AP 39TV 23 ఏప్రిల్ 2021:
కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో 10 వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు ఇతర తరగతుల పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని శుక్రవారం నాడు కదిరిలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును, ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా పదోవ తరగతి మరియు ఇంటర్మీడియట్, ఇతర తరగతుల పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి రెండవ దశ లో ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే విద్యా సంవత్సరం సెలవులు ప్రకటించి ఇతర తరగతులకు ఎందుకు సెలవులు ప్రకటించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థులు పరీక్షలు రాయాలంటే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లి పరీక్షలు రాయాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని విద్యార్థులు భయాందోళనలతో పరీక్షలు రాసే పరిస్థితులు ఏర్పడతాయి అన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, కరోనా మహమ్మారి వ్యాప్తి లోను పరీక్షలు పెట్టి తీరుతామని ఒంటెద్దు పోకడలతో, ఏకపక్ష నిర్ణయాలతో అభం శుభం తెలియని విద్యార్థుల జీవితాలతో చెలగాటం మాడితే ఊరుకోబోమని హెచ్చరించారు, ఇప్పటికే పలు విద్యాసంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి రాష్ట్రప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని అన్నారు, ఒకే చోట ఒకే స్కూలు ఒకే తరగతి లో ఉన్న విద్యార్థులే కరోనా బారిన పడుతూ ఉంటే వివిధ ప్రాంతాల నుండి ఒక తరగతి రూమ్ లో చేరి పరీక్షలు వ్రాయడం అంటే అనేక మంది విద్యార్థులు భయాందోళనకు గురై పరీక్షలకు సైతం గైర్హాజరయ్యే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు, అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ఒక విద్యసంవత్సరం వృధా అవుతుందని అన్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి నిర్ణయాన్ని ఉపసంహరించుకుని విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సును,భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పదోవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఆపై తరగతుల పరీక్షల అన్నిటిని రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు కుల్లాయప్ప యాదవ్, నాయకులు ఉపేంద్ర, శ్రీధర్, కిరణ్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.