నాందేడ్ వేదికగా జరిగిన బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో
బిఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
ఛత్రపతి శివాజీ మహారాజ్, బావుసాట్, బి. ఆర్ అంబేద్కర్, డా. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రీబాయి ఫూలే వంటి మహామహులకు జన్మనిచ్చిన ఈ పవిత్ర భూమికి నేను ప్రణమిల్లుతున్నాను.
బిఆర్ఎస్ పార్టీ కొంతకాలం క్రితమే ఆవిర్భవించింది. ఇంతకుముందు టిఆర్ఎస్ పేరుతో ఈ పార్టీ తెలంగాణ కు మాత్రమే పరిమితమై ఉండేది.
దేశ పరిస్థితులను అర్థం చేసుకున్నాక, దేశ భావజాలాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించిన తర్వాత జాతీయ స్థాయిలో పనిచేయాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీగా మీ ముందుకు వచ్చాం.
నేను వినయపూర్వకంగా ప్రజలతో, మీడియా సోదరులతో కొన్న విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు వినబోయే మాటలను ఇక్కడే మర్చిపోవద్దు. మీ మీ ఇండ్లకు, గ్రామాలకు, పట్టణాలకు పోయాక తప్పకుండా ఈ విషయాలపై చర్చించండి.
దేశ గమనంలో, దేశ భావజాలంలో, దేశాన్ని నడపడంలో ఒక గొప్ప మార్పు అనివార్యమైంది.
మనకు స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో నాయకులు మారారు. మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎందరో మారారు. మనమే వాళ్ళను పదవుల్లో కూర్చోబెట్టాం. వారు భారీ భారీ ప్రసంగాలు ఇస్తారు. కానీ జరిగింది శూన్యం.
నేను మీకు చెప్పబోయే విషయాలు ఏవో రాకేట్ సైన్స్ కాదు. చాలా సాధరణ విషయాలు.
75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం కూడా త్రాగడానికి నీళ్ళుండవు. సాగు నీరు ఉండదు. విద్యుత్తు కూడా లభించదు.
దేశంలో ఈ వనరుల లభ్యత లేదా ? ప్రజలకు ఈ సౌకర్యాలను సమకూర్చలేమా ? దీని వెనుకున్న మతలబు ఏంటి ? ఈ విషయాన్ని మనం అర్థ చేసుకోవాలి. అర్థమయ్యాక కూడా అర్థం కానట్టు ఉండకూడదు. ఓసారి అర్థమయ్యాక అంతా ఏకం కావాలి.
మహారాష్ట్ర రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటి ? దయచేసి ఆలోచించండి.
రైతులు ఆత్మహత్యకు ఎలాంటి పరిస్థితుల్లో పాల్పడతారు ? అన్ని దారులు మూసుకుపోయి, అత్యంత బలహీన పరిస్థితుల్లో, ఆక్రోషంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో ? ఎంత వేదనను అనుభవిస్తున్నాయో ?
ఒక రైతు తన కుటుంబాన్ని, పిల్లలను వదిలి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు ?
ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టి, జీవితాన్ని ప్రసాదించే రైతన్నలు ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది ? దీని వెనుకున్న మతలబేంటి ? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా ?
ఓ వైపు మన రైతులు చనిపోతుంటే, రంగు రంగాల జెండాలు. గంటలకు గంటలు ప్రసంగాలు. అసెంబ్లీలో ప్రసంగాలు. పార్లమెంటులో ప్రసంగాలతో ఊదరగొడుతున్నారు. ఫలితం మాత్రం శూన్యం.
రైతుల పొలాల్లో ధాన్యం పండాల్సిన చోట, వారి ఆత్మలు తిరుగాడుతున్నాయి. ఈ ఆత్మహత్యలు ఆగడం లేదు.
అందుకే బిఆర్ఎస్ పార్టీ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏ పార్టీ ఇవ్వని అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది
మనం ఏకమైతేనే మతం పేరు మీద, రంగు రంగుల జెండాల పేరు మీద, కులం పేరు మీద, రాజకీయ పార్టీల పేరు మీద జరిగే విభజనను ఎదుర్కోగలం. పిడుగులమై ఎదిరించగలం. ఇది అసంభవమైన విషయం కాదు.
ఈ దేశంలో రైతుల సంఖ్య జనాభాలో 42 శాతం కంటే అధికంగా ఉంది. వ్యవసాయ కార్మికులను కూడా కలిపితే ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దీని కన్నా బలం అవసరం లేదు.
మీరు ఇంటికి వెళ్ళాక మీ సమయానుకూలంగా ఈ విషయం పై చర్చ పెట్టండి. కేసీఆర్ చెప్పిన మాటలు నిజమా … అబద్ధమా ఆలోచించండి. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించనట్టు ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి
భారతదేశం బుద్ధిజీవుల (మేధావుల) దేశం, తెలివిలేని వారు దేశం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రజలు మహామహ నాయకులను గద్దె దించారు.
దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించినప్పుడు, నిషేధాలు విధించినప్పుడు మహానేత జయప్రకాశ్ నారాయణ్ గారి పిలుపు మేరకు ప్రజలు గొప్ప గొప్ప నాయకులను పెకిలి పారేసారు.
ఇప్పటికే 75 సంవత్సరాల సుదీర్ఘ కాలం వేచి చూశాం. ఇప్పుడు రైతుల సమయం వచ్చింది.
నేటి వరకు మనం హలాన్ని (నాగలిని) పట్టి, కలాన్ని వేరే వాళ్లకు అప్పగించాం.
రైతులు కేవలం నాగలిని పట్టడమే కాదు కలాన్ని పట్టి, చట్టం చేసే అవకాశాలను కూడా పొందాలి.
రైతుల కేవలం మాటలు, నినాదాలకే పరమితిం కాకుండా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికవ్వాలి. అప్పుడే రైతు రాజ్యం నిర్మితమవతుంది. ఈ చైతన్యం రావాలి.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా పార్టీలు గెలుస్తాయి. రాజకీయ నాయకులు గెలుస్తారు. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. రైతులు గెలవాలి. మన సమస్యలకు అదే సమాధానం.
భారతదేశం పేద దేశమా ? అసలే కాదు.
రాజకీయాల్లో నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఎన్నో పదవులు చేపట్టాను. ఈ అనుభవంతో చెప్తున్నాను భారతదేశం అమెరికా కంటే ధనవంతమైన దేశం
మన నాయకులు సమర్థవంతంగా పనిచేస్తే అమెరికా కంటే గొప్పగా ఎదగగలం. ఇందులో ఎలాంటి సందేహం లేదు
ఈ ప్రకృతి, భగవంతుడు మనకు నాలుగు ముఖ్యమైన సంపదలను ఇచ్చాడు. నీరు, భూమి, బొగ్గు, కష్టించి పనిచేసే 140 కోట్ల ప్రజలు.
భౌగోళింకంగా అమెరికా మన కంటే రెండున్నర రెట్లు పెద్దది. కానీ వారి వద్ద వ్యవసాయ యోగ్యమైన భూమి 29 శాతం మాత్రమే ఉంది
చైనా మనకంటే ఒకటిన్నర రెట్లు పెద్దది. కానీ వ్యవసాయ యోగ్యభూమి కేవలం 16 శాతం మాత్రమే ఉంది.
మొత్తం ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే 50 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది.
భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు. దీంట్లో 41 కోట్ల ఎకరాలు భూమి వ్యవసాయ యోగ్యంగా ఉంది. ఇవి నేను చెప్తున్న గణాంకాలు కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం తేల్చిన గణాంకాలు.
ఈ దేశంలో 1 లక్ష 40 వేల టిఎంసిల వర్షపాతం సంభవిస్తుంది. దీంట్లో సగం నీరు భాష్పీకరణ ప్రక్రియ ద్వారా ఆవిరిగా మారతుంది. మిగిలిన 70-75 వేల టిఎంసిల స్వచ్ఛమైన నీరు నదుల్లో ప్రవహిస్తుంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కేవలం 20 నుండి 21 వేల టిఎంసిల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. మిగిలిన 50 వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రాల్లో కలుస్తుంది. ఇవి కేంద్రప్రభుత్వం వెలువరించి గణాంకాలే.
50 వేల టింఎసిల నీరు సముద్రల పాలవుతుంటే నాయకులు తమాషా చూస్తున్నారు. ఎన్నో చోట్ల తాగునీటికి కటకట.
మహారాష్ట్ర పరిస్థితి చూస్తుంటే నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడి నుంచే గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్ గంగా, వార్ధా, ఘట ప్రభా, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి వంటి ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. అపార జలవనరులున్న మహారాష్ట్రలో నీటికి కటకట ఎందుకు ? దీనికి కారకులు ఎవరు ? దయచేసి ఆలోచించండి. మీరు మీ మీ ఇండ్లకు వెళ్ళిన తర్వాత ఈ విషయం పై ఆలోచించండి.
75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో కాంగ్రెస్ 54 సంవత్సరాలు పాలించింది. బిజెపి 16 సంవత్సరాలు పాలించింది. విపి సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ వంటి నాయకులు సంవత్సరం, సంవత్సరంన్నర, ఎనిమిది నెలలు పాలించి నిష్క్రమించారు.
75 సంవత్సరాల కాలంలో 70 సంవత్సరాలు కేవలం కాంగ్రెస్, బిజెపి పార్టీలే పాలించాయి. ఈ దేశ దుస్థితికి కారణం ఈ రెండు పార్టీలే.
ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం మన అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు. రాజ్యాంగం మనకు ఈ హక్కును ప్రసాదించింది. మనం వ్యక్తులను నిందించడం లేదు. ఇప్పటివరకు జరిగిన చరిత్రనంతా నేను మీ ముందుంచుతున్నాను.
కాంగ్రెస్ పోతే బిజిపి వచ్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే ప్రేలాపనలు, విమర్శలు. నువ్వెంత తిన్నావ్ అంటే నువ్వెంత తిన్నావ్ అనే నిందారోపణలు, నీది ఈ కుంభకోణ అంటే నీది ఈ కుంభకోణం అంటూ పరస్పర విమర్శలు, అంబానీ … అదానీ అంటూ పరస్పర దూషణలు.
ప్రధానమంత్రి మోడీ గారు తెచ్చిన మేకిన్ ఇండియా … జోకిన్ ఇండియాగా మారింది. మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ?
దేశంలోని ప్రతీ చిన్న చిన్న పట్టణాల్లో చైనా బజార్లు వెలుస్తాయి. పతంగుల మాంజా, దీపావళి పటాకులు, హోళీ రంగులు, దీపావళి దీపాలు, మనం పూజించే వినాయకుని ప్రతిమలు, మన జాతీయ జెండా చైనా నుంచి వస్తాయి.
మేకిన్ ఇండియా అమలైతే చైనా బజార్లున్న చోట భారత్ బజార్ లు పేట్టేవారు కదా…? నాందేడ్, పర్బనీ, అకోలా, …. తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఎక్కడికి పోయినా చైనా బజార్లు కనిపిస్తాయి.
నేను మీ అన్నను, మీ కొడుకును. బాధాతప్త హృదయంతో ఈ విషయాలు చెప్తున్నాను. ఈ విషయాల పై బాగా ఆలోచించాలి.
ఈ దేశ ప్రజలకు తాగేందుకు నీరు ఉండదు. సాగునీరు లభించదు. మరోపక్క విద్యుత్ సమస్యలు. కానీ నాయకుల ప్రసంగాలు మాత్రం ఘనం. మన్ కీ బాత్, ఈ బాత్, ఓ బాత్ అంటూ అంటూ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతారు ?
ఈ పవిత్ర భూమి వేదికగా ఈ దేశ దుస్థితి పై, రావాల్సిన మార్పు పై చర్చించాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా యువత, కవులు, కళాకారులు, లాయర్లు, రచయితలు, మేధావులకు నేను వినమ్రపూర్వంగా విన్నపం చేస్తున్నాను.
ఇది రాజనీతికి సంబంధించి కాదు. మన జీవన్మరణాలకు సంబంధించిన సవాల్. ఇంకా ఎప్పటివరకు మనం చస్తూనే ఉందామా ? ఆత్మహత్య చేసుకునేందుకే మనం పుట్టామా ?
కొన్ని ముఖ్యమైన గణాంకాలు, వివరాలను నేను మీకు విన్నవించాలనుకుంటున్నాను.
మన దేశం కంటే చాలా చిన్న దేశమైనా జింబాంబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద దైన రిజర్వాయర్ ఉంది. దీని సామర్థ్యం 6533 టిఎంసిలు. అదే విధంగా ఆఫ్రికాలో నైలు నది పై, రష్యాలో అంగారా నది పై, చైనాలో యాంగ్జే నదిపై, అమెరికాలో కొలరాడో నది పై 3000 నుండి 5000 టిఎంసిల రిజర్వాయర్లు రూపుదాల్చాయి.
ఇంతటి సువిశాల భౌగోళిక స్వరూపం, పెద్దసంఖ్యలో జనాభా ఉండి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొనే ఈ దేశంలో కనీసం మూడు, నాలుగు రిజర్వాయర్లైనా ఉండకూడదా ?
ఓ వైపు రిజర్వాయర్లు కట్టరు, మరోవైపు ట్రిబ్యునల్ తగాదాలు లేల్చరు.
ప్రభుత్వం తల్చుకుంటే దేశంలోని ప్రతీ ఎకరం వ్యవసాయభూమికి సాగునీటిని సమకూర్చవచ్చు. కానీ వీరు రిజర్వాయర్లు కడతారా ?
ట్రిబ్యునళ్ళు, గ్రీన్ ట్రిబ్యునళ్ళు, ఎన్విరాన్ మెంట్ కమిటి అంటూ వీటి నుంచి అనుమతులు వచ్చే వరకు మరో పది పదిహేనేళ్ళు. ఆ తర్వాత బడ్జెట్. బడ్జెట్ పాస్ అయిన తర్వాత ప్రాజెక్ట్… ఇలా చేసుకుంటూ పోతే తరాలు అవుతుంది.
కిసాన్ సర్కార్ వస్తేనే దేశం పురోగమిస్తుంది.
ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణ పరిస్థితి కూడా మీకంటే దారుణంగా ఉండేది. రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వ్యవసాయరంగంలో సంక్షోభం ఉండేది. కానీ నేడు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది.
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోటీ – బేటి సంబంధం ఉంది. పరస్పరం రాకపోకలు సాగుతుంటాయి.
తెలంగాణ రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం.
రైతుల దగ్గరికి వెళ్ళి నీకెన్ని మోటర్లు ఉన్నాయి. వాటి సామర్థ్యమెంత అని అడిగే దమ్మున్న మొగోడు ఎవడూ లేడు. రైతులకు అవసరమైనన్ని మోటర్లను పెట్టుకుంటున్నారు. రైతులకు అవసరైమన సౌకర్యాలన్నింటినీ కల్పించాం.
రైతులు సహజంగా మరణించినా, ఏ కారణంతో మరణించినా వారు మరణించిన 8 రోజుల్లోగా వారికి రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందిస్తున్నాం. ఇప్పటివరకు మరణించిన 1 లక్ష మంది రైతులకు రైతుబీమా చెల్లించాం.
రైతులకు రైతుబంధు కింద ప్రతీ ఎకరానికి సంవత్సరానికి 10 వేల రూపాయలను పంట పెట్టుబడిగా అందిస్తున్నాం.
రైతులు పండించిన పంట కొనేందుకు 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మొత్తం పంటను మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నది
ఇది తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎందుకు సాధ్యం కాదు? కిసాన్ సర్కార్ ఏర్పడితే అది సాధ్యమవుతుంది.
దేశంలో 301 బిలియన్ టన్నుల అపార బొగ్గు వనరులున్నాయి. రోజుకు 24 గంటలు విద్యుత్ అందించినా 125 సంవత్సరాల వరకు ఈ బొగ్గు వనరులు సరిపోతాయి
మహారాష్ట్రలోనే అపార బొగ్గు వనరులున్నాయి. కానీ కరెంటు ఉండదు. ఏదో లోపం ఉంది.
మనం ఏకమయ్యే వరకు ఈ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి.
మనం అభివృద్ధి చెందాలంటే ప్రపంచ బ్యాంకు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు.
భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది. ఎన్నికల్లో గెలవడానికి పార్టీలు, నాయకులు అనుసరించని మార్గం లేదు.
నాయకులు మారుతున్నారు. కానీ ప్రజలు పరిస్థితి ఎందుకు మారటం లేదు
కిసాన్ సర్కార్ వస్తేనే రైతుల పరిస్థితి మారుతుంది
బక్కపల్చని వ్యక్తి ఇతనేం చేస్తాడని నన్ను విమర్శించారు. కానీ నేడు దేశం నన్ను చూస్తున్నది.
కిసాన్ సర్కార్ ను ఎన్నుకుంటే రెండు సంవత్సరాల్లో వెలుగు జిలుగుల భారత్ ను నిర్మిస్తాం. మహారాష్ట్రలోని మారుమూల గ్రామాల రూపురేఖలు మారుస్తాం. విద్యుత్ వెలుగులతో నింపుతాం.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు. మహారాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్ర అమలు చేయలేదా ? మహారాష్ట్ర సర్కార్ వద్ద ధనం ఉన్నప్పటికీ, వారికి ప్రజా శ్రేయస్సు పై మనసు లేదు.
తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమాన్ని మీరు అనుభవించాలనుకుంటే గులాబి జెండా పట్టుకొని మీరే నాయకులుగా ముందకు రండి. జనం నుండే నాయకులు ఉద్భవిస్తారనే విషయాన్ని మరవకండి.
బాల్క సుమన్ యువకునిగా తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టి తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్నాడు.
దేశ రైతులు తమ హక్కుల కోసం 13 నెలల పాటు ఉద్యమం చేసారు. 750 మంది రైతులు అసువులు బాసినా ప్రధాని నోట వెంట ఒక్క మాట రాలేదు. కంటి వెంట నీటి చుక్క కారలేదు. వారికి సాయం చేయమంటే నా కోసం రైతులు మరణించారా అంటూ వారిని దూషించారు.
నేను ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు. నేను రైతుల మద్దతుదారున్ని. ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలి. ప్రజలకు తాగేందుకు నీరు దొరకాలి. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు లభించాలి. పంటలకు తగినంత సాగునీరు అందాలి. పండించిన పంటలకు మద్దతు ధర లభించాలి.
దేశ రైతులను నాయకులు మభ్యపెడుతున్నారు. పంటలను కొంటారు.కానీ పైసలు సకాలంలో చెల్లించరు. మన చట్టాల్లో వైఫల్యం ఉందా ?
రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో రైతులు తమ బలాన్ని చూపిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మీ ముందు మోకరిల్లుతుంది. ఒకసారి మీ బలాన్ని చూపించమని వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాను.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వ్యవసాయరంగానికే కాకుండా నేత కార్మికులకు వారికి కావాల్సిన వస్తువులు, యాదవులకు గొర్రెలను సబ్సిడీ పై అందిస్తూ వస్తున్నది. మత్స్యాకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నాం. దోభీలకు దోభీఘాట్ లకు అవసరమైన ఉచిత్ విద్యుత్ ను అందిస్తున్నాం. ప్రతీ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాం. వేల విద్యాసంస్థలను స్థాపించుకుంటున్నాం.తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం వర్ధిల్లుతున్నది.
నాయకుల మభ్యపుచ్చే మాటలకు ఆకర్షితులు కావద్దు.
దళిత వర్గాలు, ఆదివాసీలు ఇంకా ఎంతకాలం వెనుకబడి ఉంటారు ?
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు దళితబంధు పథకం ద్వారా తిరిగిచ్చే అవసరం లేకుండా, బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 175000 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తూ ముందకు సాగుతాం.
బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతీ సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు, కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున దళితబంధును అందిస్తాం. రైతుబంధును ప్రతీ రాష్ట్రంలో అమలు చేస్తాం.
నేను కత్తులు పట్టమని మిమ్మల్ని కోరడం లేదు. అందరూ ఏకమై కొట్లాడితే రైతు రాజ్యం సాకారమవుతుంది
బిఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
భారీ సంఖ్యలో వచ్చి ఐకమత్యాన్ని చాటినందుకు, నా పై ప్రేమను చాటినందుకు ధన్యున్ని. ఈ ప్రేమను గుండెల్లో పెట్టుకుంటాను.
కేవలం 8 నుండి 10 రోజుల్లో ప్రతీ గ్రామానికి బిఆర్ఎస్ వాహనం చేరుకుంటుంది. అన్ని కమిటీలు ఏర్పడతాయి.
మహారాష్ట్రలోని అన్ని అసెంబ్లీ నియోజవర్గాలకు ఈ వాహనాలు చేరుకుంటాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలమైన శివ్ నేరి వేదికగా ప్రతిన బూని, మహారాష్ట్ర వ్యాప్తంగా రైతు కమిటీలు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర ఇలా మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టి బిఆర్ఎస్ ను బలోపేతం చేసే దిశగా నా శాయశక్తులా కృషి చేస్తాను.
(సీఎం కేసీఆర్ ప్రసంగం తెలుగులో అనువాదించిన మితృడికి ధన్యవాదాలు)
– వయ్యామ్యెస్