Child story writer Mohammed Mahir
సాహస బాల కథా రచయిత
మొహమ్మద్ మాహిర్
ఒకప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా ‘బాలల మాసపత్రికలు’ ఉండేవి. పిల్లల కోసం అందులో పెద్దలు చేసిన రచనలే ఉండేవి. అయినా పిల్లలు బాగా చదివేవారు. చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి,బాలభారతం బాలరంజని ఇలా కొన్ని పత్రికలు ప్రత్యేకంగా పిల్లలకోసం ఉండేవి. ఇంచుమించు ప్రస్తుతం ఆ పత్రికలన్నీ కాలగర్భంలో కలసిపోయాయి. ఇప్పుడు కేవలం దినపత్రికలు ఆదివారం అందించే ప్రత్యేక అనుబంధాలలో ఒకటి రెండు పేజీలు పిల్లలకోసం కేటాయించినా అవి పెద్దవాళ్ళు రాస్తున్నవే అధికంగా కనిపిస్తున్నాయి. పిల్లల చేత ప్రత్యేకంగా రాయించే సాహసం ఎవరూ చేయడం లేదు. అంత ఓపిక ఎవరికీ ఉన్నట్టు లేదు. కొద్దిమంది ఆసక్తి వున్న ఉపాధ్యాయులు మాత్రం తాము పనిచేస్తున్న పాఠశాలల్లో పిల్లల చేత కథలు, కవిత్వం రాయిస్తున్నారు. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే! ఇది విశ్వవ్యాప్తముగా రావలసిన మార్పు.
పిల్లలు కథలు రాయాలన్నా
పిల్లలు కథలు చెప్పాలన్నా,వారి వారి స్థాయిలో కథలు రాయాలన్నా,వారికి అనుకూలమైన వాతావరణం పరిసరాలు అందుబాటులో ఉండాలి. అప్పుడే వారిలో నిద్రాణమై వున్న ఈ రచనా వ్యాసంగం అనే కళ బయట పడుతుంది. కొందరి విషయంలో ఎలాంటి అనుకూల పరిస్థితులు లేకున్నా అది బయటికి తన్నుకుని వస్తుంది. అది వేరే విషయం. పిల్లలలో రచనా వ్యాసంగం అలవాటు కావడానికి ముఖ్యంగా రెండువిషయాలపై ఆధారపడి ఉంటుందని నా నమ్మకం. అందులో మొదటిది జన్యు ప్రధానమైనది. అంటే తల్లిదండ్రులనుండి,తాత ముత్తాతలనుండి,ఇతర పూర్వీకుల నుండి సహజంగా అబ్బేది. ఆ కుటుంబంలో ఎవరో ఒకరు రచయితలై వుంటారన్నమాట !
ఈ బాలుడి తాతగారు మాత్రం..
ఇక రెండవ కోవకు చెందినవాళ్లు, చుట్టూతా వున్నవాతావరణం, పరిస్థితులను బట్టి ఆ అభిరుచిని స్వంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో కనిపించే రకరకాల పుస్తకాలు, సాహిత్య చర్చలు, పుస్తకపఠనం, దగ్గర్లో గ్రంధాలయం వంటి సదుపాయం ఉన్నవాళ్లకు తప్పనిసరిగా ఆ ప్రభావం పడి తీరుతుంది. ఇంచుమించు అలాంటి వాతావరణమే మన బాల కథారచయిత మొహమ్మద్ మాహిర్ చుట్టూ ఉందని నా నమ్మకం. అది ఈ బాల సాహిత్యకారుడు(ఎనిమిది సంవత్సరాల వయసువాడు) రాసిన ‘‘పంజూ (తోడేలు )సాహసగాథ’’ రాసిన కథ చూసిన /చదివిన తర్వాత మరింత బలపడింది. తల్లిదండ్రులకు సాహిత్యాభిలాష ఉందొ లేదోగానీ (వారిద్దరూ వైద్య రంగంలో ఉన్నారు) ఈ బాలుడి తాతగారు మాత్రం తెలుగులో మంచి సాహిత్యం పండిస్తున్న తెలుగు పండితుడు. మంచి సమీక్షకుడు. ఎంతో మంది కవిత్వాన్ని,సాహిత్యాన్ని(కథలు ,నవలలు ) పూర్తిగా చదివి క్షణాల్లో సమీక్ష చేయగల సమర్ధుడు. మహానుభావుడు. ఈయన ప్రభావం ఖచ్చితంగా మాహిర్ చిన్ని మెదడుపై ప్రకాశించిందని నా నమ్మకం.
పిల్లలకు అర్ధమయ్యే రీతిలో
మహిర్ మాతృభాష ఉర్దూ అయినా ఆ బాలుడు చెప్పిన కథను తాతగారు తెలుగులో చక్కగా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో పుస్తక రూపంలో తీసుకురావడం ఒక మంచి బాల రచయితను,బాల పాఠక లోకానికి పరిచయం చెయ్యడమే. కేవలం క్లాసు పుస్తకాలలోని పాఠాలు మార్కులకు మాత్రమే ప్రాధాన్యత నిస్తున్న నేటి తల్లిదండ్రులకు భిన్నంగా మాహిర్ తల్లిదండ్రులు,తాత శ్రీ రజాహుస్సేన్ గారు ప్రోత్సహించడం అభినందించ దగ్గ విషయం. అలా అని చదువును అశ్రద్ధ చేయమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. చదువుతో పాటు మన చిరంజీవి మొహమ్మద్ మాహిర్ లో వున్న ఇతర ప్రతిభా పాఠవాలను వెలికి తీసి ప్రోత్సహించడం. ఎందుకంటే ఇది అందరికీ అబ్బని గొప్ప ప్రతిభ. చిన్నవయసులోనే ఈ కళ మన మాహిర్ లో అంకురించడం తప్పనిసరిగా తల్లి దండ్రులకు,తాత అమ్మమ్మలకు గర్వకారణమే !
మాహిర్ మాతృభాష ఉర్దూ
అయితే ,చి . మాహిర్ మాతృభాష ఉర్దూ అయినప్పటికీ ,తాతగారు శ్రీ ఎ. రజా హుస్సేన్ గారు తన తెలుగు పాండిత్యాన్ని కొంతలో కొంతైనా మనవడికి వచ్చే అవకాశాల గురించి ఆలోచించాలి. ఇప్పటి నుండే ఆ ప్రయత్నంలో ఆయన ఉండడం సబబుగా ఉంటుంది. మనవడు మాహిర్,ఉర్దూ /తెలుగు భాషల్లో ముందుకు పోయేలా ప్రోత్సాహం అందించాలి. తోడేలు కథను అందమైన పుస్తకరూపంలో,ఖరీదైన పేపరుతో,మంచి మంచి బొమ్మలతో చాలా రిచ్ గా ముద్రించి,ఆకర్షణీయంగా ముద్రించారు. చూడగానే చదవాలనే ఆతృతను పిల్లల్లో కలిగించే విధంగా డిజైన్ చేయడం బాగుంది.యసాధారణంగా పుస్తకాలకు ముందువుండే ముందు మాటలు,ఇతర వివరాలు లేనందువల్ల ఈ పుస్తకం ఉచితంగా పంచడానికి ఉద్దేశించిందని తెలుస్తుంది.
లేత లేత పాఠకులకు ఈ పుస్తకం
ఆఖరు పేజీలో కొంత వివరణ ఇచ్చినప్పటికీ, ముద్రణకు సంబందించిన కనీస వివరాలు ఇచ్చి, దాని వెల ‘అమూల్యం’ అని పెడితే బాగుండేదేమో . ఇక్కడ కథను వివరించి, పాఠకులు ఈ పుస్తకాన్ని తెరవకుండా చేయడం నా ఉద్దేశ్యం కాదు కాబట్టి, ఇక్కడ కథను నేను వివరించదలచుకోలేదు. అయితే కథను వివరించే విధానంలో మరింత సులభతరం చేస్తే లేత లేత పాఠకులకు ఈ పుస్తకం మరింత చేరువయ్యే అవకాశం వుంది. పిల్లలు చదివి ఆనందించ దగ్గ పుస్తకం ‘పంజూ (తోడేలు )సాహసగాథ’ కథ చెప్పిన బాల కథా రచయిత చిరంజీవి మొహమ్మద్ మాహిర్ కు శుభాకాంక్షలు. మనవడిని తెరపైకి తీసుకు వచ్చిన శ్రీ ఎ . రాజాహుస్సేన్ గారికి అభినందనలు. పుస్తక ఇతర వివరాలకు శ్రీ ఎ . రజా హుస్సేన్ (9063167117)గారిని సంప్రదించవచ్చును.
– డా . కె . ఎల్ . వి . ప్రసాద్
కవి /కథారచయిత
హన్మ కొండ జిల్లా
9866252002