Communism is a moldy theory..? కమ్యూనిజం.. ఓ బూజు సిద్ధాంతం

Communism is a moldy theory ..?

కమ్యూనిజం.. ఓ బూజు సిద్ధాంతం…?

గీ ముచ్చట విన్నరుల్లా.. సోషల్ మీడియా కామన్ మెన్ కాళ్ల దగ్గరకచ్చినంకా ఏదైనా తెలుస్తాది గదా. ఇగో గీ ముచ్చట ఎప్పుడు రాసిండ్రో.. ఎవరు రాసిండ్రో.. ‘కమ్యూనిజం ఓ బూజు సిద్ధాంతం..?’ అంటూ రాసిన నక్కరాధకృష్ణ గారి పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ నినాదాలు ఇచ్చే కమ్యూనిష్టులు ఐక్యంగా పోరాడాలనే సూచనలు వస్తున్న నేటి కాలంలో ఈ పోస్ట్ గురించి ఆలోచన చేయాలంటున్నారు.

కమ్యూనిజం.. ఓ బూజు సిద్ధాంతం

బూజు పట్టిన ఆ ముచ్చట్లు ఇంకెన్నాళ్లు చెబుతారు..?

సమాజంతో పాటు మీరూ మారండి.” ఈ మధ్య చాలా మంది మేధావులు ఈ తరహా విమర్శలు, సూచనలు తీరిక లేకుండా చేస్తున్నారు. సరే.. అది బూజు అంటున్నారంటే.. ప్రస్తుత సమాజానికి పనికిరాదని చెబుతున్నారంటే. మీరు దాన్ని కూలంకషంగా పరిశోధించి ఉండాలి. ఇప్పుడు చెప్పండ్రా.. మీలో ఎంత మంది కమ్యూనిజం సిద్ధాంతం చదివారు..? ఏయే పుస్తకాలు చదివారు..? అందులో మీరు శోధించి సాధించిన తప్పులేంటి? పనికొచ్చే మాటలు ఈ వైపు.. తాలు ముచ్చట్లు ఆ వైపు.. బూజుపట్టిన సిద్ధాంతాలు ఇంకో వైపు రాశులుగా పోయండి. మీ నాణ్యమైన ముత్యపు వాక్కులను మాత్రం వేరే వైపు పోతపోయండి. ఇక రండి చర్చలోకి వెళ్దాం.

అక్షరం ముక్కరానోడు కూడా..

అక్షరం ముక్కరాని వారి నుంచి.. పీహెచ్ డీ పట్టా పట్టుకున్నా కమ్యూనిజం గురించి ‘అ ఆ’లు కూడా చదవని వారి వరకూ అదో బూజు పట్టిన సిద్ధాంతం అని తీర్మానించేస్తున్నారు. ఏది బూజు..? మనుషులంతా సమానంగా బతకాలని చెప్పడమేనా బూజు..? కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి.. జనం పొట్టకొట్టొద్దని అనడమేనా బూజు..? రైతుకూలీలకు న్యాయం చేయండి.. వ్యాపారికి కాదు కార్మికుడికి న్యాయం చేయండి.. ఫ్యాక్టరీ ఓనర్ కు కాదని కోరడమేనా బూజు..? అసలు సిద్ధాంతమే లేని ఇంటి పార్టీలు.. కులం, మతం చిచ్చుకు చలికాచుకునే పార్టీలే మేలైనవా..? అంగీ ఇడిసినంత ఈజీగా పార్టీలను ఇడిసేస్తున్న రాజకీయ నాయకులే ఈ దేశానికి, రాష్ట్రానికి కావాలా..? వీళ్లేనా మీకు ఆదర్శం..? ఇదేనా కావాల్సింది..?

ఇలాంటి వాళ్లు చేసే దారుణాలు, అన్యాయాలపై కనీసం అభిప్రాయం చెప్పడం చేతకాని వాళ్ళు.. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం లేని వాళ్ళూ కమ్యూనిజం బూజు అనేస్తారా..? మరి, బూజును అలా వదిలేయొచ్చుగా..? పనిగట్టుకొని తిట్టిపోయడం ఎందుకు? 80 ఏళ్లు దేశం ఎవడి చేతుల్లో ఉంది..? వాళ్లు ఇప్పటివరకూ పొడిసింది ఏంది..? కళ్లలో ఏం పెట్టుకున్నరు..? వాళ్లని అడగడం వదిలేసి వీళ్లపై పడతారేందిరా..? దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుతినే వెధవలను, వాళ్లు తీసుకునే చెత్త నిర్ణయాలను ఎప్పుడైనా తప్పుపట్టారా..? వాళ్లు మీ వాళ్లు కదూ?! మర్చిపోయా.. మరి, మన తప్పును మలిచిపెట్టుకొని.. పక్కోడిమీదికి ఒంటికాలిపై లేస్తారా..? సిగ్గనిపించట్లే..? కమ్యూనిస్టు నాయకుల్లో దొంగలు ఉంటే.. వాళ్లను జనం ముందు నిలబెట్టండి. అంతేగాని చీకట్లో రాళ్లేసే చవటల్లా కమ్యూనిజంపై ఆరోపణలు చేయొద్దు.

తట్ట మోసే కూలీ నుంచి ఆఖరికి గుళ్లో పూజారి కూడా సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. కమ్యూనిజం చెప్పేది ఇదే కదా..! పోరాడితేనే కష్టాలు తీరుతాయని..!! దీన్ని తప్పుబడుతున్నారెందుకు..? ఏదో ఒక సమయంలో మీరూ నిత్యం అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఏందీ..? గుర్తొచ్చిందా..?? విమర్శ చేసేముందు కొంచెం వాడండి.

#కమ్యూనిజమేఏకైకమార్గం..

  • నక్కరాధకృష్ణ, రచయిత
Communism is a moldy theory..?/ ZINDHAGI.COM/ YATAKARLA MALLESH/ NAXALIGHT/ Communism / CPI ML / కమ్యూనిజం.. ఓ బూజు సిద్ధాంతం
Comments (0)
Add Comment