Cassette gossip about marriage పెళ్లి గురించి సరదాగా కాస్సేపు కబుర్లు

Cassette fun gossip about the wedding
పెళ్లి గురించి సరదా కబుర్లు

పెళ్ళంటే నూరేళ్ళు పంట
“గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, (భాగ్యనగరం) వారి పెండ్లి పిలుపు
ఇదో సరదా కవిత. ఓసారి చదవండి. చదివి అలా వదిలేయకండి మరి..‌చివర్లో కవి చేప్పొన విషయాన్ని
ఆలకించండి.!!

పెళ్ళికెళ్ళా

పెళ్ళికెళ్ళా
పెళ్ళాంతో వెళ్ళా
పిలిస్తేవెళ్ళా
పూగుఛ్ఛముతోవెళ్ళా

పెళ్ళిచూశా
పెళ్ళికొడుకును చూశా
పెళ్ళికూతురిని చూశా
పువ్వులను చూశా

పూలవేదిక చూశా
పూబోడుల చూశా
పసిపాపల చూశా
పూలసిగలను చూశా

పడుచుజంటను
చూశా
పంతులుగారి విన్యాసాలు
చూశా

పాణిగ్రహణం
చూశా
పాదపీడనం
చూశా

మంత్రాలు
విన్నా
మాంగళ్యధారణ
చూశా

పెళ్ళిప్రమాణాలు
విన్నా
పెద్దల దీవెనలు
చూశా

పెళ్ళిపందిరిని
చూశా
పుష్పాలంకరణను
చూశా

పడుచుపిల్లలు
పువ్వులందిస్తున్నారు
పన్నీరుచల్లుతున్నారు
పకపకలాడుతున్నారు

పెళ్ళిజంట
పూదండలువేసుకొనియున్నారు
పడతులు
పూలుపెట్టుకొనియున్నారు

పెళ్ళితో
భార్యాభర్తలవుతున్నారు
పెళ్ళితో
గృహస్థులవుతున్నారు

పెళ్ళి
ప్రేమను కలిగిస్తుంది
పెళ్ళి
భాధ్యతలను పెంచుతుంది

వధూవరులకు
తలంబ్రాలుతో పాటు
పువ్వులు కూడా
తలపై పోసుకున్నారు

పెళ్ళివిందులు
చేశా
పెళ్ళికానుకలను
ఇచ్చా

పెళ్ళంటే
ఇద్దరు మనుషులు కలయిక
పెళ్ళంటే
ఇద్దరు మనసుల కలయిక

పెళ్ళంటే
పూలవిన్యాసాలు
పెళ్ళంటే
పడతుల అలంకారాలు

బహుమతులు
ఇవ్వండి
కానుకలు
తీసుకోండి

పెళ్ళంటే
పదుగురి వేడుక
పెళ్లంటే
పలువురి కూడిక

పెళ్ళికిపిలిస్తే
తప్పకుండా వెళ్ళండి
పలువురితో
పరిచయాలు పెంచుకోండి

పెళ్ళిజంటలను
దీవించండి
పెద్దరికాన్ని
కాపాడుకోండి”!!

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త కాపురం. శ్రీ రస్తు శుభమస్తు (Cassette gossip about marriage)

ఆరుద్ర.!!

పెళ్ళికి అత్యున్నత స్థానం

పెళ్ళంటే నూరేళ్ళ పంట అన్నాడో సినీ కవి. భారతీయ సంస్కృతిలో పెళ్ళికి అత్యున్నత స్థానం వుంది. పెళ్ళంటే రెండు హృదయాలు, రెండు దేహాలు కలయిక మాత్రమే కాదు. రెండు కుటుంబాల కలయిక కూడా. అందుకే మన భారతీయ కుటుంబ వ్యవస్థలో పెళ్ళికి అత్యున్నత స్థానం కల్పించారు.

ఓ పెళ్లిలో ఫోటో తీయించుకొని..

మనల్ని ఎవరైనా పెళ్ళికి పిలిస్తే వెళ్ళక పోతే ఏమైనా అనుకుంటారేమో? అని మొక్కుబడిగా పోయి, హాజరు వేయించుకొస్తాం. పెళ్ళికి వెళ్ళామా? వచ్చామా? అన్నట్లు మొక్కబడిగా వెళ్ళొస్తాం. నిజానికి పెళ్ళి పవిత్రమైన కార్యం పెళ్ళికి వెళ్ళి నూతన వధూవరులను మనసారా దీవించాలి. నాలుగు అక్షింతలు వేసి, వారు కలకాలం కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించాలంటూ శుభకామన చేయాలి. అంతేకానీ ఆదరాబాదరాగా వెళ్ళి, వధూవరులతో ఓ ఫోటోతీయించుకొని వచ్చేయకూడదు. పెళ్ళి తతంగం ముగిసేవరకూ వుండి వధూవరులను మనసారా, ఆశీర్వదించి, తృప్తిగా భోంచేసిపెళ్ళి వారిచ్చే తాంబూలాదులు స్వీకరించి రావాలి.

పెళ్ళంటే పాణిగ్రహణం

పెళ్ళంటే పాదపీడనం. పెళ్ళంటే మంత్రాలు వినాలి. పెళ్ళంటే మాంగల్యధారణ. పెళ్ళంటే ప్రమాణాలు. పెళ్ళంటే పెద్దల దీవెనలు. పెళ్ళంటే పచ్చని పందిరి. పెళ్ళంటే రంగు రంగుల పుష్పాలంకరణ. మరి వన్నీ చూడాలి. వినాలిః వధూవరుల్ని ఆశీర్వదించాలి. (Cassette gossip about marriage )

అంతేనా…?

పెళ్ళంటే పూలవిన్యాసాలు పెళ్ళంటే పడతుల అలంకారాలు. పెళ్ళంటే బహుమతులు ఇవ్వాలి. కానుకలు తీసుకోవాలి. పెళ్ళంటే పదుగురి వేడుక. పెళ్లంటే పలువురి కూడిక. మనమూ అందులో వుండాలి. పెళ్ళికిపిలిస్తే తప్పకుండా వెళ్ళాలి. పెళ్ళి ఓ పరిచయ వేదిక. పలువురితో పరిచయాలు పెంచుకునే అవకాశాన్నిఅందుకోవాలి. అందుకే పెళ్ళికి పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళి జంటను దీవించాలి. తద్వారా మన పెద్దరికాన్ని కాపాడుకోవాలి.

విన్నారు కదా..! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, ఏమన్నారో..!

ఈ సారెప్పుడైనా పెళ్ళికి వెళితే మాత్రం ఆదరాబాదరాగా కాకుండా తాపీగా వెళ్ళి పెళ్ళి తతంగాన్ని కళ్ళారా చూసి, వధూవరులను మనసారా ఆశీర్వదించి, కడుపారా తృప్తిగా భోంచేసి రండి..!!

ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్

Cassette gossip about marriage /zindhagi.com / abdul rajahussen / yatakarla mallesh / wedding story / marriege story
Comments (0)
Add Comment