Clay book review మట్టిపాదం పుస్తకం సమీక్ష

Clay book review
మట్టిపాదం పుస్తకం సమీక్ష

పల్లెతల్లి పసిడి కాంతులు..
ఈ “మట్టిపాదం” కవితలు!!

నెర్రులుచాచిన నేలపై నింగి పంపిన ప్రేమ సందేశాన్ని మేఘుడు మోసుకొచ్చి వర్షించినప్పుడు.. ఆ ప్రేమామృత ధారల్లో తడిసిన పుడమి.. పులకించి ఎంత కమ్మని వాసన వెదజల్లుతుందో కదా!!

పైరు చేతపట్టుకుని నారుమడిలో మేనుని విల్లులా వంచి మునివేళ్ళతో నాట్లు వేస్తున్న పల్లెపడుచు నుదుట స్వేదం పై సుతారంగా పైరగాలి వీచినప్పుడు ఆ పడతి ఎంత పరవసిస్తుందో కదా..!!

ఆటుపోట్లు ఎన్నో భరించి నేలను చీల్చుకుంటూ మొలకెత్తిన విత్తు లేత ఆకులపై రవి కిరణాలు సోకినప్పుడు ఆ పచ్చని తొలిచిగురు పసిడి వర్ణంతో ఎంత ప్రకాశంగా కనువిందు చేస్తుందో కదా..!!

అదుగో..!! అచ్చం అలాగే..!! పుడమి పరవశం అంత హాయిగా, పల్లెపడుచు అంత స్వచ్ఛంగా.. పచ్చని ఆకుల్లో పసిడి కాంతులంత ప్రకాశవంతంగా ఉన్న కవితాసంకలనం తో ముందుకొచ్చాను నేడు..!!

పల్లెను ప్రాణంగా నింపుకోవడమే కాదు.. తానే పల్లె గా మారి కవితలను అల్లిన మన ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత “జి.ఈశ్వరీ భూషణం” గారి కవితా సంకలనం “మట్టిపాదం” పై నేటి సమీక్ష Clay book review

ఓ కంట కన్నీరు మరో కంట పన్నీరు ఒలికించడం ఎంత కష్టమో.. మనసునిండా సంతోషం, కడుపు నిండా దుఃఖం నింపుకొన్న భావాలు రెండింటినీ మేళవించడం కూడా అంతే కష్టం. మరి మన రచయితకు పుట్టుకతోనే పుణికివచ్చిన నిలకడ వ్యక్తిత్వమో.. అభ్యాసము వల్ల వచ్చిన అక్షరాల పై మక్కువో తెలీదు గానీ.. అందమైన పదబంధాలతో ఆర్తిగా అల్లుకుంటాయి అక్షర లతలు..

సామాజిక సేవనూ తన జీవితంలో భాగం

ఇటు సాహితీ సేవ తో పాటు సామాజిక సేవనూ తన జీవితంలో భాగం చేసుకున్న ఈశ్వరీ భూషణం గారు తన వాగ్భూషణం తో వివాదాల జోలికి పోకుండా ఉన్నట్టే ఆమె కవిత్వం కూడా సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుందే తప్ప ఎక్కడా వివాదాస్పదం కాదు. నిత్యం మన చుట్టూ కనిపించే అమ్మానాన్న, గురువూదైవం, పైరూగాలీ, నింగీనేలా, నీరూనిప్పూ, చీకటీవెలుగు లాంటి సహజమైన వస్తువులతో అనంతమైన భావాలతో కవితలల్లడం ఆమె ప్రత్యేకత..!!

“తల్లీ తండ్రీ గురువూ దైవం”

“తల్లీ తండ్రీ గురువూ దైవం” అంటారు.. అందుకేనేమో.. మొదటి మూడు కవితలు వారిపైనే మొదలవుతాయి.
తేజోవంతమైన సూర్యకిరణాల నే కాదు నిశీధి మయమైన అమావాస్య సుందర సోయగాలను తన కవితల్లో చూపిస్తారు.. అమ్మ ఒక నమ్మకం నాన్న ఒక నిజం అంటారు. అటువంటి అమ్మ పై రాసిన మొదటి కవితలో

” అమృతానికి ఆయుష్షు ఉందో లేదో కానీ..
అమ్మ చనుబాలతోనే కదా
నీ యశస్సు. ఉషస్సు.. వయస్సు..తేజస్సు..”!!

అన్నప్పుడు ఆమె తల్లి హృదయం మరింత ప్రేమమయంగా ఆవిష్కృతమవుతుంది.!

“నా గాయాలకు గేయమయ్యాడు
హృదయ వేదన సవ్వడి వినపడకుండా
నేనెక్కే శిఖరాలకు నిచ్చెనయ్యాడు”

అంటూ తండ్రిని కీర్తించినప్పుడు గుండెల్లో తడి ఎంత భారంతో నిండిపోయిందో తెలుసుకోడానికి ” హృదయ వేదన సవ్వడి” అన్న ఒక్క పద ప్రయోగం చాలదూ..!!

వృత్తి పరంగా స్వతహాగా గురువు అయిన మన రచయిత్రి గురువు కోసం రాసిన కవితలో

“తను నిలబడే ఉంటూ..
శిష్యులు ఒక్కో మెట్టు ఎక్కుతూ
శిఖరమంత ఎదుగుతుంటే
అంబరమంత సంబరం పడతాడు”

అన్న వాక్యాలు చదివినవుడు మన ఎదుగుదలకు దోహదం అయిన గురువులను కచ్చితంగా ఓసారి గుర్తుకొస్తారు కదా!!

ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టపడినా కన్నబిడ్డలకు కూడా మూడు పూటలా తిండి పెట్టలేని దయనీయ పరిస్థితి రైతుది.. అటువంటి అన్నదాత ఆవేదనకి అక్షర రూపం ఇస్తూ..

“నల్లరేగడిలో తెల్లబంగారం పండించి
మాగాణమ్మతో మణులు పండించిన మట్టి పాదాన్ని”!!
అంటూ నేలతల్లికి ప్రణమిల్లుతూ స్వయం శక్తి ని ప్రకటించినప్పుడు ఆమెలోని స్త్రీత్వానికి మనసారా నమస్కరించాలనిపిస్తుంది.!!

పురుషులతో పాటు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఆడవారిపై ఎక్కడో చిన్న చూపు తగుదునమ్మా అంటూ వెక్కిరిస్తూ నే ఉంటుంది.. అటువంటి మహిళా శక్తిని, ప్రధానంగా సహనం, అణకువ ఆడదానికి ఎంత అవసరమో తెలియజేస్తూ ఆత్మస్తైర్యం ఆహార్యం లో కనిపించేలా రాసిన”నేటి నారీ’ కవితలో అద్భుతంగా ఉన్నాయి ఈ వాక్యాలు.

” ఓర్పుకు నేర్పుకు ఓదార్పుకు
అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా
ఆత్మీయతతో అనురాగం పంచే నీకు వందనం”

“చీకటి బతుకుల చదరంగం
రంగుల అద్దాలతో
వెంగిలి విస్తరిలో
మిగులు మెతుకు కోసం
ఆ కళ్ళు వెతుకుతున్నాయి”- (చిగురించిన బాల్యం)

నిజానికి ఇది చిదిమేసిన బాల్యానికి నిలువుటద్దం. బాల్యం ఎంతో అందమైనది. కొందరికి రంగుల తివాచీ వేస్తే ఎందరికో ముళ్లబాటలా మిగిలిపోతుంది. ఇలా రాసుకొచ్చిన పై వాక్యాలు చిన్నతనంలో రచయిత్రి చూసిన సమాజంలో పేరుకుపోయిన అమానవీయతకు మచ్చుతునకలు. Clay book review

” రెండు నాలుకల మనిషిని నమ్మకు
వాడికి ఆపదైన వేళ నిన్ను వేడుకుంటాడు అవసరానికి వాడుకుంటాడు
ఆ తర్వాత నిన్నాడుకుంటాడు”

“నమ్మకం” కవితలో ఈ నాలుగు లైన్లు సమాజంలో రచయత్రి చూసిన స్థితిగతులకు నిదర్శనంగా గోచరిస్తాయి. ప్రస్తుత సమాజంలో అడుగడుగునా స్వలాభాపేక్ష, స్వార్ధం నిండిన మనుషులే అధికంగా ఉన్నారు. నటననే నిజముగా నమ్మించే ముసుగులోనే తియ్యని మాటలు, కమ్మని కబుర్లతో పనులు కానిచ్చి, తర్వాత తీరం దాటాక తెప్పను తగలేసే రకంగా తయారవుతున్నారు.. అందువల్ల మరింత జాగురత తో ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరించారు పై కవితలో..

పల్లె మనసంత స్వచ్ఛంగా మధురమైన భావాలే

ప్రతి కవితలోనూ పల్లె మనసంత స్వచ్ఛంగా మధురమైన భావాలే కాదు, అలతి అలతి పదాలతో కలసి అలవిమాలిన ప్రేమ ను జోడించి అక్షర కావ్యంగా లిఖించడంలో తన ప్రతిభ చూపించారు. బంధాల పట్ల ప్రేమ, మనుషుల మీద నమ్మకం, బాంధవ్యాల పట్ల బాధ్యత… ఇలా మనిషికి ఉండాల్సిన అన్ని గుణాలను తన కవితల్లో చూపించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు.

స్త్రీ లు పడుతున్న ఎన్నో బాధలు, నిరీక్షణ లో ఉండే మాధుర్యం, చేనేత బతుకుల్లో ఉండే వెతలు, మూగ బోయిన మగ్గాలు పలికే రోదనలు, రెక్కలు ముక్కలు చేసుకుంటూ రేయింబవళ్ళు కష్టపడే శ్రమజీవుల ఆశనిరాశలు, హేళన ముల్లు గుచ్చుకుంటున్నా గాయపడిన హృదయం పలికే గేయాలు, చక్కని పదబంధాలను ఈ కవితల్లో చూడొచ్చు. ఏ కవితలోనూ ఎవరి ప్రమేయమో కనిపించదు. కేవలం సమాజంలో తనకు ఎదురైన పరిస్థితులు మాత్రమే అగుపిస్తాయి.

నిండుకుండలా నిలకడైన వ్యక్తిత్వం, తంగేడు పువ్వు లా శోభాయమానంగా నవ్వుతూ కనిపించే అందమైన వదనం… ఇలా ఆమె ప్రవర్తనకు ప్రతిరూపాలు గానే కనిపిస్తాయి కవితలన్నీ.. సేవాతత్పరత తో అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈశ్వరి గారు సాహితీ జగత్తులోనూ తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవడం లో “మట్టిపాదం” మొదటి అడుగు అవుతుందనడం లో సందేహం లేదు.

పోరాటస్ఫూర్తిని కలిగించే రచయిత్రి కలం, గళం అంతే స్థాయిలో మానసిక ఉల్లాసాన్ని సైతం కలిగిస్తాయి. ముఖ్యంగా ఆమె కవితల్లో పల్లె వైద్యం, నమ్మకం, సెల్యూట్ టు డాక్టర్, కన్నీరే తోడుగా… ఇలా నిత్యం అందరికీ తారసపడే ఎన్నో అందమైన, ఆవేదనాభరితమైన పరిస్థితులకు ప్రతిరూపాలైన కవితలు చదవొచ్చు.

ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తూ.. తన వంతు సామాజిక బాధ్యతగా కొందరు పిల్లల్ని చదివించడమే కాకుండా కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో తన వంతు సేవలు అందించారు. ఉపాధ్యాయురాలిగా పలుమార్లు జిల్లా స్థాయి అవార్డు అందుకున్న ఆమె.. రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు. పలు సంస్థలు ప్రకటించిన అబ్దుల్ కలాం రాష్ట్ర ప్రతిభా పురస్కారం, గాంధీజీ సేవా పురస్కారం, సినారె సాహితీ పురస్కారం, గిడుగు రామ్మూర్తి రాష్ట్ర సేవ పురస్కారం తో పాటు పలు జిల్లా స్థాయి అవార్డులు ప్రతిభకు ప్రత్యేక స్థానం కల్పించాయి.

ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు

ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉంటారంటారు.. మన రచయిత్రి జీవితంలో సగభాగం అయిన జీవిత భాగస్వామి..పేరులో కూడా భాగమైన భర్త నాగభూషణం గారి తోడ్పాటుతో సాహిత్యరంగంలోనూ సమాజసేవలోనూ మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. Clay book review

కవితలన్నీ సాహితీ సోయగాలు వేదజల్లగా

పచ్చని పందిరి లో విరబూసిన ఎన్నో రకాల సుమాల వలె కవితలన్నీ సాహితీ సోయగాలు వేదజల్లగా… వాటికి మరింత అదనపు పరిమళాలను అద్దాయి ప్రముఖుల ముందుమాటలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు (కందుకూరు) మానుగుంట మహీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, ప్రజాకవి గోరేటి వెంకన్న గారు అభినందనలు తెలిపిన తీరు రచయిత పై వారికున్న అభిమానమే కాకుండా అపారమైన విశ్వాసాన్ని కూడా తెలియజేసేలా ఉన్నాయి.

శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి ముందు మాట కవితా సంకలనానికే సింహద్వారం గా నిలిచిందనడంలో సందేహం లేదు.

శ్రీ పిల్లం గోళ్ళ శ్రీ లక్ష్మి గారు ( ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్పర్సన్), డాక్టర్ జె. కృష్ణ ప్రసాద్ బాబు ( అసోసియేట్ ప్రొఫెసర్) గారు, కొల్లి రమాదేవి గారు (శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ కన్వీనర్) తెలిపిన ఆత్మీయ సాహితీ అభినందనలు కవయిత్రి పై మరింత బాధ్యతను పెట్టాయి. వారందరి ఆకాంక్ష ఫలించి మరెన్నో సంకలనాలు రావాలని మనమూ మనస్పూర్తిగా ఆశిద్దాం..💐💐💐

పుస్తక సమీక్ష : క్ర.సం – 65
పుస్తకం : “మట్టి పాదం”
రచయిత : ఈశ్వరీ భూషణం
ధర : 100
పబ్లికేషన్స్: శ్రీ శ్రీ కళావేదిక
సమీక్ష : అమ్ము బమ్మిడి

అమ్ము.బమ్మిడి, రచయిత

Clay book review / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment