హైదరాబాద్‌లో 6లక్షల మందికి కరోనా!’ సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌: నగరంలో దాదాపు 6లక్షల మంది కరోనా బారినపడినట్టు సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) – సీఎస్‌ఐఆర్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. వీరిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు లేవని.. వారు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. కరోనా రోగుల నుంచి కేవలం ముక్కు ద్వారానే కాకుండా నోటి నుంచి, మలమూత్రాల నుంచి కూడా వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుందని పేర్కొంది. నగరంలోని వేర్వేరు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన అనంతరం సీసీఎంబీ ఈ విషయాలను వెల్లడించింది.

ఈ పరిశోధన ప్రకారం.. 80శాతం మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను పరిశీలించగా.. దాదాపు 2లక్షల మందికి కరోనా సోకినట్టు తేలింది. అయితే, నగరంలోని మురుగునీరులో 40శాతం మాత్రమే శుద్ధీకరణ ప్లాంట్లకు చేరుతున్నందున మొత్తంగా హైదరాబాద్‌లో 6లక్షల మంది కరోనా బారినపడి ఉండటం గానీ, మహమ్మారి నుంచి బయటపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే నగరంలో దాదాపు 6 శాతం ప్రజలు గడిచిన 30 రోజుల్లో కరోనా బారినపడడమో, దాన్నుంచి కోలుకోవడమో జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిలో లక్షణాల ఉన్నవారు, లేనివారు కూడా ఉంటారని సీసీఎంబీ తెలిపింది. వీరు గుర్తించిన అంశాలన్నీ ప్రీప్రింట్‌ సర్వర్‌మెడ్‌ ఆర్‌ఎక్స్‌ఐవీలో పోస్ట్‌ చేశారు.

తెలంగాణ సర్కార్‌ ఆగస్టు 19న విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95,700 మంది కరోనా బారిన పడ్డారు. ఈ తరహా ప్రయోగాలకు స్థానిక యంత్రాంగాలు కూడా కలిసి వస్తే హాట్‌స్పాట్లను త్వరితగతిన గుర్తించి వైరస్ కట్టడికి చర్యలు చేపట్టే ఆస్కారం ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్ మిశ్రా తెలిపారు. తమ పరిశోధనలో వైరస్‌ సోకినవారిలో ఎక్కువ మంది ఏ విధమైన కరోనా లక్షణాలూ లేనివారేనని, వారు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం వచ్చి ఉండదని పేర్కొన్నారు.

Comments (0)
Add Comment