనస్తత్వాలు కలవని వివాహాల వల్ల, దాంపత్య జీవితంలో సంఘర్షణలు తలెత్తాయి. పరస్పరం హింసించుకుంటూ బ్రతకడం కంటే, విడిపోయి బ్రతకడం మంచిదని ,విడాకుల వ్యవస్థను కూడా ఆనాడే ఏర్పాటు చేశారు.
అడవి గ్రామానికి చెందిన ఒకామెను ,మైదాన ప్రాంతం అబ్బాయికి ఇచ్చి వివాహం చేసారు.ఆమె కాపురానికి రాకపోతే,కాళ్లు రెక్కలు తాళ్లతో కట్టి ,ఎడ్లబండ్లో వేసుకుని తెస్తే,మరునాడు మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి తన అడవి గ్రామానికి పారిపోయ్యేది.అట్లా తేగా తేగా అలవాటు అయింది కానీ, జీవితం అంతా ఆమె కాంప్రమైజ్ కాలేదు.
ఆస్తిపాస్తులు ఉన్న వర్గాల విడాకుల వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉంటే,అవి లేని పేదవర్గాల విడాకులు వ్యవస్ధ చాలా సులభంగా ఉంటుంది. ఇరు కుటుంబాల ,ఇరు గ్రామాల పెద్దలు ,రెండు గ్రామాల మధ్య ,ఓ తాటి చెట్ల కల్లు మండువాల దరిదాపుల్లో పంచాయతి పాయింట్లు పెట్టుకునే వారు.ఆస్తిపాస్తులు లేని కుటుంబాలు కనుక,
ఆడది మగవాడు, ఇద్దరూ చెరో రెక్కల కష్టం చేసుకుని బ్రతికే వారు కనుక, ఇక నుండి ఎవరి బ్రతుకు వారిదే అని తీర్మానం చేసుకునే వారు. తరువాత రెండు లొట్ల కల్లు తాగిన తరువాత, ఎటువారు అటు పొయ్యేవారు.
ఆస్తిపాస్తులు ఎంత ఎక్కువ ఉంటే,విడాకుల వ్యవహారం అంత క్లిష్టంగా ఉంటుంది.
విడాకుల వ్యవస్థను కూడా పెద్దలే ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు గ్రామాలలో ఒకరో ఇద్దరో,విడాకుల పంచాయతీలలో ‘విడాకులను’ రాయడానికి ఉండేవారు.ఇది కూడా చదువు రాతకోతలు అందుబాటులోకి వచ్చిన , స్థిర వ్యవసాయ సమాజపు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విడాకుల తంతు.
ఇచ్చుకునేవి,పుచ్చుకునేవి మాట్లాడుకుని,విడాకుల కాగితం రాసుకుని, ఎవరి కాగితాన్ని వారు(ఆకు) తీసుకుని వెళ్లేవారు. ఇరు కుటుంబాల ,ఇరు గ్రామాల పెద్దలు కొందరు అటువంటి పంచాయతీలు చేసేవారు.
ఆ నాటి విడాకుల వ్యవస్థ కూడా సులభంగా ఉండేది.
ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న అనేక విడాకుల కేసులను గమనిస్తే, అవన్నీ ఆస్తిపాస్తులను అధికంగా లాగడానికి వేసిన కేసులే అని అర్థం అవుతుంది.
ఆర్థిక వెసులుబాటు అందుబాటులోకి వస్తున్నాకొద్దీ,మనుషులు స్వేచ్ఛగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. బలవంతపు దాంపత్యాలు,అనేక మానసిక శారీరక రుగ్మతలకు కారణం అవుతుంటాయి. కలిసి కుక్కల లాగా కొట్లాడుతూ బ్రతికే బదులుగా, విడాకులు తీసుకుని ఎవరి బ్రతుకు వారు ప్రశాంతంగా బ్రతకడం ఉత్తమమైన పద్దతి.
సింగిల్ పేరెంట్ లైఫ్ స్టైల్ ,ఆల్రెడీ సమాజంలో వ్యాపిస్తోంది.గ్రహించాలి.
మన సమాజంలో దోపిడీ దౌర్జన్యాల పట్ల అభ్యంతరం లేని వారందరికీ, వ్యక్తుల విడాకుల విషయం మీద బోలెడు అభ్యంతరం ఉంటుంది. అదీ సంగతి!
–
తుమ్మేటి రఘోత్తమరెడ్డి, రచయిత